Friday, March 14, 2014

180 Jana Sena

180 Jana Sena
Topics for discussion, చర్చనీయాంశాలు: పవన్ కళ్యాణ్, హీరో పవన్ కళ్యాణ్, చిరంజీవి, హైటెక్స్, జనసేన

శ్రీపవన్ కల్యాణ్ మార్చి ౧౪ ఉపన్యాస సారంకొన్ని పాయింట్లు మిస్ అయినట్లున్నాయి. వాటిని ధృవపరుచుకుని తరువాత జోడిస్తాను.

అన్యాయానికి, అక్రమానికీ ఎదురు వెళ్తే అన్నయ్య చిరంజీవికి ఎదురువెళ్లవలసిన పరిస్థితి రావడం దురదృష్టకరం. ఇందుకు కారణం కాంగ్రెస్సే.

తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడైన నా అన్నయ్య చిరంజీవిని వ్యతిరేకించే ఉద్దేశ్యం నాకు లేశమాత్రం కూడా లేదు. నా గుండెల నిండా అన్నయ్యే.

నాకు ఏమీ లేకున్నా గుండె నిండా ధైర్యం ఉంది.

చిన్ననాటి నుంచి నాకు దేవరకొండ బాలగంగాధర్ తిలక్ కవితలంటే ఇష్టము.

నా పార్టీ ఆవిర్భావానికి కారణం ఢిల్లీ పెద్దల ముందు రాష్ట్ర నాయకుల బానిస బ్రతుకులే.

అన్నయ్య చిరంజీవికి వ్యతిరేకంగా కాదు.

జాతీయ సమగ్రతకు భంగం కలిగించే పనికి ఎవరు పాల్పడినా సహించేది లేదు.

సమాజం కోసం, దేశం కోసం ప్రాణాలు అర్పించే మొట్టమొదటి పిచ్చివాడిని నేనే.

సమాజంలో మార్పు తేవడమే ధ్యేయంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నాను.

మీరు రాష్ట్ర విభజన చేసిన తీరు మమ్మల్ని చాలా బాధించింది, చాలా గాయపరిచింది. ప్రజలను వంచించిన కాంగ్రెస్‌ను తరిమికొట్టాలి.

ఏవో సినిమాలు చేస్తూ, డ్యాన్సులు చేస్తూ మిమ్మల్ని ఆనందపరుద్దామనుకుంటే నన్ను అలా ఉండనీయడంలేదే.

అధికారానికి, పదవులకు దూరం.

నాకు కులం లేదు, మతం లేదు, నేను భారతీయుణ్ణి.

తనకు చిన్నప్పటినుంచే సామాజిక స్పృహ ఉంది.

సమాజంకోసం ఏమైనా చేయాలన్నది పాతికేళ్ల లక్ష్యం.

ఈ నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులకు కూడా ఏమీ చెప్పలేదు.

నాకు భారత దేశం ముఖ్యమా, నా కుటుంబం ముఖ్యమా అని ఆలోచించి ప్రజలకోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను.


ఇప్పటిదాకా ఉన్న పరిస్థితి వేరు..ఇప్పుడు వెళ్లబోయే పరిస్థితి వేరు. ఇళ్లేమో దూరం. దారంతా చీకటి. గతుకులు. కానీ దాన్ని చేరుకునేందుకు గుండెల నిండా ధైర్యం ఉంది. రచయిత దేవరకొండ బాలగంగాధర తిలక్ ను ఎప్పుడూ స్ఫూర్థిగా తీసుకుంటాను.

నేను సామాన్యుల లాగే బతకాలని ప్రయత్నించాను. కానీ నా జీవితంలో అన్నీ ప్రాణాలు పోయే సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటివే నాకు ఎందుకు వస్తున్నాయి అని ఆలోచిస్తే “నేను భాంచన్ దొరా నీ కాల్మొక్తా” అని అనను కాబట్టి.

‘నా తెలంగాణకు క్షమాపణ చెప్పాలని అడగటానికి మీరెవరు?' (తెరాస అగ్రనేత పుత్రి కవిత నుద్దేశించి).

వైబీరావు గాడిద వ్యాఖ్యలుఉపన్యాసాలు మూడు రకాలు. 1. ex tempore. అంటే అప్పటికప్పుడు మాట్లాడేవి. శ్రీ అరవింద్ కేజ్రీవాల్, కెసీఆర్, వంటి వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు.

2. స్పీచి రైటర్లు వ్రాసి ఇవ్వగా ముందుగా రిహార్సల్ లేకుండా, చదివేవి. ఇలాంటివి ఎక్కువగా రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, రాయబారులు, మొ|| చేస్తూ ఉంటారు. వీటి ముద్రిత కాపీలను కూడ ముందుగా పంచి పెట్టటం జరగచ్చు.

3. ఇతరులు వ్రాసి ఇవ్వగా బాగా రిహార్సల్స్ చేసి, హావ భావాలు సరిచూసుకొని, చేతులూపుకుంటూ చేసేవి. నటీనటులకు ఇవి కొట్టిన పిండి.

శ్రీపవన్ మార్చి ౧౪ ఉపన్యాసం మూడవ తరగతి. ఇవి అన్నీ పవన్ హృదయం లోంచి వచ్చాయని (డైరక్టర్లు వ్రాసి ఇచ్చినవి మాత్రమే కాకుండా), మనం ప్రస్తుతానికి కొంత మేరకైనా నమ్మవచ్చు.

మనం ఎవరినైనా సరే, వారు చెప్పిన వాటిని ఆచరించే అవకాశం ఇవ్వకుండా కొట్టేయటం న్యాయం కాదు. అందుచేత మనం శ్రీపవన్ జీ తాను చెప్పినవి ఎన్ని ఆచరిస్తాడు అని ఆశతో ఎదురు చూడటమే మార్గం. అయితే కొన్ని అంచనాలను వేయవచ్చు. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఏ పార్టీతో నైనా పొత్తుకు సిధ్ధమే అని శ్రీ పవన్ అన్నారు. అంటే అవినీతి చిన్నరాజా మరియు వెన్నుపోటు సామ్రాట్ శ్రీ చంద్రబాబుతో, అవినీతి సామ్రాట్ శ్రీ జగన్ తో పొత్తుకు రెడీయే. ఇంక మీరు ఊహించుకోండి.

అన్న చిరంజీవి తనను నమ్మి గెలిపించిన నియోజక వర్గాల ప్రజలను, గెలిపించలేక పోయినప్పటికీ వోట్లేసిన ఇతర నియోజక వర్గాల ప్రజలను నట్టేట ముంచి సోనియగాంధీ గారికి బానిసగా మారారు కదా. శ్రీపవన్ ఆ పని చేయడని ఎలా నమ్మటం.

ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చారనుకుందాం. ఒకవేళ పవన్ కల్యాణ్ జన సేన వారు వెన్నుపోటు పొడిస్తే, ప్రజలు దాని ఫలితాన్ని, 2019 ఎన్నికలు వచ్చేదాకా అంటే అయిదేళ్ళు అనుభవించాలి. ఇంక ఛాన్సులు ఇవ్వకూడని వారు, ఇవ్వచ్చేమో అనుకునే వారిని రెండు వర్గాలుగా విభజించు కోవచ్చు.

ఛాన్సులు ఇవ్వకూడని వర్గం: కాంగ్రెస్, శ్రీచంద్రబాబు, శ్రీజగన్, బిజెపి.

ఒక ఛాన్స్ ఇవ్వచ్చేమో: కిరణ్, ఉండవల్లి, హర్షకుమార్ మొ|| సమైక్యాంధ్ర పార్టీ.

రెండు ఛాన్సుల వరకు ఇవ్వవచ్చేమో: వామపక్షాలు, లోక్ సత్తా, ఆం ఆద్మీ.

శ్రీపవన్ తో గత అనుభవాలుసినిమా రంగంలో శ్రీపవన్ కల్యాణ్ నెలకొల్పిన ఆదర్శ ప్రమాణాలేమీ లేవు. కోట్లు సంపాదించాకైనా, తనకు భద్రత చేకూరింది కాబట్టి, కొన్ని లక్షలు ఖర్చుబెట్టి చిన్ననటులతో ఒక్కటైనా ఆదర్శ చిత్రం నిర్మించలేదు. కంప్యూటర్లు, డిజిటాల్ కెమెరాలు వచ్చాక ఫిల్మ్ వాడకం తగ్గి, సినిమాల ఖర్చును బాగా తగ్గించే అవకాశం కలిగింది. పవన్ గారు జనతా సినిమా హాళ్ళను తక్కువ ఖర్చుతో నిర్మించి జనతా సినిమాలను ఎందుకు ప్రదర్శించ లేక పోయారు? పోనీ తన ఆదాయంలో 2% జనతా లేక కళాత్మక చవక సినిమాలకు, చవక సినిమా హాళ్ళకు, చవకగా సినిమా నిర్మాణ పధ్ధతులకు కేటాయించారా?

సిధ్ధాంతాల లేమిశ్రీపవన్ పెట్టుతున్నది ప్రాంతీయ లేక ఉపప్రాంతీయ పార్టీయే కాబట్టి పెద్దగా ఆర్ధిక సిధ్ధాంతాలు అవసరం లేదు. కమ్యూనిస్టు నేత శ్రీనారాయణ గారు, శ్రీపవన్ కల్యాణ్ తన విధానాలేమిటో చెప్పనిదే ఆయనతోపొత్తెలా పెట్టుకుంటాం అన్నారు. రాష్ట్రంలో సిపిఐకి ఏవో గొప్ప సిధ్ధాంతాలు ఉన్నట్లు. ఏపార్టీ నేతలైనా చికెన్ నములుకుంటూ (లేదా అప్పటికే మింగేయటం పూర్తియితే, గొంతులోకి తెచ్చుకుని బ్రేవ్ మని త్రేన్చుకుంటూ, విస్కీనో బ్రాందీనో చప్పరించుకుంటూ), చెప్ప గలిగిన సిధ్ధాంతాలు ఏముంటాయి. షాడ్ చేపలతోనో, తాబేళ్ళతోనో పొట్టను భర్తీచేశాక శ్రీస్వామీ వివేకానందా గారిచ్చే వేదాంతోపన్యాసాల్లాగా మేడిపండ్ల లక్షణాలు కలిగిఉంటాయి.

సినిమా వ్యాపారానికి, రాజకీయ వ్యాపారానికి చాలా పోలికలు ఉన్నాయి. సినిమా వ్యాపారంలో థియేటర్ కాప్చరింగ్ ఉంటే, రాజకీయ వ్యాపారంలో బూత్ కాప్చరింగు, రౌడీమూకల వినియోగం ఉంటాయి. రిస్కులు ఉన్నట్లే కనిపిస్తాయి, ఉండవు. రిస్కులు లేనట్లే కనిపిస్తాయి, కానీ ఉంటాయి.

ప్రస్తుతం నేను శ్రీకాళహస్తీశ్వర శతకం ఆంగ్లానువాదం, హిందీ అనువాదం చేస్తున్నా కాబట్టి ఒక పద్యాన్ని కోట్ చేస్తాను.

ఈ పద్యం మత్తేభం. ఏనుగు లాగా నడుస్తుంది.

దురమున్‌, దుర్గము, రాయబారము, మఱిన్‌ దొంగర్కము న్వైద్యమున్
నరనాథాశ్రయ, మోడబేరమును, బెన్మంత్రంబు సిద్ధించినన్
అరయన్ దొడ్డఫలంబు గల్గు, నదిగాకా కార్యమే తప్పినన్
సిరియుంబోవును ప్రాణహానియునగున్ శ్రీ కాళహస్తీశ్వరా!

తాత్పర్యం

దురం అంటే యుధ్ధం. రాజకీయం అంటే యుధ్ధమే కదా.
దుర్గము అంటే కోటను ముట్టిడించటం. ఇక్కడ నియోజకవర్గాలను ముట్టడించటం అనే అర్ధం తీసుకోవచ్చు.
రాయబారం అంటే రెండు వర్గాల మధ్య సంప్రదింపులు జరపటం. పార్టీలో తమ్ముళ్ళు కొట్టుకుంటూ ఉండటం నిత్యం, తథ్యం కాబట్టి, బుజ్జగించాల్సి వస్తుంది కాబట్టి, రాయబారాలు కూడ అవసరమే.
దొంగరికం అంటే దొంగతనం. ప్రభుత్వ సొమ్మును దొంగిలించకుండా ప్రజా ప్రతినిథులు కోట్లు ఎన్నికలలో ఎలా ఖర్చు పెట్ట గలుగుతారు?

వైద్యం. వైద్యాన్ని ధూర్జటీ కవీంద్రుడు ఆనాడే రిస్కీగా గుర్తించారు. నేడు దీన్ని గురించి విడిగా మనం వంద పేజీలు వ్రాసుకోవచ్చు. చెత్తకాదు. వైద్యరంగంలో బోల్డు సమస్యలున్నాయి.

నరనాథాశ్రయం అంటే రాజులను ఆశ్రయించటం. సోనియా గాంధీని ఆశ్రయించక పోయినా నరేంద్ర మోడీ నైనా ఆశ్రయించాల్సి వస్తుంది. రాష్ట్రస్థాయిలో కూడ కొన్నిసార్లు అధికార పార్టీకి తొత్తుగా మారాల్సి వస్తుంది.

ఓడ బేరం. అంటే సముద్ర వ్యాపారం. ఇప్పటి కాలంలో అయితే ఎగుమతులు, దిగుమతులు, విదేశీ పెట్టుబడుల కొరకు విదేశాలతో తిక్కాంధ్రప్రదేశ్ చేసుకోబోయే ఒప్పందాలు, వీటన్నిటిని ఓడ బేరంలో కలపచ్చు.

పెన్ మంత్రంబు అంటే పెద్ద మంత్రం. ఆకాలం పెన్ మంత్రాలకు నేటి పెన్ మంత్రాలకు తేడా ఉంది. నేటి పెన్ మంత్రాలేమిటి అంటే నినాదాలు. పిచ్చాంధ్రుల ఆత్మ గౌరవం, స్పెషల్ స్టేటస్ వంటివి అన్నీ మంత్రాలే.

ఇవి అన్నీ అనుకూలిస్తే గొప్ప ఫలితాలు కలుగుతాయి. వికటిస్తే కార్యం తప్పుతుంది, అంటే పని పాడవుతుంది. (సినిమా రంగంలో నేడు ఉన్న స్థానమూ పోతుంది. రాజకీయాల్లో వేషాలూ గల్లంతౌతాయి.)

సిరియున్ పోవును. ఆస్తి కరిగి పోతుంది. (ఇపుడు రాజకీయాలలో స్వంత ఆస్తి ఎవరు కరిగించుకుంటున్నారు. పార్టీ టికెట్లను ధనవంతులకు అమ్మి క్యాష్ చేసుకున్నారని శ్రీచిరంజీవిపై ఆరోపణలు వచ్చాయి. నేడు జగన్ జీ పై కూడ ఈ దుమారం ఉంది).


ప్రాణ హానియు నగు. అంటే ప్రాణాలు పోతాయి. ఈప్రాణాలు పోవటం అనేది పాతకాలంలో. ఇపుడు నాయకులకు నీడలాగ ప్రక్కనే అంగరక్షకులు మంచి భంగిమలలో నిల్చుంటున్నారు.

వైబీరావు గాడిద వ్యాఖ్యల కొనసాగింపు

మద్యం నియంత్రణం


నేను ఆశ పెట్టుకోలేదు కానీ, శ్రీపవన్ మద్యాన్ని నియంత్రించటం పై ఏదైనా చెప్తే బాగుండేది. కొంచెమైనా చెప్పి ఉంటే బాగుండేది.

మద్యాన్ని పూర్తిగా నిషేధించటం దాదాపు అసాధ్యం. మహిళలు పూర్తి స్థాయి నిషేధాన్ని కోరుతారని కూడ నేను అనుకోను. ప్రజలలో 20% పురుషులు మద్యానికి, అతి మాంసాహారానికి పూర్తిగా బలి అయ్యారు. ఇంకో 50% మంది మద్యానికి, బజార్ జంక్ నాన్ వెజ్ బిరియానీలకు, చికెన్ పకోడీలకు, కాల్చిన మేక తలకాయలకు తొడలకో ఒకమాదిరిగా రసికులై, పూర్తిస్థాయి దాసులయ్యే మార్గంలో పయనిస్తున్నారని శ్రీపవన్ జీ కి తెలుసనే అనుకుంటున్నాను. ఫలితంగా కాలేయ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. నిషేధిస్తే వీరందరి గుండెల్లో చిచ్చులు రగులుతాయి. నిషేధించకపోతే ఇంట్లో ఆడవాళ్ళ, పిల్లల భవిష్యత్ అంధకారమవుతుంది. పరిమాణాన్ని తగ్గించటం, అంటే వారానికి ఒకరోజు మాత్రమై మద్యాన్ని అమ్మటం, దాసులకు రేషన్ కార్డులు ఇచ్చి గరిష్ఠంగా ఒక 100 ఎంఎల్ 100% ఆల్కాహాల్ లేక దానికి సమానమైన తక్కువ శాతం ఆల్కాహాల్ ఉండే బీర్ మొదలగునవి, తక్కువ పన్నులతో ఇవ్వచ్చేమో. ఈరంగంలో నేను నిపుణుడను కాదు.


చేతివృత్తులు, కుటీర పరిశ్రమలు

నశించి పోతున్న గ్రామీణ వృత్తులను, గ్రామాల, చిన్న పట్టణాల కుటీర పరిశ్రమల గురించి ఏమన్నా చెప్తారేమో నని ఆశపడ్డాను. అక్క ఆశే కానీ బావ బ్రతకడని కదా సామెత.

ఎన్నికలలో పాల్గొని సీట్లు గెలవటం ముఖ్యమే. గ్రామాల్లో పార్టీలు తమ యూనిట్ల ద్వారా మద్యం స్వయం నియంత్రణను, గృహ పరిశ్రమలను ప్రచారం చేయటం, గృహ పరిశ్రమలను స్థాపించటంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించటానికి ప్రయత్నించటం ముఖ్యం.

ఇంకా ఉంది. త్వరలో జోడిస్తాను.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.