Thursday, November 7, 2013

045 Part 2 of పటేల్_నెహ్రూ పోలికలు 2వ భాగం. Advani's comparison of Patel & Nehru,Part 2

#045 పటేల్_నెహ్రూ పోలికలు 2వ భాగం. Advani's comparison of Patel & Nehru,Part 2.

ఏదో విధంగా , పటేల్ గారిని జగదేకవీరుడు, అతిలోకసుందరుడు గాను, నెహ్రూగారిని అసమర్ధుడు గానూ నిరూపించి , పటేల్ గొప్ప తనానికి తనను వారసునిగా ప్రకటించకోవాలనే తాపత్రయం శ్రీ ఎల్ కె అడ్వాణీ గారిలో ప్రవేశించి ఆవేశించి నట్లు కనిపిస్తుంది.

జవహర్ లాల్ నెహ్రూ యొక్క వారసులం, తామని ప్రకటించుకునే హక్కు నెహ్రూ కుటుంబానికే లేదు. ఎందుకంటే నెహ్రూ గారి యొక్క సిధ్ధాంతాలకు, ఆయన స్వప్నాలకు ఇందిరాగాంధీ కాలంలోనే తిలోదకాలు ఇవ్వటం జరిగింది. నెహ్రూ నిర్మించుకున్న సౌధాలకు , నెహ్రూకుటుంబ పాలన నేడు మిగిల్చింది మొండిగోడలే.

పటేల్ గారికి వారసులు తామని బిజెపీ వారు అనుకుంటే, అప్పుడు వారు సావర్కార్, గోల్వల్కర్ల వారసత్వాన్ని కోల్పోతారు. పార్టీల సిధ్ధాంతాలు అనేవి ఎలా పడితే అలా లాగటానికీ పీకటానికీ, పీచుమిఠాయిలు కావు. అవో ఇవో, అంతేకానీ రెండూ కావు.

పటేల్ నెహ్రూల గొప్పతనాలను పోల్చటం అర్ధం లేని పని. ఎందుకంటే, ఎవరి గొప్పతనాలు వారికి ఉంటాయి. ఎవరి లోపాలు వారికి ఉంటాయి. వారి మధ్య సిధ్ధాంతిక విభేదాలు తీవ్రమైనవే ఉండి ఉండ వచ్చు. అయితే వారు కలసి నిర్మాణాత్మకంగా పనిచేయటానికి ఆ విభేదాలు అడ్డురాలేదు. వారి మధ్య జరిగిన చిన్నచిన్న కీచులాటలను అడ్వాణీగారు అదే పనిగా, పైగా సరియైన సాక్ష్యాలు లేకుండా కేవలం చేతులుమారిన సెకండ్ హ్యాండ్ సమాచారం ఆధారంగా, వేలెత్తి చూపటం సరికాదు.

స్వాతంత్ర్యానంతరం పటేల్ దీర్ఘకాలం జీవించి లేరు. ఉంటే ఏమి జరిగి ఉండేది అనేది ఉహాజనితమైన ప్రశ్న. రాజాజీ లాగా వేరే పార్టీ పెట్టుకునేవారా, లేక రాజకీయాల నుండి విరమించేవారా,లేదా సర్దుకుపోయి నెహ్రూజీ మరణానంతరం ప్రధాని అయ్యే వారా, ఇవి అన్నీ పరిశీలనకు పనికి వచ్చినా చరిత్ర అవవు.

గాంధీగారికి కూడా, ఈ ఆల్టర్ నేటివ్ లు వర్తిస్తాయి. స్వాతంత్ర్యానంతరం గాంధీజీ దీర్ఘకాలం జీవించి లేరు. ఉంటే ఏమి జరిగి ఉండేది అనేది ఉహాజనితమైన ప్రశ్న. రాజాజీ లాగా వేరే పార్టీ పెట్టుకునేవారా, లేక తన నిర్మాణాత్మక సంఘ సంస్కరణా కార్యక్రమాలనూ, గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాలను కొనసాగించే వారా, లేదా ప్రార్ధనలకు_పత్రికా రచనలకు అంకితమయ్యేవారా, ఈప్రశ్నలన్నీ, అన్నీ పరిశీలనకు అర్హమైనవే అయినా, చరిత్ర అవవు.

ఇంక, శ్రీఅడ్వాణీగారు భారత ఉప ప్రధానిగా, హోంమంత్రిగా పనిచేశారు. శ్రీ పటేల్ గారి ఆదర్శాలను ఏమాత్రం ఆచరణలోకి తెచ్చారు అనేది అనుమానాస్పదమే. భారత ప్రయాణీకుల విమానాన్ని తాలిబాన్లు (లేక కాశ్మీర్ తీవ్ర వాదులు) కాబూల్ కు హైజాక్ చేసినపుడు, హోంమంత్రిగా శ్రీవారు ఎంత దృఢంగా వ్యవహరించారో చరిత్ర చెప్తుంది. వినాయకుడి విగ్రహాలు పాలు తాగుతున్నాయంటే, పాలక్యారేజీ తీసుకొని గుళ్ళకు పరుగెత్తే మన శ్రీ అడ్వాణీవారు, సీమాంతర తీవ్రవాదం అని మొత్తుకోటం తప్ప ఎన్ని దృఢ నిర్ణయాలు తీసుకున్నారో చరిత్రే చెప్తుంది.

2013 విషయానికి వస్తే, నరేంద్రమోడీ గారు , శ్రీఅడ్వాణీవారిని బిజెపీ పార్లమెటరీ బోర్డు నుండి గెంటి వేయలేదనే తప్ప , తత్సమానమైన పరిస్థితులనే కల్పించారు. రాజాజీ లాగా వేరే పార్టీ పెట్టుకునేవారా, లేక రాజకీయాల నుండి విరమించేవారా,లేదా సర్దుకుపోయి నెహ్రూజీ మరణానంతరం ప్రధాని అయ్యే వారా, వంటి ప్రశ్నలు శ్రీఅడ్వాణీవారికి కూడా వర్తిస్తాయి. శ్రీఅడ్వాణీ, నరేంద్రమోడీ , రాజ్ నాథ్ ల మధ్య ఏమి రహస్య సమాలోచనలు జరిగాయో కానీ భీష్మపితామహులవారు, నిజంగా భీష్మపితామహులవలెనే యుధ్ధరంగంలోకి దిగారు. అయితే, సుయోధనుడు భీష్మపితామహులవారిని మనసా వాచా కర్మణా నమ్మి గౌరవించారు. మోడీజీకి సుయోధనుడికి ఉన్న నిజాయితీ ఉన్నదా, లేదా అనేది ప్రశ్నార్ధకం.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.