
వీధి వీధికీ జ్యోతిష్కులు వెలసి ప్రజలలో ఉండే నమ్మకాలను, ఆశలను, భయాలను సొమ్ము చేసుకుంటున్న నేపథ్యంలో, ఈ ప్రశ్నకు నా అన్వేషణా ఫలితాలను వ్రాయవలసిన అవసరం వచ్చింది.
Question प्रश्न ప్రశ్న ఖగోళశాస్త్రం (అస్ట్రానమీ) ని దుర్వినియోగం చేస్తున్న జ్యోతిషం (అస్ట్రాలజీ)
Reply, जवाब, జవాబు : ఖగోళ శాస్త్రం అంతరిక్షంలో నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు, రాశికూటాల చలనాలు, చలన భ్రాంతులను గణితం, భౌతిక శాస్త్రం సహాయంతో లెక్కించి, కాల గమనాన్ని, సూర్యోదయ సూర్యాస్తమయాలను, చంద్రోదయ చంద్రాస్తమయాదులను, నక్షత్రాలు, రాశుల ఉదయాస్తమయాదులను దాదాపు ఖచ్చితంగా ముందుగానే సూచిస్తుంది. అంతేకానీ, వ్యక్తుల, దేశాల భవిష్యత్తును సూచించదు. జ్యోతిషం ఖగోళశాస్త్రాన్ని ఋజువుగా చూపిస్తూ, మానవుడికి శుభాశుభాలను లెక్కగట్టి చెప్తున్నట్లుగా నటిస్తుంది. ఖగోళ శాస్త్రం లెక్కలు దాదాపు 100% జరుగుతాయి. జ్యోతిషం లెక్కలు ఎన్ని శాతం జరుగుతాయి అనేదాన్ని ఎవరూ చెప్పలేరు. జ్యోతిష్కులు తమ లౌక్యాన్ని ఉపయోగించి, మాటల చాతుర్యాన్ని ప్రయోగించి, తాము చెప్పేవి జరుగుతున్నట్లుగా భ్రమలు కలిగిస్తుంటారు. కనుక మనం ఖగోళ గణితాన్ని (గ్రహణాలు, లగ్నాలు, రాశులలోకి గ్రహాల రాకపోకలు, సూర్యోదయాదులు, చంద్రకళలు, పౌర్ణమి, అమావాస్య, పుట్టిన తేదీ, సమయం ఆధారంగా, హారోస్కోప్ లను తయారు చేయటం, మొ||) ఇవన్నీ చాలా భాగం శాస్త్రీయమే.
Question प्रश्न ప్రశ్న : జ్యోతిషం (అస్ట్రాలజీ) ని కళ కింద వర్గీకరించ వచ్చా ?
Reply, जवाब, జవాబు : ఆతరువాత, జాతకులకి చెప్పే మంచీ చెడులు, మాత్రం కళ (ఆర్ట్సు) కిందకి వస్తాయి. రియల్ ఎస్టేట్ సేల్సమాన్ తన ప్లాట్లు, అపార్టుమెంటులను అమ్మటానికి ఎన్ని టక్కు టమార విద్యలను ప్రదర్శించాలో, అన్ని టక్కు టమార విద్యలను జ్యోతిష్కులు ప్రదర్శించాలి. గడ్డాలు పెంచుకోవాలి. మెడలో భారీగా రుద్రాక్ష మాలలు ధరించాలి. భారీగా విభూతి రేఖలు, నామాలు, బొట్లు పెట్టుకోవాలి. శాలువాలు కప్పుకోవాలి. సంస్కృత శ్లోకాలు భారీగా వాడాలి. జపాలు , పూజలు భారీగా చేయాలి. కస్టమర్లు ధనవంతులు, అతి ధనవంతులు అయితే దోష శాంతులకు వాళ్ళ చేత హోమాలు, యజ్ఞ యాగాదులు చేయించాలి.
Question प्रश्न ప్రశ్న
భారతీయ ఖగోళశాస్త్రం శాస్త్రీయమైనదైనపుడు, దానిపై నిర్మించిన జ్యోతిషం అశాస్త్రీయం ఎందుకవుతుంది ?
Reply, जवाब, జవాబు : భారతీయ జ్యోతిషంలో పెక్కు పొరపాట్లు ప్రవేశించాయి. రవి (సూర్యుడు) ఖగోళికంగా ఒక నక్షత్రం. జ్యోతిషం దానిని నవ గ్రహాలలో ఒకటిగా లెక్కిస్తుంది. పైగా రవిని పాపి అంటుంది. చంద్రుడు ఖగోళికంగా ఒక ఉపగ్రహం. కానీ జ్యోతిషం చంద్రుడిని నవగ్రహాలలో ఒకడిగా లెక్కిస్తుంది. రాహు కేతువులు అనేవాళ్ళు లేనే లేరు. ఖగోళంలో అవి నీడలు. జ్యోతిషంలో అవి రాక్షసులు, సూర్యచంద్రులను మింగే నీచులు. పాప గ్రహాలు. ఖగోళంలో యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోలు గ్రహాలు. జ్యోతిషానికి అవి ఉన్నాయని కూడ తెలీదు. శని (సాటర్ను) పాపి. కుజుడు (మార్సు) పాపి. గురుడు (జూపిటర్) ఉత్తముడు. ఇలాగా గ్రహాలకు ఉత్తమ గుణాలను , నీచ గుణాలను ఆపాదించటం, పూర్వీకుల బుధ్ధికి తోచినట్లుగా జరిగిందే తప్ప పరీక్షకు నిలబడేవి కావు. అంతే కాక ఫలానా రాశి వాడిక ఫలానా గ్రహం పాపి, ఫలానా గ్రహంతో కూడి ఉంటే పాపి వంటి గుణదోషాలను ఆపాదించటం హేతువుకి నిలబడనివి.
Question प्रश्न ప్రశ్న లగ్నాలు శాస్త్రీయమా ?
Answer: రైల్లో కిటీకీలోంచి చూడటం అలవాటున్న వాళ్ళకి ఇది తేలికగా అర్ధం అవుతుంది. కొండలు, ఇళ్ళు, విద్యుత్ స్థంభాలు, ముందు వైపు మనకి దూరంగ కనిపించి, మెల్లమెల్లగా వెనక్కి ప్రయాణిస్తూ మన పక్కకి వచ్చి, ఇంకా వెనక్కి పోయిపోయి అంతర్ధానం అవుతున్నట్లు కనిపిస్తాయి. ఖగోళం ప్రకారం భూమి తన చుట్టూ తాను పడమర నుండి తూర్పుకి ఒక రౌండు తిరిగే సమయంలో, పన్నెండు రాశులు మన ముందుకి, మన మధ్యకి, మనని దాటి కిందికి వెళ్ళినట్లు కనిపిస్తాయి. అవి తూర్పు వైపు మొదటిసారి మనకు కనపించే సమయం పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు అయినా, ఉదయించే మొదటి రెండు గంటలను లగ్నం అంటున్నారు. భూమి తన చుట్టు తాను తిరిగే సమయంలో కవర్ చేసే ఆకాశం 360 డిగ్రీలు, 12 రాశులు, 24 గంటల్లో తిరిగిపోతుంది. 24 గంటలు బై 12 రాశులు ఒక్కో రాశికి రెండు గంటలు సమయం, దైర్ఘ్యం వస్తుంది. అయితే నిజంగా లగ్నాలు ఉదయిస్తాయా ? అది మనకళ్ళకి కనిపించే ఒక భ్రమ మాత్రమే. సూర్యుడైనా ఉదయించడు , అస్తమించడు. మనకి భూమి తన చుట్టూ తాను తిరగటం వల్ల ఆభావన కలుగుతుంది.
మనం జేజే లు చెప్పాల్సింది మన ప్రాచీన ఖగోళ శాస్త్రజ్ఞులకే గానీ, జ్యోతిష్కులకు కాదు.
Question प्रश्न ప్రశ్న అయితే పుట్టిన తేదీ, సమయానికి మనిషి భవిష్యత్ కు ఏ సంబంధం ఉండదంటారా ?
Answer: ఉన్నదని నిక్కచ్చిగా ఋజువు కాలేదు.
Question प्रश्न ప్రశ్న
తమిళనాడు నాడీ జ్యోతిషం కూడ అంతేనా ?
Answer: నాడీ జ్యోతిషం గొప్పతనం ఋజువు కాలేదు.
Question प्रश्न ప్రశ్న
ఫలానా తిథి మంచిది, ఫలానా నక్షత్రం మంచిది ఇవన్నీ నిరాధారమైనవే అంటారా ?
Reply, जवाब, జవాబు : ఋజువుల్లేనపుడు నిరాధారమైనవే అనాలి. మాకు నమ్మకమే ఇష్టం, మేము జ్యోతిష్కులకు డబ్బులు వదిలించుకుంటుంటే మీకేమి బాధ అనే వాళ్ళని, ఎవరూ నమ్మించలేరు. ఆజ్యోతిష్కుడు చెప్పినవి చేయటం వల్ల మాకు అన్నీ కలిసి వచ్చాయి, అనే వాళ్ళు చుట్టూ జరిగే మార్పులు (ఉదాహరణ ప్రభుత్వం శేషాంధ్ర రాజధానిని తుళ్ళూరులో పెట్టటం వల్ల ఐదెకరాల రైతు 10 కోట్లకు యజమాని అయి కార్లలో తిరగటం) జ్యోతిష్యం వల్ల, జాతకం వల్ల కలిసి వచ్చింది అనుకుంటే ఎవరేం చేయగలరు. ఛండాలపు అవినీతి పనులు చేసి డబ్బులు సంపాదించే గుత్తే దారులు, లంచావతారాలు కూడ తమ ఛండాలపు పనుల వల్ల తాము డబ్బు సంపాదిస్తున్నట్లుగా గుర్తించకుండా, తమ జాతకం వల్ల తమకు కలిసొచ్చిందనుకుంటూ, తమ ఛండాలపు పనులను కొనసాగిస్తే, వాళ్లు సమాజంలో గొప్ప విజయాలు సాధించిన వాళ్ళుగా చలామణీ అవచ్చేమో కానీ, జాతకాల, జ్యోతిషాల గొప్పతనం ఏమీ లేదు.
Question प्रश्न ప్రశ్న ప్రాచీన కాలంలో మన జ్యోతిషం గొప్ప విద్యగా విలసిల్లింది కాదా ?
Reply, जवाब, జవాబు : మన జ్యోతిష్కులను ప్రాచీన కాలం నుండి పోషిస్తూ వచ్చింది రాజులూ, వ్యాపారులు. రాజులకేమో కరువు కాటకాలవల్ల తమకి పన్నులు వసూలు కావేమో నన్న భయం. పొరుగు రాజులు దాడి చేస్తారని భయం. తానే దాడి చేయాలనుకుంటే, సిధ్ధాంతులు ముహూర్తాలు పెట్టాలి. ముహూర్తాలు పెట్టించుకొని యుధ్ధాలు చేసిన రాజులూ ఓడిపోయారు. సిధ్ధాంతుల మాటలు నమ్మి యుధ్ధాలు వాయిదా వేసుకున్న రాజులు నష్టపోయిన సంఘటనలూ ఉన్నాయి. ఏ ముహూర్తాలూ లేకుండానే ఘజినీ, ఘోరీ, అల్లాయుద్దీన్ ఖిల్జీ, బాబర్, అక్బర్, నాదిర్ షా, తైమూర్ గొప్ప విజయాలు సాధించారు. వాళ్ళు క్రూరులు అనేది వేరే సంగతి. తెనాలి రామకృష్ణ సినిమాలో, మహాకవి తెరాకృ ఏ ఎన్ ఆర్ , శ్రీకృష్ణదేవరాయల ఎన్ టీ ఆర్ కళ్ళు తెరిపించిన సీన్ చూడండి.
మన జ్యోతిష్కులను భారీగా అనాదిగా వ్యాపారులు ఎందుకు పోషించారంటే తాము స్పెక్యులేషన్ చేయాలనుకుంటున్న వ్యవసాయ పంటలు బాగా పండుతాయా పండవా ? వాటి ధరలు పెరుగుతాయా పెరగవా ? భూస్వాములకి కూడ వీటిపై మంచి ఆసక్తి. చిన్న రైతుకి ఉండదు. ఎందుకంటే వాడు పండించుకుండేది వాడికే సరిపోతుంది. ఉగాదినాడు పంచాంగ శ్రవణం వినే ఉంటారు. ఏవస్తువు ధరలు పెరుగతాయి ఏవస్తువుల ధరలు తగ్గుతాయి అనేది వ్యవసాయోత్పత్తులను కొని నిలవుంచి ధరలు పెరిగినపుడు అమ్మే స్పెక్యులేటర్, నల్లబజారు వ్యాపారులకు అవసరం. సామాన్యులకి అవసరం లేదు.
ఉగాదినాడు టీడీపీ వారి జ్యోతిష్కులు చంద్రబాబు నాయుడు గారికి అంతా బ్రహ్మాండంగా జరుగుతుందంటారు. వైయస్ ఆర్ పీ జ్యోతిష్కులు జగన్ కు, బీజేపీ జ్యోతిష్కులు కిషన్ రెడ్డాది బిజేపీ నేతలకు బాగా జరుగుతుందని చెప్పటం చూడచ్చు.
Question प्रश्न ప్రశ్న పెళ్ళి ముహూర్తాల సంగతి ఏమిటి ?
Reply, जवाब, జవాబు : ఎంతో గొప్ప జ్యోతిష్కులు పెట్టిన ముహూర్తాలలో జరిగిన పెళ్ళిళ్ళు కూడ విషాదాంతాలైనాయి. వీటికి హాస్పిటల్ లో క్లినికల్ రికార్డులను మెయిన్ టెయిన్ చేసినట్లుగా ముహూర్తాల రికార్డులను నిర్వహిస్తే బండారం బయట పడుతుంది. ముహుర్తాలే కాదు, అసలు పెళ్ళే లేకుండా కలిసి జీవితాంతం సుఖంగా కాపురం చేసిన వాళ్ళున్నారు.
Question प्रश्न ప్రశ్న కొన్ని నక్షత్రాల లో పుడితే శాంతి చేయాలంటారు. దీని సంగతేమిటి ?
Reply, जवाब, జవాబు : గ్యాస్. అసలు నక్షత్రమంటేనే జ్యోతిష్కులలో కొంత కన్ ఫ్యూజన్ ఉంది. నక్షత్రం అంటే రాశిచక్రం (జోడియాక్) లో ఒక ఏరియా (స్థలం). మనం స్టార్ అనే అర్ధం లో వాడుతున్నాం. స్టార్ , నక్షత్రం రెండు ఒకటి కావు. ఇంక చంద్రుడు ఒక నక్షత్రం ప్రక్కన ఉన్నట్లు కనపడితే మనం ఆ రోజుని ఆనక్షత్రంగా పరిగణిస్తున్నాం. చంద్రుడు మనకి షుమారు నాలుగు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండగా, నక్షత్రాలు , రాశులు కొన్ని కాంతి సంవత్సరాలు దూరంలో ఉన్నాయి. చంద్రుడు, నక్షత్రాలు, రాశులు ప్రక్క ప్రక్కన ఉండటం అనేది ఒక కళ్ళకి కనపడే భ్రమ (ఆప్టికల్ ఇల్యూజన్). చంద్రుడు ఫలానా నక్షత్రంలో ఉన్నట్లు కనపడే రోజున మనం పుట్తే మన నక్షత్రం అది, మన రాశి ఆనక్షత్రం ఉన్న రాశి అనుకోటం మరో భ్రమ.
Question प्रश्न ప్రశ్న గురు గ్రహం సింహ రాశిలో ప్రవేశిస్తే గోదావరి పుష్కరాలు, కన్యారాశిలో ప్రవేశిస్తే కృష్ణా పుష్కరాలు అంటారు. మరి వీటి సంగతి ఏమిటి ?
Reply, जवाब, జవాబు : గురు గ్రహం సింహ రాశిలో ఎన్నటికీ ప్రవేశించలేదు. గురు గ్రహం భూమికి షుమారు 59 కోట్ల కిలోమీటర్ల దూరం లో ఉంది. సింహ రాశి మనకి షుమారు 36 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఒక కాంతి సంవత్సరం అంటే 9 లక్షల కోట్ల కిలోమీటర్లు. 36 కాంతి సంవత్సరాలంటే, షుమారు 324 లక్షల కోట్ల కిలోమీటర్లు. 59 కోట్ల కిమ్మీల దూరంలో ఉన్న గురువు 324 లక్షల కోట్ల కిమ్మీల దూరంలో ఉన్న సింహ రాశిలోకి ఎలా ప్రవేశిస్తుంది ?
Question प्रश्न ప్రశ్న పుట్టిన నక్షత్రం, చచ్చిపోయిన నక్షత్రం చెడ్డవయితే శాంతి చేయాలా ? ఇళ్ళు పాడు పెట్టాలా ?
Reply, जवाब, జవాబు : నక్షత్రాలలో మంచివి చెడ్డవి అనేవి ఉండవండీ. ప్రపంచంలో నక్షత్రాలకు శాంతి చేసే ఆచారం భారత ఉపఖండంలో తప్ప మరెక్కడా లేదు. శాంతి చేయనందువల్ల వాళ్ళకి ఏమైనా చెడు జరుగుతున్నదా ? మనకే ఎందుకు జరుగుతుంది ? ఇళ్ళెందుకు పాడు పెట్టుకోటం ?
Question प्रश्न ప్రశ్నమన రాష్ట్రపతులకు, ప్రధాన మంత్రులకు, గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు, మంత్రులకు, ఎంపీలకు, ఎమ్ ఎల్ ఏ లకు, జ్యోతిష్కులంటే పరమ భక్తి కదా ?
Reply, जवाब, జవాబు : వాళ్ళ భక్తి వాళ్ళు వ్యక్తిగతంగా ఉంచుకుంటే మంచిదే. వాళ్ళు దేశ, రాష్ట్ర వ్యవహారాలలో, జ్యోతిషాన్ని ప్రవేశ పెట్టి ప్రజలను భ్రష్ఠు పట్టిస్తున్నారు. అలాటి పాలకులను ఎన్నుకున్నందువల్ల వచ్చే కష్ట నష్టాలకు వోటర్లే బాధ్యులు.
(ఇంకా ఉంది.)
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.