31.10.2022 ఈనాడు పైవార్త ప్రకారం శ్రీధర్మాన ప్రసాదరావు , ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు చెప్పినది
పేరుకే మూడు రాజధానులు.. పాలనంతా విశాఖ నుంచే: ధర్మాన పేరుకు మూడు రాజధానులు అని చెప్పినా.. పాలన అంతా విశాఖ నుంచే సాగుతుందని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.
మంత్రి శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు , స్పష్టంగా చెప్పారు.
పాలన అంతా విశాఖనుండే చేయాలనుకుంటున్నప్పుడు , ఇంక నాటకాలూ దాగుడుమూతలు ఎందుకు ? ముఖ్యమంత్రి కూడ ఇదే విషయం తన మనసులో ఉంటే దానిని తేటతెల్లం చేసి శాసనసభలో ఒక ప్రకటన చేస్తే బాగుంటుంది.
ఈలోపల నేను కొన్ని నా వ్యక్తిగత అభిప్రాయాలను వ్రాస్తాను. వీటిని ఎవరిపై రుద్దను.
ప్రశ్న- మూడు రాజధానుల వల్ల మూడు ప్రాంతాలూ సమంగా అభివృధ్ధి చెందుతాయని వైఎస్ ఆర్ మంత్రులు, వైఎస్ ఆర్ శాసనసభ్యులు అంటున్నారు కదా ?
జవాబు-- గ్రామాలూ , మండలాలూ అభివృధ్ధి చెందాలనే కోరిక ఉంటేనే మూడు రాజధానులు అయినా ఒక రాజధాని యైనా , సాధ్యం అవుతుంది. నేడున్న వ్యవస్థలో భూకులాలు అంటే భారీగా భూములు కలిగి ఉన్న కులాల వారు (కులాల పేర్లు వ్రాయటం న్యాయంకాదు) పట్టణాలకు నివాసాలను మార్చుకున్నారు. భూములను ఒకటి రెండు ఎకరాలను అమ్మి, మిగిలిన వాటిని కౌలుకిచ్చి పట్టణాలలో అపార్టుమెంటుల్లోకి మారి పిల్లలకు కార్పోరేట్ విద్యను, తమకు కార్పోరేట్ వైద్యాన్ని పొందుతున్నారు. తమకౌలు తమకు ముట్టుతున్నంత కాలం, భూరికార్డులలో తమపేర్లు కొనసాగుతున్నంత కాలం ప్రభుత్వం రైతులకు ఇచ్చే సకల ప్రోత్సాహకాలను తాము స్వీకరిస్తూ, కౌలు రైతులను పీడిస్తున్నారు. తీరిక సమయంలో పట్టణాలలో వ్యాపారాలు చేసుకుంటూ , మైనింగు మొ. పరిశ్రమ లను నడుపుకుంటూ, కంట్రాక్టులు చేస్తూ, విద్యా సంస్థలను కార్పోరేట్ హాస్పిటల్సును నడుపుకుంటా, వాటిని రక్షించుకోటానికి, పెంచుకోటానికీ, రాజకీయవాదులుగా మారి భూబకాసురులుగా అవతరించారు. ఈతరహా పాలెగాళ్ళు రాయలసీమలోనూ, కృష్ణా గోదావరులలోనూ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఎక్డడున్న వాళ్ళైతేనేం, భూకులాల వారే రాజకీయ వ్యాపారాలు, భూవ్యాపారాలు చేయగలరు. దీనికి అదనంగా, వీరి కొడుకులు, కూతుళ్లు, బంధువులే అమెరికాలో, యూరప్ లో ఉద్యోగాలూ, వ్యాపారాలూ చేస్తూ, అక్డడ భూబకాసురులుగా మారారు. వారు పంపే డబ్బుతో ఇక్కడ బంధుబకాసురులు భూమూలు కొనుగోలు చేస్తూ , రాష్ట్రం మొత్తాన్ని వాళ్ళ గుప్పిటలో పెట్టు కున్నారు. డబ్బులు పారేసి వోట్లు కొనే శక్తి వారికే ఉంది. సామాన్య ప్రజల దారిద్ర్య నిర్మూలనకు , బ్రతుకుతెరువుకూ సంబంధించి, ఒక రాజధానియైనా , మూడూరాజధానులైనా ఒకటే. మూడు గోడలకు తల బాదుకోటమా, ఒకే గోడకు తలబాదుకోటమా అనే దాని ఫలితం, ఎంత గట్టిగా తలబాదుకుంటున్నాము అనేదాని బట్టి ఉంటుంది.
దూరం సంగతి ఏమిటి
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాదు రాజధానిగా ఉన్నప్డుడు శ్రీకాకుళంవారు , తడ వారూ, హిందూపురం వారూ హైదరాబాదు వెళ్ళటానికి నానాబాధలు పడ్డారు. అయినా తెలుగు వారంతా ఒకటే అనే మైకంలో వారు హైదరాబాదు వెళ్ళి కూలీలుగా పనిచేసారు. ఇదే తెలుగు కూలీలను మనం ఓడలను తుక్కుగా చితక్కొట్టే గుజరాత్ లోని అలాంగ్ రేవులోనూ చూడచ్చు. ముంబాయిలో ఆకాశ హర్మ్యాల నిర్మాణంలోనూ రాళ్ళెత్తేది తెలుగు కూలీలే. విశాఖ, అమరావతి లేక కర్నూలలో ఎక్కడ రాజధాని ఉన్నా, కూలీ పనులు చేసేది బెంగాలీ , ఒరియా , బీహారీ కూలీలే. మన కూలీలు గల్ఫులోనూ, గుజరాత్ లోనూ, ముంబాయిలోనూ పనిచేస్తారు.
శ్రీ ధర్మాన గారు చెప్పినట్లుగా మూడురాజధానులు అని చెప్పినప్పటికీ పరిపాలన అంతా విశాఖనుండి కొనసాగితే, హిందూ పురం వారు , సూళ్ళూరు పేట వారూ, విశాఖ వెళ్ళటానికి సుమారు ఏడు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.
ప్రశ్న-- శ్రీజగన్ గారు ౨౦౧౯ ఎన్నికల ముందే, తనకు అమరావతి రాజధాని ఇష్టం లేదని అసెంబ్లీలో, బయట చెప్పి ఉంటే బాగుండేది కదా?
జవాబు-- అలా చెప్తే ఎంతో బాగుండేది. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అని ఒక సామెత ఉంది. అలాగే తోటకూర దొంగిలించి నపుడే తల్లి మందలించి ఉంటే కొడుకు పెద్ద దొంగ అయ్యేవాడు కాదు అని కూడ ఒక కథ ఉంది. ఒకవేళ చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి భారీ పథకం వేసి ఉంటే , శ్రీజగన్ ౨౦౧౯ ముందే దానిని అడ్డుకుని ఉండేవాడు.
ప్రశ్న-- అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదంటారా ?
ఎందుకు జరగలేదు ? తప్పకుండా జరిగింది. అయితే ఇన్ సైడర్ ట్రేడింగు అనే సమాసం, స్టాక్ ఎక్స్ఛేంజిలలో గుర్పింపు పొందింది. భూబకాసరుల లావాదేవీలలో, దీనిని కోర్టులు గుర్తించలేదు. కనుకు విశ్వాస ఘాతుకం --బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ను కోర్టులలో నిరూపించి నేరాలకు శిక్ష వేయించటం కష్ట మయ్యింది. ఇపుడైనా వైఎస్ ఆర్ ప్రభుత్వం సరియైన ఉద్యోగులను, అధికారులను నియోగించి సాక్ష్యాలను సరిగా సేకరించి, హైకోర్టులో సరియైన వాదనలు చేస్తే కొందరికైనా శిక్షలు పడేవి. ఆలస్యం అయినా సరిగా కృషి చేయాల్సి ఉంటుంది.
ప్రశ్న-- ౩౪౦౦౦ ఎకరాలు ఇచ్చిన ౨౫౦౦౦ రైతులూ బినామీలంటారా ?
జవాబు-- ఎన్నటికీ కాదు. సుమారు ఒక వేయిమంది బినామీలను తీసేస్తే మిగిలిన భూదాతలు అందరూ సన్న, చిన్న, అన్ని కులాలకు చెందిన రైతులే. వాళ్లలో పలువురు అధికారుల, నాయకుల మోసపూరిత వాగ్దానాలను నమ్మి తమ , తమ భూముల విలువలు పెరుగుతాయని ఆశపడి వాటిని ప్రభుత్వానికి ఇచ్చారు. పలువురు రైతులు బెదిరింపులకు లోనయ్యారు. తెలుగుసినిమా పాట ఒకటి ఉంది. --మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలక పోసుకోనా-- అని. ఆశ, దురాశి, భయం అనే మూడిటి మధ్య అమరావతి ప్రజలు నలిగి పోయారు. అయితే వారు ఊహించని ఒక పరిణామం వారి జీవితాలను మార్చేసింది. అదే, చంద్రబాబు ప్రభుత్వం పోయి శ్రీ జగన్ ప్రభుత్వం రావటం. కేంద్రంలో బీజెపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండటంతో, అమరావతి ప్రజలకు పుండు మీద కారం చల్లనట్లయింది.
ప్రశ్-- శ్రీ చంద్రబాబు గెలిచి ఉంటే , ఏమి జరిగి ఉండేదీ ?
జవాబు-- శ్రీ చంద్రబాబు గెలిచి ఉంటే, సింగపూర్ కంపెనీ లును కానీ, లేక వేరే ఇతర విదేశీ కార్పొరేట్లకు అమరావతి భూములను దీర్ఘ కాలిక లీజులుగా నైవేద్యం పేట్టి, మిగిలిన అమరావతి భూములను అభివృధ్ధి చేసి ఉండే వాడు. దీని వల్ల అమరావతి ప్రజలకు భారీ ప్రయోజనాలు లభించినా లభించకవోయినా కనీసం ఎంతో కొంత గిట్టుబాటు అయ్యేది. అలా జరగనందు వల్ల, మరియు శ్రీజగన్ ప్రభుత్వం ఇప్పటికే చేసిన నిర్మాణాలను పాడుకాకుండా చూసుకుంటూ, ప్రతి సంవత్సరం, భారీగా కాకపోయినా, ఎంతో కొంత అభివృధ్ధి పనులను చేసుకుంటూ పోతే, రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చేది కాదు. అనవసరం కోర్టు దావాలు, ఉద్యమాలు తప్పేవి. దీనిని మనం స్టేటస్ కో యాంటీ అనచ్చు. యథాతథ స్థితి కొనసాగింపు అనచ్చు.
ప్రశ్న-- యథాతథ స్థితి వల్ల ఉత్తరాంధ్ర విశాఖ, రాయలసీమ కర్నూలు ఎలా అభివృధ్ధి అవుతాయి ?
జవాబు-- ప్రతి జిల్లాకేంద్రంలోనూ , ముఖ్యమంత్రి ఉప కార్యాలయం (రాష్ట్ర మెయిన్ సచివాలయం కాదు) అంటే సీఎమ్ ఓ శాఖలను ఏర్పాటు చేయవచ్చు. ఇపుడంతా కంప్యూటర్ల మయం. అంతా డిజిటాలే. అమరావతి సచివాలయం, ముమకార్యాలయం సర్వర్ల నోడ్ లను జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసి ముమకార్యాలయ అధికారులను అక్కడ పోస్టుచేసి అమరావతిలో చేయాల్సిన పనులనే జిల్లా కేంద్రాలలో చేయించవచ్చు. ప్రతిపాదనలను --ఓకే-- చెప్పటమే అమరావతి సీఎమ్ సర్వర్ నుండి, శాఖా మంత్రుల సర్వర్లనుండి జరుగుతుంది. ఇలా చేసేటపుడు మంత్రుల అధికారాలకు, వారి --పాత్రలకు-- భంగం కలగకుండా చూసుకోవాలి.
వృక్షంలో జైలం నాళాల ద్వారా వ్రేళ్ళనుండి నీరు ఆకుల దాకా చేరుతుంది. అక్కడ కిరణ జన్య సంయోగ క్రియ జరిగి, తయారియన ఆహారం, క్రిందిదాకా చేరాలి. మూలాలు నీటిని పీల్చుకోక పోతే మొక్క ఎండిపోతుంది. ఆకులు ఆహారం తయారు చేసి క్రిందికి పంపకో పోయినా ఇదే జరుగుతుంది.
ఇంకా వ్రాయాల్సింది ఉంది. కొనసాగిస్తాను.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.