243. 1826 రోజుల ముచ్చటకు ఎందుకంత ఎగిరి పడటం?
చర్చనీయాంశాలు: నరేంద్రమోడీ, అద్వానీ, జోషీ, నవాజ్ షరీఫ్, పాకిస్థాన్, మహాభారతం, మీడియా, అరుణ్ జైట్లీ, తిక్కన, ఘంటసాల, నర్తనశాల
1826 రోజులంటారేమిటి? మోడీగారి బాద్షా గిరీ శాశ్వతం కాదా?
సాధారణ పరిస్థితులలో ప్రధానమంత్రుల పదవీకాలం ఐదేళ్ళు. అంటే 365 x 5 = 1825 + leap year 1 day = 1826 రోజులు.
ప్రశ్న: శ్రీమోడీగారు గుజరాత్ ను మూడు ఎన్నికల సీజన్లనుండి అంటే షుమారుగా 15 ఏళ్ళనుండి పరిపాలిస్తున్నారు, అలాగే భారత్ ను కూడ 2029 వరకు పాలించవచ్చు కదా.
జవాబు: నిజమే.
ఈవ్యాసాన్ని ప్రారంభించటానికి మంచి నర్తనశాల సినిమా పద్యాన్ని ఎన్నుకుంటున్నాను. ముందుగా స్పష్టీకరణ, మరియు ప్రార్ధన, ఎవరినీ గాయపరచటం ఈ వ్యాసకర్త ఉద్దేశ్యం కాదు. నాగాడిద బుధ్ధికి తోచింది వ్రాస్తున్నాను. వీలైనంత వరకు చట్టాన్ని అతిక్రమించకుండానే వ్రాస్తున్నాను. ఎవరి మనసుకైనా బాధ కలిగితే , క్రింద కామెంట్లలో వ్రాయమని ప్రార్ధిస్తున్నాను.
మహా భారతం. విరాట పర్వం. తిక్కన రచన. నర్తనశాల సినిమాలో ఘంటసాల కల్యాణిలో పాడారు. ఈ పద్యసారం ఏమిటంటే, ధర్మరాజు గొప్పదనాన్ని ఉగ్గడించటం.
26 మే నాడు నరేంద్రమోడీ తన ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని భూదేవంత అరుగులతో, ఆకాశమంత పందిళ్ళతో జరుపుకున్నారు. భారత్ లోప్రధాని అనే వాడు సాంకేతికంగా అమాత్యుడే అయినా చక్రవర్తిలాగా , ఖలీఫాలాగా, సుల్తాన్ లాగా ప్రవర్తిస్తాడు. ప్రధాన మంత్రి కొడుకులు యువరాజుల్లాగా (నరేంద్రమోడీ గారి మాటలలో షాజాదా ప్రిన్స్), కూతుళ్ళు యువరాణిల్లాగా, అల్లుళ్ళు జాతికే జామాతల్లాగా ప్రవర్తిస్తారు. ధర్మరాజుగారి పట్టాభిషేకాలకు, రాజసూయాలకు, అశ్వమేథాలకు, స్వతంత్ర దేశాధీశులెవరైనా హాజరయ్యేవారేమో తెలియదు, ఎందుకంటే, తిక్కన గానీ, వ్యాసుడు గానీ, నన్నయ, ఎర్రనలు కానీ, స్వతంత్ర దేశాధీశుల ప్రసక్తి తేలేదు. నరేంద్రమోడీగారి విషయంలో నేపాల్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్ దీవులు, మారిషస్ వంటి సార్కు దేశాల (భారతదేశం చుట్టూ దండలో పూలల్లాగా ఆవరించి యుండే దక్షిణ ఆసియా దేశాధిపతులు) అధిపతులను ఆహ్వానించారు. వీరంతా స్వతంత్ర దేశాధీశులే. సామంతులు కాదు.
రాష్ట్రాల ముఖ్యమంత్రులను సామంతులు అనాలా, లేక ఏమనాలి? జయలలిత, మమతా బెనర్జీ, మూలాయం సింగ్ యాదవ్, పట్నాయక్, వంటి వారిని సామంతులు అంటే ఊరుకోరు. శివరాజ్ సింగు చౌహాన్, వసుంధరా రాజే వంటి వారు నరేంద్రమోడీ వద్ద సామంతత్వాన్ని ఏదో అవసరం కొద్ది ఒప్పుకుంటున్నారే కానీ, అవకాశం దొరికినపుడు సమయం చూసుకుని తిరుగుబాటు చేయకమానరు.
సీసం. ఎవ్వని వాకిట నిభమద పంకంబు
రాజభూషణ రజో రాజి నడఁగు
ఎవ్వని చారిత్ర మెల్ల లోకములకు
నొజ్జయై వినయంబు నొరపు గఱపు
నెవ్వని కడకంటి నివ్వటిల్లెడు చూడ్కి
మానిత సంపద లీనుచుండు
నెవ్వని గుణలత లేడు వారాసుల
కడపటి కొండపైఁ గలయ బ్రాఁకు
తే. నతడు భూరిప్రతాప, మహా ప్రదీప
దూర విఘటిత గర్వాంధకార వైరి
వీర కోటీర మణి ఘృణి వేష్టితాంఘ్రి
తలుఁడు కేవల మర్త్యుఁడే ధర్మసుతుడు.
మొదటిపాదం. ధర్మరాజుగారికి ఏనుగుల మంద ఉంది. వాటి కుంభస్థలాల్లోంచి మదం అనే ఒక స్రావం ఊరుతూ ఉంటుంది. ఆకారిన మదం, జమ అయ్యి, ధర్మరాజుగారి కోట గుమ్మంలో బురద తయారయిందిట. ధర్మరాజు గారిని దర్శించుకోటానికి వచ్చిన సామంతరాజుల రష్ ఎక్కువైపోయి, వారి ఒంటిపై ఉన్న నగల్లో పొదిగిన వజ్రాలూ, రత్నాలూ , పొడి అయ్యి కింద ఉన్న బురదలో పడి పేస్టు అయ్యి ఆబురదను పూడుస్తున్నదిట.
మోడీగారిని దర్శించుకోటానికి వచ్చిన సామంతులకి ఆడి, బిఎమ్ డబ్ల్యూ , రోల్స్ రాయిస్, జగ్వార్ వంటి కార్లు ఉంటాయి. ఈకార్లు ఒకదానికొకటి రాసుకుంటే రాలేది రంగు. వసుంధరారాజే వంటి వాళ్ళు వజ్రాలను ధరించినా, పొడి నేలమీద రాలేంత షో లేదు. మన పాలకుల దగ్గర భారీగా బంగారం ఉంటుందనేది అందరికి తెలుసు. మన కొత్త ఆర్ధిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీగారి దగ్గర ఉన్న బంగారం, వెండి, వజ్రాల గూర్చి తెలుసుకోవాలంటే, పోస్టు నంబరు చూడండి.
పోర్ష్ కారు రూ. 1.02 crore.
మెర్సిడెజ్ బెంజి కారు రూ. 78.89 లక్షలు.
బిఎమ్ డబ్ల్యూ కారు రూ.85.57 లక్షలు.
హోండా ఎకార్డు కారు రూ.20.44 లక్షలు.
టొయోటా ఫార్ట్యూనర్ కారు రూ.23.28 లక్షలు.
బంగారం: రూ. 1.88 కోట్లు. 5.630 కిలోల బంగారం.
15 కిలోల వెండి, వజ్రాలు.
అవన్నీ ధరించుకొని రారనుకోండి. అవన్నీ ధరించుకొని వస్తే ఒకళ్ళనగలు మరొకళ్ళకి రాచుకొని పొడి నేల మీది రాలి, బురదను పూడ్చిందా లేదా అనే ప్రశ్న ఆవిర్భవిస్తుంది.
రెండో పాదంలో, ఒజ్జ అంటే ఉపాధ్యాయుడు. ధర్మరాజుగారి చరిత్రం ఉపాధ్యాయుడిలాగా మారి అన్నిలోకాలకి వినయం ఎలా ఉండాలో నేర్పుతుందట. నరేంద్రమోడీగారి చరిత్రాన్ని మీడియా భజన చేయటం ఈమధ్యనే మొదలు పెట్టింది. మనందరం వినయం నేర్చుకోటానికి, శ్రీ ప్రధానమంత్రిగారి చరిత్రను చదవాల్సిందే. పిల్లలకు వినయం సరిగా అబ్బుతుందో, అబ్బదేమో అని, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, పాఠశాలల్లో మోడీ చరిత్రను చదివించటానికి రెడీ అవుతున్నారు.
ఇపుడు మూడో పాదంలోకి రండి. ధర్మరాజుగారి కడకంటి చూపు యొక్క కిరణం మనమీద పడితే చాలు మనకు సకల సంపదలు సమకూరుతాయి. నరేంద్రమోడీ రాజు గారి కడకంటి చూపు కిరణాలు పడి సకల సంపదలు సమకూర్చుకున్న పారిశ్రామికి వేత్తలు ఇప్పటికే ఉన్నారు. అయ్యగారి కడకంటి చూపు కోసం, అంబానీ, అదానీ, వంటి భారతీయ పారిశ్రామిక వేత్తలే కాక, విదేశీ పెట్టుబడిదారులు జయహే, జయహే అంటూ భారత్ లోకి నగదుని కుమ్ముతున్నారు.
నాలుగో పాదం లోకి రండి. ధర్మరాజు గారి సుగుణాల తీగెలు (క్రీపర్స్) సప్త సముద్రాలకవతల ఉన్న కొండల మీదికి పాకుతున్నాయిట. నరేంద్రమోడీ గారి సుగుణాల లతాగుల్మాలు ఎక్కడికి పాకుతాయి. సప్తసముద్రాల అవతల అంటే రష్యానా, అమెరికానా, ఇంగ్లండా, ఫ్రాన్సా?
ఇపుడు చివరలో ఈసీసానికి అనుబంధంగా ఉన్న తేటగీతికి వద్దాం. ధర్మరాజుగారిచేత ఓడించబడిన శత్రురాజులు ఆయన పాదాలకు మొక్కటం ఆకాలంలో పరిపాటి. ఘృణి అంటే కిరణాలు. ఆయన పాదాలకు మ్రొక్కేటపుడు శత్రురాజుల తలల కిరీటాలపై ఉండే మణులు తమ ఘృణులను అంటే కిరణాలను ఆయన పాదాలపై ప్రసరించినపుడు, ప్రకాశిస్తున్న పాదాలు కలవాడు. ధర్మరాజు ప్రతాపం వెలుగులో శత్రురాజుల గర్వం అనే చీకట్లు పటాపంచలై పోయాయిట. నరేంద్రమోడీ గారి ప్రతాపం వెలుగులో సోనియా, రాహుల్ లా గర్వాంధకారాలు పటాపంచలైపోయాయా? అరవింద్ కేజ్రీవాల్ తరువాత మోడీగారిని సందర్శించి అయనకు కాల్ మొక్కుతాడా మొక్కడా? చంద్రబాబు నాయుడు, జగన్ లు ఇప్పటికే వెళ్ళి కాల్ మొక్కి వచ్చారే.
ఇంకా వ్రాయాల్సింది వంద పేజీలు ఉంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.