Friday, June 27, 2014

272 Publicity Craze of the New Government


272 క్రొత్త ప్రభుత్వం యొక్క పబ్లిసిటీ క్రేజ్
చర్చనీయాంశాలు: 272, పబ్లిసిటీ, ఇందిరాగాంధీ, నరేంద్రమోడీ
నాపోస్టు నంబర్ 269లో వ్రాసినట్లుగానే జరిగింది. అక్కడ వ్రాసింది: శ్రీమతి ఇందిరా గాంధీ తరువాత పబ్లిసిటీ స్పృహ అదే స్థాయిలో కలిగిన ప్రధాన మంత్రి, శ్రీ నరేంద్ర మోడీ. శ్రీమతి ఇందిర పాలించిన కాలంలో, మీడియా మొత్తం శ్రీమతి ఇందిరా వాక్కులతో, యాత్రావివరాలతో, నిండి ఉండేవి. శ్రీ నరేంద్రమోడీ గారు ఎంత చిన్న పనిచేసినా, ఆఫొటో, ఆవార్త, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో వెంటనే దర్శనమిస్తుంది. శ్రీమోడీని దర్శించటానికి వచ్చిన వాళ్ళు కూడ పబ్లిసిటీ కాన్షస్ అయితే ఇంక డబుల్ ధమాకా.

ఇపుడు క్రొత్తప్రభుత్వం, 30 రోజులు పూర్తయిన సందర్భంగా తమ ఘనకార్యాలను చాటి చెప్తూ ఒకవీడియోను విడుదల చేసింది. ఈ 30రోజులలో తాము ఏమి సాధించారోవారికే తెలియాలి:

నేరాన్ని పాత ప్రభుత్వం పైకి నెట్టి, రైలు ఛార్జీలను పెంచేశారు. కనీసం రైల్వై బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టే సమయంలో, ఈపని చేసి లోక్ సభలో చర్చ జరిపించి, అందరూ కలిసి పెంపు అనివార్యం అని తీర్మానించి ఉంటే సబబుగా ఉండేది. గత ప్రభుత్వం వలెనే, పార్లమెంటులో చర్చ అంటే భయం.

ఛార్జీలను పెంచకుండా, ఇతర పధ్ధతులలో రెవెన్యూని , వనరులను పెంచుకోటం అసాధ్యమా అనేది అధ్యయనం చేసి, ఆ అధ్యయనంలోని అంశాలను ఇంటర్ నెట్ లో పెట్టి ఉండాల్సింది.

ఛార్జీలను పెంచాక, దానిమీద నిలబడలేదు. మహారాష్ట్రలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి, ముంబాయి వోటర్ల ఆగ్రహానికి గురి కాకుండా, 80 కిలోమీటర్ల కన్నా తక్కువ ప్రయాణానికి పెరుగుదలను వెనక్కిలాగి, సీజన్ టికెట్లకు 30 ప్రయాణాల ఛార్జి చెల్లింపును మార్చి పాత 15 రోజుల ప్రయాణాలు చెల్లింపును పునరుధ్ధరించి, మొత్తానికి తమకు రైల్వేల ప్రక్షాళన కన్నా, ఎన్నికలు, వోట్లే ముఖ్యమని ఋజువు చేసుకున్నారు.

ఢిల్లీ యూనివర్సిటీచేత నాలుగేళ్ళ డిగ్రీకోర్సును మూడేళ్ళ కోర్సుగా మార్పు చేయించటంలో, మానవ వనరుల వికాసమంత్రిణి వ్యవహరించిన తీరు కూడ, కొంత నియంతృత్వ ధోరణిలోనే ఉంది. నాలుగు సంవత్సరాల కోర్సులను, మూడేళ్ళకోర్సులను ఎవరికి కావలసింది వారికి ఇచ్చే పధ్ధతి అచరణలో అసాధ్యం కాదు. ఇపుడు ఆ ఢిల్లీ విశ్వవిద్యాలయ ఉపకులపతి నాలుగేళ్ళ కోర్సుకి చేసిన కృషి అంతా, వృధా అయ్యింది. మేథావులను గౌరవంతో చూసే అలవాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. బిజెపి కూడ ఆతానులోని ముక్కేనని ఋజువు చేసుకున్నది.

విశ్వవిద్యాలయాల స్వాయత్తత గురించి శ్రీమతి స్మృతి ఇరానీ గారు చేసిన వ్యాఖ్యానం కూడ సమంజసంగా లేదు. విశ్వవిద్యాలయాల ఉపకులపతులను గుమాస్తాలుగా చూడటం కాంగ్రెస్ సంస్కృతి. గ్లామర్ గాళ్స్ కు 120 కోట్ల భారతీయుల మానవ వనరుల వికాసానికి నియోగిస్తే వాళ్ళకి వైస్ ఛాన్సలర్లను గౌరవించటం కూడ చేత కావటం లేదు. విద్యార్ధుల హితం మేము మాత్రమే కోరుతున్నాము, వైస్ ఛాన్సలర్లకేం తెలుసు, నిమ్మకాయ పులుసు అనుకుంటున్నారేమో.
సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా గోపాల్ సుబ్రహ్మణ్యం నియామకం విషయంలో, కేంద్ర ప్రభుత్వం చాల దురుసుగా వ్యవహరించి నట్లయ్యింది. కేంద్రన్యాయ శాఖ మంత్రి లేక ప్రధాని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చించి, ఆయనకు నచ్చచెప్పి, అదనపు క్రొత్త పేర్లను కాలేజియం చేత సిఫార్సు చేయించు కోవలసి ఉంది. కానీ అలా జరగలేదు. బ్లంట్ గా గోపాల్ సుబ్రహ్మణ్యం పేరును తిరస్కరించి, స్వతంత్రంగా వ్యవహరించే జడ్జీలంటే భయం అనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలుగ చేశారు. ఈతరహా నిరంకుశ పధ్ధతులలో ఇందిరా గాంధీకి , కొత్త బిజెపి ప్రభుత్వానికి ఏమీ తేడాలేదు, అని నిరూపించుకున్నారు.
ఇంక, ఢిల్లీ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో సమర్ధతను పెంచే నెపంతో, కార్యదర్శులను, ఉద్యోగులను భయపెట్టటం జరిగిందే తప్ప, స్వఛ్ఛంద క్రమశిక్షణ ను ప్రోత్సహించే పని జరుగలేదు.

ప్రభుత్వం ఎన్నికయ్యింది 1826 రోజులకి, 60 నెలలకే, కాబట్టి మనకు 60 వీడియోలను చూపించ బోతున్నారన్నమాట.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.