303 రాష్ట్ర రాజధానిగా దొనకొండ మేలా, విజయపురి మేలా?
చర్చనీయాంశాలు: 302, Donakonda, Vijayapuri, రాజధాని, దొనకొండ, విజయపురి
ఈరోజు ఆంధ్రజ్యోతి (19-7-2014) సంపాదకీయం పేజీలో అడుగున ''ప్రకాశంలో కొత్త రాజధాని'' అనే వ్యాసం, శ్రీ కైపు వెలుగొండా రెడ్డి, రిటైర్డ్ ఇంజనీర్ గారు వ్రాసిన వ్యాసానికి, ఇది ప్రతిస్పందన . వారు వ్రాసినవి సబబుగానే ఉన్నాయి. నేను కొత్తాంధ్రప్రదేశ్ రాజధానిగా దొనకొండకు అనుకూలంగా గతంలోనే వ్రాసియున్నాను. పోస్టునంబరు 157 clickచూడండి.
ఈసందర్భంగా మనం ముఖ్యంగా గమనించవలసినది, శ్రీబాగ్ ఒడంబడిక ద్వారా 1937లో రాయలసీమ వారికి రాజధానికి ఇస్తామని మన పెద్దలు వాగ్దానం చేసి ఉన్నారు. దీనిని గౌరవించటం న్యాయం అనేది నా అభిప్రాయం. అయితే, రాయలసీమలో ఏప్రాంతంలో రాజధానిని నెలకొల్పినా, వారు కొత్తనిబంధనలు విధించకుండా బేషరతుగా ఒప్పుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో జరిగినట్లుగా స్థానికులు ముల్కీలు గిల్కీలు అంటే కుదరదు. ఈమురికిని మనం అంటించుకోకూడదు. రాజధాని ఎక్కడ ఉన్నా వలసలు అనేవి తప్పనిసరి.
ఈరోజు గ్రాండ్ ట్రంక్ రోడ్ పై నడచి వెళ్తూ ఉండగా, ప్రక్కన మణుగూరు నుండి కనిగిరి వెళ్ళే ఎపిఎస్ఆర్ టీసీ బస్ నన్ను దాటుకుంటు, వెళ్ళటం నాకు ఆశ్చర్యం కలిగించ లేదు. నాకు వెంటనే తట్టింది, కరువు ప్రాంతమైన కనిగిరి నుండి పొట్టచేత పట్టుకుని కొన్ని వందలు| వేల మంది మణుగూరు , బహుశా బొగ్గు గనులలో పనిచేయటానికి వలస వెళ్ళారనే అభిప్రాయం నాకు కలిగింది. పొట్టచేత పట్టుకుని మన తెలుగువాళ్ళు ఫిజీ, వెస్టు ఇండీస్, దక్షిణ ఆఫ్రికా వంటి సముద్రాంతర దేశాలకే కాక రెక్కలుముక్కలు చేసుకొని ఓడలను విరక్కొట్టటం కోసం, గుజరాత్ లోని అలాంగ్ రేవుకు కూడ వలస వెళ్ళారు. అందుచేత వలసలను ఆపే విధంగా ఎలాంటి డిమాండ్లను చేయకూడదు, ఒప్పందాలను చేసుకోకూడదు.
రాజధాని అనేది బేషరతుగానే ఏర్పాటు కావాలి.
రాజధానిలో ఘరానా వలసదారులు, అతి భారీగా భూములను కొనుగోలుచేసి నివాస స్థలాలకొరత సృష్టించటం, స్పెక్యులేషన్ కి పాల్పడటం, ఈ ఘోరాలను అరికట్టటానికి, దీనికి వేరే చట్టాన్ని చేయాల్సి ఉంటుంది. అయితే, ఇది ఒక ప్రాంతం వారిని వ్యతిరేకిస్తున్నట్లు, వేరొక ప్రాంతం వారిని రక్షిస్తున్నట్లు కాక, అందరికీ వర్తించేలాగా, ప్రాంతీయభేదాలకు దారితీయకుండా ఉండాలి.
దొనకొండ కన్నా కర్నూలు ఏవిషయంలో మెరుగు?
పోస్టు నంబరు 157 వ్రాసిన నాటికన్నా ఈరోజుకి సుస్పష్టం అయిన విషయం ఏమిటంటే, కెసీఆర్-హరీష్-కెటీఆర్ ఏడుపు. నాగార్జునసాగర్ నుండి తాగటానికి 10టిఎంసీల నీళ్ళు ఇవ్వమని గవర్నర్, 3 టిఎంసీల నీళ్ళు ఇవ్వమని కృష్ణాజలాల బోర్డు ఆదేశిస్తే, కెసిఆర్ అడ్డుపడటం విజ్ఞులైన పాఠకులకు తెలుసు.
దక్కన్ క్రానికల్ లో వచ్చిన వార్తలను బట్టి, రాజధానికి 10 టిఎమ్ సీ ల నీరు కావాలి. విజయవాడ, గుంటూరుల మధ్య రాజధానిని నెలకొల్పితే, ప్రకాశం బ్యారేజి వద్ద ఈనీటిని తోడుకోవాలి. అయితే ప్రకాశం బ్యారేజీకి నీటిని వదలటానికి ప్రతిసారీ, కెసిఆర్ ఏడుస్తూ ఉంటాడు. చట్టపరమైన హక్కులు, కేంద్ర పర్యవేక్షణ ఇవన్ని అమలుజరగటం, అంతతేలికేమీ కాదు. రాజధానిలో శాంతి భద్రతలను పర్యవేక్షించటం కొరకు గవర్నర్ కు అధికారం ఇచ్చే విషయంపై గతంలో కాంగ్రెస్, బిజెపి, కేంద్రమంత్రులు ఎన్ని హామీలు ఇచ్చి ఉన్నా, కేంద్ర హోం శాఖ కార్యదర్శి ముడ్డినేలకేసి రాశాడు. ఆవిషయంపై మాట్లాడటానికి కూడ ఆయన ఒప్పుకోలేదని వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలో విజయవాడలో కొత్తరాజధానికి అదనపు నీటిని పంపింగు చేసుకోటం, ఏవరదలో వస్తే తప్ప అసాధ్యం.
కర్నూలులో రాజధానిని నెలకొల్పుకుంటే, మనం తుంగభద్ర నదిలోనే పంపింగు స్టేషన్లు ఏర్పాటుచేసుకుని నీళ్ళు తోడుకోవచ్చు. బహుశా నీళ్ళకరువు ఉండక పోవచ్చు.
ఈసందర్భంగా విజయపురి అర్హతలను మరొకసారి పరిశీలించటం న్యాయం. ఈవిషయం గురించి ఇంతకు ముందు పోస్టునంబర్ 158 లో వ్రాశాను. click.
అయితే ఆపోస్టు వ్రాసిన సమయంలో, త్రాగునీరు ఇవ్వటానికి కెసీఆర్ కెటీఆర్ హరీష్ ల ఏడుపులు లేవు. నదుల ప్రక్కన పంపింగు స్టేషన్లను ఏర్పాటు చేసుకుని తమ వరకు కావలసిన త్రాగునీటిని డ్రాచేసుకోటం ఆప్రక్క గ్రామాల, పట్టణాల సహజ హక్కు కనుక వాటికి ఏట్రిబ్యునల్ ల నీటి కేటాయింపు అక్కరలేదని నాఅభిప్రాయం. మనం రాజధానిని, నాగార్జునసాగర్ దక్షిణతీరంలో, నందికొండకి వెళ్ళే లాంచీలరేవుకి, సాగర్ డామ్ ఎగువకి మధ్యప్రదేశంలో ఏర్పాటు చేసుకుంటే, పంపింగు స్టేషన్ ని నదిలో ఏర్పాటు చేసుకుని కావలసినంత నీటిని డ్రాచేసుకోవచ్చు. ఈప్రాంతం అంతా పుట్టలు, ఎర్రమట్టి దిబ్బలు , కంప ఉన్న అటవీ ప్రాంతం. దీన్ని డీనోటిఫై చేయటానికి అటవీశాఖకూడ అభ్యంతరం పెట్టక పోవచ్చు. కొంత కంప వేస్టుల్యాండ్, సమీప గ్రామాల పరిథిలో ప్రభుత్వభూమిగా కూడ ఉండచ్చు. ఏది ఏమైనా వృధాగా ఉన్నభూమిని మనం వినియోగం లోకి తెచ్చుకున్నట్లు అవుతుంది. భూసేకరణకి ఒక పైసా కూడ ఇవ్వక్కరలేదు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టును నిర్మించినపుడే, మాచర్ల విజయపురి రైల్వే మార్గం (సుమారు 17 కిలోమీటర్లు) ను చేపట్టి ఉండ వలసి ఉన్నది. ఆనాడు ఎందుకో ఆపని చేయలేదు. ఇపుడు రూ. 20 కోట్లతో దానిని పూర్తి చేయవచ్చు. ఇపుడు మనం విజయపురి నుండి, లేక మాచర్లనుండి దొనకొండ | దిగువమెట్ట | గిద్దలూరు| కంభంకి ఒక రైల్వే లైను, ఒక నాలుగులేన్ల హైవే నిర్మించుకుంటే, రాయలసీమకు బాగా దగ్గర అవుతుంది. గుంటూరు కర్నూలు రోడ్డు మార్గాన్ని ఇప్పటికే జాతీయ రహదారిగా మార్చటానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. మనం నిర్మించే విజయపురి | మాచర్ల రహదారి ఈగుంటూరు కర్నూలు రహదారిని దోర్నాల త్రిపురాంతకం మార్కాపురం ప్రాంతంలో కలుస్తుంది. నాలుగు రోడ్లకూడలి ఏర్పడుతుంది.
శ్రీ కైపు వెలుగొండారెడ్డి గారు చెప్పినట్లుగా , చందవరం దగ్గర సాగర్ కుడి కాలువలోంచి రాజధానికి నీళ్ళుతోడుకోటం ఆచరణలో కుదరదు. కెసిఆర్ కెటీఆర్ హరీష్ లు ఏడుస్తూ ఉంటే పని నడవదు. పైగా అలా రాజధానికి నీళ్ళు తోడుకోటం వల్ల, చందవరం దగ్గర సాగునీటి కొరత ఏర్పడుతుంది.
కెసీఆర్ కెటీఆర్ హరీష్ ల ప్రవర్తన, కేంద్ర నిర్లక్ష్యం | నిస్సహాయత చూస్తుంటే, ముందు ముందు నాగార్జున సాగర్ కుడి కాలువ భవిష్యత్ ఏమిటా అనే అనుమానం వస్తున్నది.
మనం విజయపురి| మాచర్ల నుండి ఉత్తర దక్షిణాలుగా కనిగిరి, దర్శి , పొదిలి ల వరకు ఒక పారిశ్రామి కారిడార్ ను నిర్మించు కోవచ్చు. తూర్పు పడమరలుగా వినుకొండనుండి ఆదోని లేక గుత్తి వరకు ఇంకొక కారిడార్ ను నిర్మించుకోవచ్చు. నంద్యాల, ఆదోని, గుంటకల్, శ్రీకాళహస్తి (తిరుపతి ఓవర్ క్రౌడెడ్) , కావలి, ఒంగోలు, విజయనగరం, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, ఏలూరు , తణుకు, తుని, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట,(విశాఖ , విజయవాడ, గుంటూరు , రాజమండ్రి, కాకినాడ, ఓవర్ క్రౌడెడ్) లలో కొన్నిరాష్ట్ర స్థాయి కార్యాలయాలను నెలకొల్పుకోవచ్చు. కోరిక, చిత్తశుధ్ధి ఉంటే, ఎన్నో స్నేహపూర్వక మార్గాలు ఉంటాయి.
అంతర్జాతీయ యాత్రిక కేంద్రంగా దక్షిణ విజయపురి
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయపురిని, ఫోర్ వే విజయపురి దొనకొండ రోడ్డును నిర్మించుకుంటే, అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెలకొల్పుకుంటే, విదేశీ యాత్రికులను, ఉత్తర భారత, దక్షిణ భారత యాత్రీకులను, హైదరాబాద్ టచ్ చేయనీయకుండా, ముందుగానే విజయపురిలో దించుకోవచ్చు. అక్కడనుండి వారికి శ్రీశైలం, మహానంది, అమరావతి, విజయవాడ,మార్కాపురం, మొ|| శేషాంధ్ర (సీమాంధ్ర) ప్రదేశాలకు ప్యాకేజీ టూర్లను ఏర్పాటుచేసి టూరిజాన్ని అభివృధ్ధి చేసుకోవచ్చు.
అన్నిటికన్నా ముఖ్యం
రాజధాని ఎక్కడ ఏర్పడినా అది పది సంవత్సరాల తాత్కాలిక రాజధానిగానే ఏర్పాటుకావాలి. మనకి మూడు రాష్ట్రాలు కావాలి అనే అసలు విషయాన్ని మరచి పోకూడదు. -- అవి ఉత్తరాంధ్ర, దక్షిణ ఆంధ్ర, రాయలసీమ. అయితే క్రియేట్ చేసే ఇన్ఫ్రా స్ట్రక్చర్ వృధా కాదు. ఇపుడు మనకి చంద్రబాబు గారు కోతలు కోసినట్లుగా సింగపూర్ చేసేందుకు, వేలకోట్లు కేంద్రం గానీ వేరొకరు గానీ ఇవ్వపోటంలేదు. శుష్క వచనాలూ, శూన్యహస్తాలూ మాత్రమే మనకి చూపిస్తారు. కాబట్టి, విజయపురి అయినా, దొనకొండ అయినా కర్నూలు అయినా రాజధాని భవనాలు సహజంగా చిన్నవిగానే ఉంటాయి.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.