కర్నూలులో రాష్ట్రావతరణ దినాన్ని రాయలసీమ విద్రోహ దినంగా మార్చి ఒక పెద్ద ప్రదర్శనను నిర్వహించటాన్ని పై ఈనాడు వార్తలో చూడవచ్చు.
కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేయాలి
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు రావాల్సిన రాజధానిని అమరావతికి తరలించి గత పాలకులు తీవ్ర అన్యాయం చేశారని రాయలసీమ విద్యార్థి ఐకాస నాయకులు సునీల్‌రెడ్డి, శ్రీరాములు, చంద్రప్ప, ప్రశాంత్ పేర్కొన్నారు.
శ్రీబాగ్ ఒప్పందాన్ని ఈ ఉద్యమ నాయకులు బాగానే గుర్తుపెట్టుకున్నారు. ౧౯౩౭లో ఈ ఒప్పందం జరిగింది. ఆనాటి రాయలసీమ కోస్తాంధ్ర నాయకులు తమ మధ్య ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకోవాలని ప్రయత్నించారు. కుల, మత, ప్రాంత , ఇతర సదభిమానాలు, దురభిమానాలు ఆనాటి వారు మొహమాటం లేకుండా చర్చించుకొని ఉంటారు. ఆనాటి నాయకుల అంతరంగాలు మనకు తెలియవు కాబట్టి వాటిని చర్చించటం వల్ల నేటి ౨౦౨౨ తెలుగువారికి అంత ప్రయోజనం ఉంటంంది నేను అనుకోను. ముఖ్యాంశము వీకీపీడియా కోట్ ఈక్రింద ఇస్తాను-- https://te.wikipedia.org/wiki/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%AC%E0%B0%BE%E0%B0%97%E0%B1%8D_%E0%B0%92%E0%B0%A1%E0%B0%82%E0%B0%AC%E0%B0%A1%E0%B0%BF%E0%B0%95
--విశ్వవిద్యాలయము: రెండు ప్రాంతాల మధ్య సాంఘిక, సాంస్కృతిక సమానత్వం కొరకు విద్యా కేంద్రాలు ఏర్పాటు చెయ్యాలి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కింద అనంతపురంలో ఒక కేంద్రం ఏర్పాటు చెయ్యాలి.
--సాగునీటిపారుదల అభివృద్ధి: వెనకబడ్డ రాయలసీమ ప్రాంతం కోస్తా ప్రాంతంతో సమానమయ్యే వరకు సాగునీటి సరఫరా విషయంలో రాయలసీమ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి.
--శాసనసభ స్థానాలు జనాభా ప్రాతిపదికన కాక, ప్రాంత విస్తీర్ణం ఆధారంగా నిర్ణయించాలి. రాయలసీమలో జనసాంద్రత కోస్తా కంటే తక్కువ కావడం వలన ఈ ప్రతిపాదన చేసారు. రాజధాని, హైకోర్టులు చెరో ప్రాంతంలో ఏర్పాటు చెయ్యాలి. ఏదికావాలో కోరుకునే హక్కు రాయలసీమకు ఉండాలి.
ybrao-a-donkey's personal views with no malice, and not intended to be imposed on others :
విద్యాభివృధ్ధి అంశము --౨౦౨౨ ప్రస్తుతము రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ప్రభుత్వానినీ, ప్రైవేటువీ భారీగానే ఉన్నాయి.
నీటిపారుదల అంశం -- ౨౦౨౨ పరిస్థితి --కర్నాటక ఆల్ మట్టీ , నారాయణపూర్ డాములను నిర్మించాక, అక్కడ ప్రాజెక్టులు నిండాకే మిగిలే వరదనీరే మనకి వస్తుంది. ఏట్రిబ్యునళ్ళు , ఏకోర్టులు , ఏమి చెప్పినా, ఆచరణలోకి వచ్చే సరికి కర్ర ఉన్నవాడిది బర్రె అవుతుంది. కర్నాటక , తెలంగాణలు, కోర్టు తీర్పులను కానీ, కేంద్ర ప్రభుత్వ లేఖలను గానీ, లెక్క చేయవు. ఈవిషయంలో మనం ఎంత గొంతు చించుకున్నా అతి వరదలు వస్తే తప్ప మనకు సెప్టెంబరుదాకా నీళ్ళు రావు. కనుక రాయలసీమకైనా, కృష్ణా పెన్నా డెల్టాలకైనా, గోదావరీ జలాలను మళ్ళించుకోటమే దిక్కు. ఈసందర్భంగా, ఉత్తరాంధ్రను కూడ కలుపుకొని వెళ్ళాలి. అంటే గోదావరినీరు ఉత్తరాన ఇచ్ఛాపురం వరకు పారాలి. దక్షిణరాయలసీమకు చివరిదాకా వెళ్ళాలి. దక్షిణ కోస్తాలో తడవరకూ వెళ్ళాలి. ము అదృష్టం ఏమిటంటే, ౨౦౨౨ పరిస్థితి ప్రకారం, మనకు గోదావరిలో శబరీ నదిద్వారా, వరదనీరు పుష్కలంగా లభిస్తుంది. ఇది ఉత్తరాంధ్రకు, కృష్ణ పెన్నా డెల్టాలకు, రాయలసీమకు ప్రాణం పోస్తుంది. మనము రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర రాష్ట్రాలుగా విడిపోయినా లేక కలిసి ఉన్నా, నీటిపారుదల విషయంలో తన్నుకుంటే అందరికీ నష్టమే. ఎందుకంటే, తెలంగాణ, కర్నాటకలకు చులకన అవుతాము. అంతే కాక శబరి మొ. నదులపై, ఒరిస్సా ఎగువలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశాలను త్రోసి పుచ్చలేము.
రాజధాని / హైకోర్టు అంశం-- మొదట ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు రాజధానిగా, గుంటూరు హైకోర్టుగా ఉండేది. రాజధాని గుడారాన్ని, హైకోర్టు గుడారాన్నీ హైదరాబాదుకు తరలించకుకుపోటంలో నాటి నాయకుల కులమతప్రాంతీయ సమస్త కుమ్ములాటలూ తమ పాత్ర ఫోషించాయి అనేది నా నమ్మకం. ౨౦౧౪లో శేషాంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పరచినపుడు, పాత చరిత్రను గుర్తుకు తెచ్చుకుని కర్నూలులో రాజధానినీ , గుంటూరులో హైకోర్టునూ ఏర్పరచుకుంటే మనం మన శ్రీబాగ్ ౧౯౩౭ నాయకులను గౌరవించినట్టు అయ్యేది. కొంత ఆలస్యం అయినా, అందరూ ఏదో విధంగా సర్దుకు పోయే వాళ్ళేమో. గౌ. శ్రీ చంద్రబాబుకు, ఆయన మనసులో ఏముందో ఏమో కానీ, ఆయన శ్రీబాగ్ ఒడంబడికను పట్టించుకోలేదు. ౨౦౧౪ రాయలసీమ నాయకులు, విద్యార్ధులు, అందరూ ఈరోజు చేసిన ఉద్యమాన్ని పట్టుదలగా ఆనాడే చేసి ఉండాల్సింది. ఆలస్యం అమృతం విషం అంటే అదే.
కర్నూలులో కాకపోయినా , కనీసం ఒంగోలు, కావలి ప్రాంతాలలో రాజధానిని పెట్టుకున్నా, అందరికీ అందుబాటులో ఉండేది. గుంటూరు కర్నూలు రైలు, రోడ్డు మార్గాలలో కొంత ఘాటు రోడ్డు, సొరంగాలూ ఉన్నాయి. అందువల్ల విశాఖ వారికి కర్నూలు వెళ్ళటం కొంత ఇబ్బంది. అదే, కావలి, ఒంగోలు, మార్కాపురం, దొనకొండ, నాగార్జునసాగర్ వంటి ప్రాంతాలు కూడ ఈసమస్యకు పరిష్కారాలే.
గుంటూరులో హైకోర్టు ఉన్నంత మాత్రాన కర్నూలు లో హైకోర్టు బెంచి, విశాఖలో హైకోర్టు బెంచిలను సుప్రీం కోర్టు అనుమతితో తేలికగానే ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి ఉద్యమాలు అవసరం లేదు.
ఇపుడు జరిగిన ఘోరమైన తప్పిదము ఏమిటంటే, అమరావతి ప్రజలకు ఆశలు కల్పించి ౨౫౦౦౦ రైతులనుండి వారి సారవంతమైన భూములను గుంజుకున్నాము. అక్కడ రోడ్లు వేసి, హైకోర్టును, సచివాలయాన్ని (తాత్కాలిక) నిర్మించటం వల్ల వాటిని తీసేసి వ్యవసాయభూములుగా అక్కడ ప్రజలకు ౩౪౦౦౦ ఎకరాలు తిరిగి ఇవ్వటం అసాధ్యం. అలాచేయాలంటే స్వర్గీయ కెఎల్ రావు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి వాళ్ళు కావాలి. ఆ ప్రజంలందరికి, సుప్రీం కోర్టు, మరియు హైకోర్టులు నిర్ణయించిన పరిహారం, కొన్ని లక్షల కోట్లు ఉంటుంది. శ్రీ జగన్, శ్రీ చంద్రబాబులు తమ ఆస్తులను అమ్మి ప్రజలకు పరిహారం చెల్లించరు కదా. కనుక ఎవరికి ఇష్టం ఉన్నా , లేకపోయిన రాజధానిని అమరావతిలో కొనసాగిస్తూ స్వల్పపెట్టుబడులతో అయినా రాజధానిని కనీస సౌకర్యాలతో నిర్వహిస్తూ, ఒక ౨౦ ఏళ్ళు కృషిచేస్తే అమరావతి ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఆ తరువాత, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం, ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్రాలలో ఏర్పరుచుకోవచ్చు. ఈలోగా, అక్కడ కూడ, కొంత ఇన్ఫ్రా స్ట్రక్చర్ ను ఏర్పాటు చేసుకుని ౨౦౫౦ నాటికి మూడు రాష్ట్రాలుగా మారచ్చు.
అక్టోబరు ౩౦ ౨౦౧౩, అంటే సరిగా తొమ్మిది ఏళ్ళ క్రితం నేను ఇక్కడే నూడు రాజధానుల గురించి వ్రాసాను. ఆనాడు ఏమి వ్రాసానో చదవాలనుకునేవారికి లింకు https://problemsoftelugus.blogspot.com/search/label/033
ఇంకా కొనసాగించాలి.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.