అసలు కారణము ఏమి అయి ఉండచ్చు ?
రాహుల్ గాంధీ , ప్రియాంక వద్రాలు పార్టీని విజయ పథంలో నడిపించటానికి కావలసిన నిధులు తాము ఏర్పాటు చేయలేమని భయపడుతూ ఉన్నట్లు కనిపిస్తున్నది . ఒక అఖిల భారత పార్టీని నడిపించటానికి కొన్ని వేల కోట్లు కావాలి . అధికారములో ఉన్న పార్టీ కైతే పారిశ్రామికవేత్తలు విరాళాల వర్షాలు కురిపించటం జరుగుతుంది . కనీసము స్వల్ప కాలంలో అధికారములోకి వచ్చే అవకాశము ఉంటే అధికార పార్టీకి వచ్చినంతగా రాకపోయినా ఎంతో కొంత విరాళాల జల్లు కురిసేది. ఇప్పుడా అవకాశాలు కనుచూపు మేరలో కూడ లేవు . విదేశీ బ్యాంకుల్లో ఉన్న విరాళాల నల్ల డబ్బు ఏదైనా ఉంటే తెప్పించాలన్నా మనీ లాండరింగుపై అధికార పార్టీ నిఘా చాలా అధికముగా ఉన్నది. కనుక విదేశీ డబ్బు తెప్పిస్తే మనీ లాండరింగు కేసుల్లో ఇరుక్కొని జైళ్ళలో లాకప్పుల్లో మగ్గుతూ బెయిళ్ళ కోసము కోర్టుల చుట్టూ తిరగాల్సి రావచ్చు . రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళినా అతడిపై అధికారిక నిఘా యే కాక అనధికారిక నిఘా కూడ ఉంటుంది. శ్రీ రాహుల్ కి నిజంగా ప్రియురాలు ఎవరైనా ఉంటే, అధికారిక అనధికారిక నిఘాల వల్ల ఆమెను కలుసుకునే స్థితిలో రాహుల్ లేడని నాకు తోస్తున్నది. ఇప్పటికే రాహుల్ గాంధీ ఈ నిఘాల తీవ్రతను గ్రహించే ఉంటాడు .
ముఖ్యమంత్రుల ద్వారా నిధుల సేకరణ
కేంద్రంలో ఏ పార్టీ అధికారములో ఉన్నా ఆ పార్టీ అధికారములో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిధులు సేకరించి ఢిల్లీకి సూట్ కేసులు పంపటం పాత ఆచారమే. ఈ విషయాన్ని ఒక కర్నాటక మాజీ మంత్రి గారు (2013 లో, అద్వానీ బిజెపి అధ్యక్షుడు, యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉండగా ధనంజయ్ కుమార్ అనే మంత్రి) స్వయంగానే అంగీకరించారు . ఇప్పుడు యడ్యూరప్ప మరల ముఖ్యమంత్రి . శ్రీ నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి . బిజెపీ లో ఈ కప్పము పద్ధతి కొనసాగు తున్నదో లేదో తెలియదు . దేశానికి స్వాతంత్ర్యము రాకముందు నుండే అంటే సుమారు 1937 నుండే రాష్ట్ర పార్టీల నేతలు విరాళాల పేరు తోనే కప్పము చెల్లిస్తూ ఉండాలి . నేడు కాంగ్రెసు ఒకటి రెండు రాష్ట్రాల్లో తప్ప అధికారములో లేదు . కాబట్టి కాంగ్రెసు అధిష్ఠానం తీవ్రమైన నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉండాలి . రాహుల్ గాంధీ కానీ ప్రియాంక కానీ తమ స్వంత ఆస్తులను పార్టీకి కానీ ప్రజాసేవకి కానీ పణముగా పెడతారని 21వ శతాబ్దము పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యములో మనము నమ్మ లేము .
మరి గెలుపు గుర్రాల సంగతి ఏమిటి ?
ప్రతి పార్టీ ప్రతి ఎన్నిక సమయము లో చెప్పే విషయము తాము గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తామని . దాని అర్థము కేవలం ధనస్వాములకేననే. మద్యాన్ని పంచి పెట్టటం అదనపు అర్హత . ఉదాహరణకి 2019 లోక్ సభ ఎన్నికలో మచిలీపట్నం నండి పోటీ చేసిన బిజెపీ అభ్యర్ధి మద్యము వ్యాపారి . ఎన్నికలో ఓడిపోయినా 2020లో మద్యం అక్రమ రవాణా చేస్తూ ఉండగా దొరికి పోయాడు . తీవ్రమైన క్రిమినల్ కేసులు కలిగి ఉండటం వల్ల అభ్యర్ధులు ఆదర్శ మానవులుగా ఫెయిర్ అండ్ లవ్ లీ గా కనపడతారు . లోక్ సభ అభ్యర్ధులు తమ ఖర్చులను తామే భరించటమే కాక తమ నియోజక వర్గం లోని శాసన సభ నియోజక వర్గాల్లో పోటీ చేసే తన పార్టీ నిలబెట్టిన ఇతర అభ్యర్ధుల ఖర్చులకు కూడ నిధులు సమకూర్చ వలసి ఉంటుంది . ఏది ఏమైనా అఖిల భారత పార్టీల అభ్యర్ధులు అయినా , ప్రాంతీయ పార్టీల అభ్యర్ధులు అయినా , కోట్లు ఖర్చు పెట్టకుండా శాసన సభకు కానీ , శాసన మండలికి కానీ , లోక్ సభకు గానీ , రాజ్య సభకు గానీ ఎన్నిక కావటం అసాధ్యం . ఆ కోట్లను తిరిగి రాబట్టు కోటానికి అధికార పార్టీలోకి దూకక తప్పదు . కాంగ్రెసు మరల అధికారము లోకి వస్తుందనే నమ్మకం గెలుపు గుర్రాల ధనస్వాములకు కలిగితే తప్ప వారు కాంగ్రెసు లోకి దూకరు కాక దూకరు . దూకినా మెజారిటీ రాకపోతే మరల పిల్లి గంతులు వేస్తారు.
తత్వం బోధపడిన రాహుల్ , ప్రియాంకాలు
ప్రియమిత్రులు శచీన్ పైలెట్ మరియు జ్యోతిరాదిత్య సింధియాలు వేసిన పిల్లి గంతులు చూసాక రాహుల్ గాంధీ , ప్రియాంక లకు తత్వం కొంత అయినా బోధపడి ఉంటుంది . అయితే కామం లాగానే అధికార కాంక్ష ఆరని అగ్ని జ్వాల . కామం తాత్కాలికంగా శమించటం మరల రగులుకోటం జరిగినట్లే అధికార కాంక్ష కూడ మానవులను పిల్లి గంతులు వేయిస్తూ ఉంటుంది .
రహస్య లేక అక్రమ ఆస్తులు ఉండే వాళ్ళకు రక్షణ కావాలంటే అధికారము అయినా ఉండాలి లేక పాలక పక్షంతో రహస్య అవగాహన అయినా ఉండాలి. 2014 వరకు కొన్ని పరిమితులకు లోబడి ఇప్పుడు వృక్షంగా మారిన దురాచారం ఏమిటి అంటే రాష్ట్రాల అధికార పార్టీలు రాష్ట్ర నేర పరిశోథక శాఖల, సంస్థల అధికారులను , కేంద్రాన్ని ఏలే అధికార పార్టీలు కేంద్ర నేర పరిశోథక శాఖల , సంస్థల అధికారులను తమ వ్యతిరేకుల పైకి, విమర్సకుల పైకి, శత్రుపక్ష పారిశ్రామికవేత్తల పైకి వ్యాపారుల పైకి ఉసి గొల్పటం . అధికార పార్టీల లక్ష్యం ఏమిటి అంటే లొంగిపోని ప్రతిపక్ష లేక విమర్శక మొండి వెధవలను లొంగతీసుకోటం . నేరము ఏదైనా సరే, ఆశ్రితులు చేస్తే అది మురిపెము అవుతుందే కానీ కేసార్హము లేక శిక్షార్హము కాదని పాలకుల మరియు తద్దండనాథుల నమ్మకము. ఇది కేవలం అమరావతి లోనేనా లేక ఢిల్లీ లో కూడ ఇంతేనా అని అనుమానం రావచ్చు .
విశ్వాసము కోల్పోతున్న అఖిల భారత మీడియా
ఢిల్లీ లోని పూర్తి పరిస్థితులను భారతీయ పత్రికలుగానీ మీడియా గానీ తొక్కి పట్టకుండా సత్యసంపూర్ణముగా రిపోర్టు చేయగల స్థితిలో ఉన్నాయని గానీ , రిపోర్టు చేస్తున్నాయని గానీ నమ్మటం కష్టం . విచారించ తగిన విషయం ఏమిటి అంటే అసత్యం లేక అసంపూర్ణం లేక అర్ధసత్యం అయిన విషయాలను మీడియా ప్రచురిస్తున్నది అనే అనుమానం కలగటానికి కారణం మీడియా వాతావరణం కాశీపట్నం చూడర బాబూ అన్నట్లు తయారు కావటమే. మీడియా అంతా జేజేలు భజనలతో నిండిపోటం, ప్రధాన మంత్రి గారు తను ప్రస్తావించ వలసిన విషయాలను ప్రస్తావించకుండా క్రికెట్ , ఫిలిమ్ స్టార్ల పైన తన దృష్టిని కేంద్రీకరించారు కాబట్టి, మీడియా కూడ తాము క్రికెట్ , ఫిలిమ్ స్టార్లు , ధోనీ, సురేష్ రైనా, అమితాభ్ బచన్ లపై దృష్టి పెట్టాలనుకోటం, మిగిలిన సమయాన్ని సుశాంత్ సింగ్ రాజ్ పుట్ , రియా చక్రవర్తిలపై వెచ్చించటం, ఇవన్నీ మనకు సూచించేది ఏమిటి అంటే బూర్జువా రాజ్యాల్లో కేంద్ర బిందువులు పేదవాడు కానీ , సామాన్యుడు కానీ కాదు. పాలకులు నెమళ్ళ నృత్యాలను ఆస్వాదిస్తూ పుట్టగొడుగులను ఆరగిస్తూ ఉంటే , పాలితులు పస్తులుండటం, కరోనా తమపై ఎప్పుడు దాడిచేస్తుందో అని వణికిపోటం, మన ఘనాఘన ప్రజాస్వామ్య లక్షణం.రాహుల్ గాంధీని మనము షేక్స్పియర్ హేమ్లెట్ తో పోల్చచ్చునా?
రాహుల్ గాంధీని మంచి బాలుడా లేక చెడ్డ బాలుడా అనే విషయాన్ని పరిశీలించటానికి మన దగ్గర ఉన్న సమాచారం చాలదు . హేమ్లెట్ కుండే లక్షణాలు కొన్ని రాహుల్ గాంధీకి ఉన్నప్పటికీ , ముఖ్యంగా టూబీ ఆర్ నాట్ టూబీ అనే ఊగిసలాట ధోరణి అతడి బలహీనత అయినప్పటికీ , 2024 లేక 2029 ఎన్నికలలో అతడు ప్రధాని అయినా కాకున్నా అతడు అనామకుడిగా (పర్సనా నాన్ గ్రాటా) మార కూడదని , హేమ్లెట్ లాగా అతడి జీవితం విషాదాంత నాటకం కాకూడదని మనము కోరుకుందాము . దీనికి అతడికి పారిశ్రామికవేత్తల మద్దతు అవసరం . ప్రజల వోటింగు మద్దతు పారిశ్రామికవేత్తలు కురిపించే నిధులపై ఆధారపడి ఉంటుంది.
2024 నాటికి మనకు బలమైన ప్రతిపక్షం కావాలి . ఆ ప్రతిపక్షానికి, అన్యాయాలను అడ్డుకోటానికి కావలసిన ధైర్యము , నిజాయితి మరియు కోరిక ఉండాలి . కోట్లు ఖర్చు చేసి ఎన్నిక అయ్యేవాడికి తన కోట్లను వెనక్కి రాబట్టు కోవటం ఎలా అని ఆలోచిస్తాడే తప్ప , తనకు ఏదైనా అన్యాయం జరిగితే గగ్గోలు పెడతాడే తప్ప ఇతరులకు జరిగే అన్యాయాల గురించి ప్రాధాన్యత ఇచ్చి పోరాడడు . ధైర్యము , నిజాయితి మరియు కోరిక ఉండాలంటే అవి సరియైన సమానత్వ సిధ్ధాంతాల నుండి జన్మించాలి . ప్రజా ప్రతినిధిగా ఉండాలనుకునే వాడికి సరియైన తాత్విక దృక్పథముతో ఆలోచించే శక్తి ఉండాలి . వంశపారంపర్య పాలక వారసులైన రాహుల్ గాంధీ , ప్రియాంక లకు ఈ ఆలోచించే శక్తి ఎక్కడ నుండి వస్తుంది ? అటువంటి ఆలోచనా శక్తి దురదృష్ట వశాత్తు శ్రీ మన్మోహన్ సింగు గారికి కూడ లేదు అని నేను వినయంగా మనవి చేసుకుంటున్నాను . ఎందుకంటే సమానత్వ చింతనా శిక్షణ లండన్ స్కూల్ ఆఫ్ ఇకనామిక్సులో, ప్రపంచ బ్యాంకులో, అంతర్జాతీయ ద్రవ్యనిధిలో లభించదు. శ్రీనరేంద్ర మోడీగారికి ఈ తాత్విక దృక్పథం ఉన్నదా లేదా అనే విషయాన్ని పరిశీలించాలంటే నేటి విమర్శకులు జైలుకు పోటానికి సిధ్ధపడాలి. ప్రస్తుతానికి ఆప్రయత్నం ఎవరూ చేయరు అని నా నమ్మకం.
తాజా వార్త ఆంధ్రజ్యోతి పతాక శీర్షిక 24.8.2020.
"...కాంగ్రెస్ పార్టీలో తీవ్రస్థాయిలో సంక్షోభం చెలరేగింది. చుక్కాని లేని నావలా తయారై, యువత సహా అన్ని వర్గాలకూ దూరమై, దేశవ్యాప్తంగా పార్టీ పరిస్థితి పాతాళానికి దిగజారిపోతోందని, దీన్ని ఆపేందుకు సమగ్ర, సమూల, సంస్కరణలు చేపట్టాలని కోరుతూ 23 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు- అధినేత సోనియా గాంధీకి ఓ లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఆమె- ఇక తాను ఇక ఎంత మాత్రమూ అధ్యక్ష పదవిలో కొనసాగబోనని, నేతలంతా కలిసి కట్టుగా కొత్త నాయకుణ్ణి ఎన్నుకోవాలని స్పష్టం చేసినట్లు సమాచారం. ..."ఈ దశలో ఈ రచయిత అభిప్రాయం :
కాంగ్రెసు-లో రేగే తుఫానులు టీకప్పులో తుఫాను లాగా సమసి పోతాయా లేక పార్టీ రెండు ముక్కలు అవుతుందా , అనే విషయం పార్టీ కేంద్రంలో అధికారములో ఉందా , నిధులు ఎవరి అదుపు ఆజ్ఞల్లో ఉన్నాయి , పారిశ్రామికవేత్తలతో ఎవరికి సత్సంబంధాలు ఉన్నాయి , అనే వాటిపై ఆధారపడి ఉంటుంది . నిధులు రెండు రకాలు , అధికారిక నిధులు పార్టీ కోశాధికారి అదుపులో ఉండేవి , అనధికారిక నిధులు అప్రకటిత నేతల అదుపు ఆజ్ఞల్లో ఉండేవి . ప్రస్తుతము అధికారిక నిధులు తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది . అనధికారిక నిధుల రహస్యం బయటపడలేదు . శ్రీమతి సోనియా గాంధీగారు దిగిపోతాను అన్నారంటే, నిధుల కొరత తీవ్రంగా ఉందని మనం భావించ వచ్చేమో. (ఇంకా ఉంది.)
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.