282 కోర్టులముందు జాగు అయ్యిందేమో; కానీ ప్రజలముందు బెటర్ లేట్ దాన్ నెవర్!
చర్చనీయాంశాలు: 282, కోర్టులు, లిమిటేషన్, నరేంద్రమోడీ, అఫిడవిట్లు
శ్రీనరేంద్రమోడీగారు మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినవారు. వారికి చట్టం తెలియదని ఎవరూ అనుకోలేరు. వారి ధర్మపత్నిపేరు శ్రీమతి జశోదా బెన్ గారు. గుజరాత్ లో ప్రభుత్వ టీచర్ గా పనిచేసి విశ్రాంతి తీసుకుంటు గుజరాత్ లోని ఒక గ్రామంలో ఉంటున్నారు. శ్రీమోడీ గారు సుమారు 45 సంవత్సరాల క్రితమే ఆమెను పుట్టింట్లో వదిలేసి ముఖం తప్పించినప్పటికీ, చట్టప్రకారం, ఆమె శ్రీమోడి గారి భార్యయే. విడివిడిగా ఉంటున్నప్పటికీ, విడాకులు తీసుకోలేదు కాబట్టి, చట్ట ప్రకారం ఎక్కడ భార్య పేరు ప్రకటించ వలసి వచ్చినా, ఆమె పేరును వ్రాయక తప్పదు.
ప్రజాప్రాతినిథ్య చట్టం ప్రకారం, ఎన్నికలలో పోటీ చేసే వారు, నామినేషన్ తో పాటు, తమ భార్యా పిల్లలు వివరాలు, వారిపేర్లతో ఉన్న ఆస్తులు, అప్పులు వివరాలు ప్రకటించాలి. దీనికొరకు నిర్దేశితమైన ఫారం ఉంది. ఉద్దేశ్యం ఏమిటంటే, పారదర్శకత.
శ్రీమోడీగారు గుజరాత్ శాసనసభకు మూడుసార్లు, 2014 లో వడోదారా లోక్ సభనుండి ఒకసారీ, 2014 లో వారణాసి లోక్ సభనుండి ఒకసారీ పోటీ చేసారు. గుజరాత్ శాసన సభకు పోటీచేసిన మూడు సార్లూ ఆయన తన నామినేషన్ లో భార్య పేరు, ఆస్తుల వివరాలు వ్రాయాల్సిన గడిని ఖాళీగా వదిలేశారు. 2012 గుజరాత్ లోని మణినగర్ అసెంబ్లీ నియోజక వర్గ ఎన్నికలలో శ్రీ మోడీ భార్య పేరు గడిని భర్తీ చేయలేదు. దీనినిరిటర్నింగు ఆఫీసర్ పట్టుకొని ఆయన చేత పూర్తిచేయించి ఉండవలసింది. పూర్తిచేయటానికి నిరాకరిస్తే నామినేషన్ ను తిరస్కరించవలసి ఉన్నది. కానీ వారు అలా చేయలేదు. అందువల్ల శ్రీ మోడీ తన భార్యపేరును, ఆమె ఆస్తుల వివరాలను రహస్యంగా ఉంచినట్లయ్యింది.
ప్రజా ప్రాతినిథ్య చట్టం సెక్షన్ 125ఎ.(3) అఫిడవిట్ సమాచారాన్ని దాచటాన్ని నేరం గా పరిగణిస్తుంది. దీని ప్రకారం, ఈనేరానికి ఆరునెలల వరకు జైలు శిక్ష పడచ్చు.
నిశాంత్ వర్మ అనే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త , ముందు రిటర్నింగ్ ఆఫీసర్ ని శ్రీ మోడీ పై చర్య తీసుకొన మనికోరగా, ఆయన పట్టించుకున్నట్లు కనపడదు.
తదుపరి శ్రీ నిశాంత్ వర్మ, సంబంధించిన పోలీస్ స్టేషన్ లో, తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేసినందుకు శ్రీ మోడీపై, దానిని పట్టించుకోనందుకు రిటర్నింగు అధికారిపై, ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేయటానికి ప్రయత్నించగా పోలీసు వారు నిరాకరించారు.
రిటర్నింగ్ అధికారి, మరియు పోలీసు వారి ఇన్ యాక్షన్ వల్ల బాధ చెందిన శ్రీ నిశాంత్ వర్మ తప్పనిసరి అయ్యి, ఏప్రిల్ 2014లో అహమ్మదాబాదు రూరల్ కోర్టులో కంప్లెయింట్ ఫైల్ చేయవలసి వచ్చింది.
“...An offence is made out [against Mr. Modi] under Section 123 (A) (3) of The Representation of People Act for leaving the column blank... [However] the complaint has been made after one year and four months. Therefore, cognisance of the offence cannot be taken under Section 468 Cr.PC, ...”
విచారణ జరిపిన ఎడిషనల్ జుడిషియల్ ఛీఫ్ మేజిస్ట్రేట్ శ్రీ ఎమ్.ఎమ్. షేక్ గారు, సెక్షన్ 125.ఎ.3 ప్రకారం నేరం జరిగిందని అభిప్రాయపడ్డారు. కానీ కంప్లెయింటును ఆలస్యంగా ఫైల్ చేసినందువల్ల ''టైమ్ బార్'' అయిందని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 203 క్రింద తన అధికారం ప్రకారం దానిని తిరస్కరించారు.
ఈసందర్భంగా వారు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 468ని పరిగణనలోకి తీసుకున్నారు. సెక్షన్ 468 మూడేళ్ళ కన్నా తక్కువ శిక్ష పడే నాన్ సీరియస్ కేసులకు కాలదోషాన్ని (లిమిటేషన్) ఒక సంవత్సరంగా నిర్ణయిస్తుంది. కంప్లెయింటును ఏడాదీ నాలుగు నెలల తరువాత, అంటే 4నెలలు ఆలస్యంగా ఫైల్ చేశారు.
శ్రీ వర్మ గారి లాయర్ శ్రీ కె.ఆర్. కోస్తీ గారు, రివిజన్ పిటీషన్ ద్వారా ఈ ఆర్డర్ పై, పైకోర్టుకి వెళ్తామని చెప్పారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 2012 నాటికే శ్రీమోడీ గుజరాత్ కి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పాలన గురించి, చట్టాలగురించి అవగాహన సంపాదించి ఉండాలి. పైగా ఎం.ఎ. పాలిటిక్సు స్నాతకోత్తర పట్టభద్రుడాయే. సమాచారాన్ని దాచటం నేరమని ఆయనకు తెలియదని ఎలా అనుకోటం.
న్యాయశాస్త్రంలో ఒక సూక్తి ఉంది. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్యూజ్. చట్టం గురించి తెలియక పోటం, తప్పించుకోటానికి ఒక నెపంగా పనికి రాదు. దేశంలో ఎన్ని వందల చట్టాలున్నా, ఆచట్టాల గురించి తెలుసుకోవలసిన బాధ్యతను పౌరులపై ప్రభుత్వం, కోర్టులు మోపుతున్నాయి.
2014 లోక్ సభ ఎన్నికలలో కూడ శ్రీమోడీ గారు, తన ధర్మపత్ని గురించిన సమాచారాన్ని దాచేవారేమో. కానీ, 2013లో సుప్రీం కోర్టు ఒక రూలింగు ఇచ్చింది. అఫిడవిట్ లో అన్ని గడులను పూర్తి చేయాలని, ఖాళీలను ఉంచరాదని, నిర్దేశించింది. అందువల్ల శ్రీ మోడీగారు తప్పనిసరి అయ్యే 2014 అఫిడవిట్ లో నిజాన్ని బయట పెట్టవలసి వచ్చింది.
శ్రీమోడీ గారూ, జశోదా బెన్ గారిని కూడ నవ్వించండి
ఈ మధ్య శ్రీ ప్రధానమంత్రిగారు భూటాన్ సందర్శించారు. ఇలాటి సౌహార్ద్ర పర్యటనలలో, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, దేశాధినేతలు తమతమ భార్యలను తమ వెంట తీసుకు వెళ్ళి ఆయా దేశాధినేతల సతీమణులకు పరిచయం చేయటం, వారూ వీరూ కలిసి నవ్వుకోటం జరుగుతుంది. కొద్దిరోజులు క్రితం ఉపరాష్ట్రపతి శ్రీ అన్సారీ గారు సతీ సమేతంగా చైనా సందర్శించిన ఫొటోను చూడండి.
జశోదాబెన్ గారికి కూడ న్యూయార్కు వంటి ప్రదేశాలను చూడాలని కోరిక ఉండచ్చు. స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి స్పీడ్ బోట్ లో ప్రయాణించాలనే కోరిక ఉండచ్చు. ఐఫెల్ టవర్ ఎక్కాలని కోరిక ఉండవచ్చు. చైనా గోడను ఎక్కాలనిపించ వచ్చు. పీఎస్ ఎల్ వీ 23 వంటి సాటిలైట్లను శ్రీహరి కోటలో లాంచ్ చేస్తుండగా, నింగికెగురుతుంటే, ఆనందించాలనిపించ వచ్చు.
స్మృతి ఇరానీ వంటి వారి వలె ఆమె గొప్పసుందరాంగి కాకపోవచ్చు. శ్రీమతి ఆనందీ బెన్ గారి వలె ఆమె గొప్ప సునిశిత బుధ్ధి కలిగినది కాకపోవచ్చు. కానీ, ఆమె ఉపాధ్యాయురాలిగా తన సర్వీసులో వేల మంది భావి భారతపౌరులను తీర్చిదిద్దిన సు-గురువు. పతి అనుగ్రహం కొరకు, క్షేమంకొరకు పూజలు చేసే భారతీయ స్త్రీయొక్క పేరుప్రఖ్యాతులను నిలబెట్టిన గొప్పనారీమణి. ప్రపంచంలో ఏదేశపు స్త్రీలకు కూడ స్వఛ్ఛందంగా ఈ సుగుణం ఉండదు.
ఇతర దేశాధిపతుల, మన దేశాధిపతుల, భార్యలకు, రాష్ట్రపతుల, ఉపరాష్ట్రపతుల భార్యలకు, ప్రధానమంత్రుల భార్యలకు లభించే ఈ ఐశ్వర్యాలను, శ్రీ నరేంద్రమోడీ మహోదయ్ ధర్మపత్నిగా తనకూ లభించాలని ఆమె కోరినా కోరకపోయినా, ఆమెకు అవి లభిస్తే విని ఆనందించాలని , భారతీయ సంస్కృతిని గౌరవించే, సగటు భారతీయ స్త్రీపురుషులు కోరుకోటం తప్పా?
శ్రీనరేంద్రమోడీ దంపతులు అలా ప్రపంచ సందర్శనం చేస్తూ, భారతీయ దాంపత్యజీవనం యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్తుంటే, గర్వంతో రొమ్ములు విరుచుకోవాలనీ, రోమాంచాలు పొందాలనీ, ఏభారతీయుడు కలలుకనడు?
శ్రీనరేంద్ర మోడీనుండి ప్రజలు పారదర్శకతను వాంఛించటం తప్పు కాదు. శ్రీదిగ్విజయ్ సింగ్ మహోదయ్ వలె, ఆఖరి క్షణం దాకా ఆగకుండా, శ్రీనరేంద్రమోడీ మహోదయ్, ఇంకా దాచిపెట్టినవేమన్నా ఉంటే, అవన్నీ కూడ ప్రజల దృష్టికి తెస్తే, వారి వ్యక్తిత్వానికే మంచి శోభ కలుగుతుంది. పారదర్శకతగల నేతలు గల జాతిగా, భారతీయ కీర్తి పతాక కూడ ఎగురుతుంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.