చర్చనీయాంశాలు: statue of unity,run for unity, India divide, సామూహిక పరుగులు, సమాజం
వీళ్ళంతా కలసిపరుగెత్తాలా?
నరేంద్రమోడీగారు కొన్ని వేలకోట్లు ఖర్చు పెట్టి అహమ్మదాబాద్ లో సర్దార్ పటేల్ గారి విగ్రహ ప్రాజెక్టును నిర్మించటానికి అఖిలభారత జనం దగ్గర ఇనుము పోగు చేస్తున్నారు కాబట్టి భారతీయులందరూ ఒక పెద్ద స్థూపంలాగా వెల్డింగ్ చేయబడ్డట్లు మనం భావించవచ్చా?
మోడీగారు గుజరాత్ ప్రభుత్వంచేత ఇంకా కొన్ని వందలకోట్లు ఖర్చుచేయించి మీడియా ప్రకటనలు ఇప్పించి జనంచేత పరుగులు తీయిస్తున్నారు కాబట్టి 'కన్నుల్లొ నా బొమ్మచూడు' అని భారతీయులందరూ (లేదా కనీసం మోడీగారి భక్తమహాశయు లందరు) ఒకరి కళ్లల్లోకి మరొకరుప్రతిబింబాలుగా మారి చూచుకుంటారంటే అంతకంటె భ్రమ వేరొకటి ఉండదు.
సార్ గారి పిలుపు మేరకు స్పోర్ట్స్ షూస్ ధరించి కడుపునిండా ఆమ్ లెట్ లో, చికెన్ పట్టించి, స్మార్ట్ ఫోనాదులచే సుభూషితులై రోడ్డెక్క గలిగిన కడుపు నిండిన భారతీయులు ఇంటికి తిరిగి వెళ్ళాక మరొక రౌండు చేపలు, మటన్ లాగించి, బెడ్ రూమ్ గోడలపై తగిలించిన టీవీలు చూచుకుంటూ తల్పగతులు కాగలరు.
ఇండియా దటీజ్ భారత్ లో ఎన్నో మినీ భారత్ లుఉన్నాయి. ప్రతి భారతీయ గ్రామంలోను, భారతీయ పట్టణంలోనూ పక్క పక్కనే ఉంటాయి. 'భూలోకంలో స్వర్గం, భూలోకంలో నరకం, అన్నీ ఎక్కడి కక్కడే.'
లోకాలు భిన్న ప్రకృతులు కలిగి ఉంటాయి. ఒక్కసారి తిక్కన భారతంలోకి వెళ్దాము.
శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతి పర్వం, చతుర్ధాశ్వాసం (4వ ఆశ్వాసం). భీష్ముడు ధర్మరాజుకి చేసిన బోధలో భాగంగా, భృగువు భరద్వాజుడికి చేసిన బోధ.
111వ పద్యం, కందం.
ఈలోకము దుఃఖబహుళ
మాలోకము భూరిసుఖ నిరంతర మందే
జాలియును లేక యొండొరు,
తో లెస్సగఁ బొంది యుండుదురు జనులనఘా.
తేటగీతి.
హస్తి మశకాంతరము గలదరసి చూడ
వాసగృహ శయనాసన వసన గంధ
మాల్య తౌర్య త్రికారామ మానినీ జ
నాది సుఖ సాధనములకు నందు నిందు.
హస్తి మశకాంతరము అంటే ఏనుగకు, దోమకు ఉండే తేడా.
నివసించే ఇల్లు: సౌధమా, గుడిసెయా!
శయనం అంటే పడక. చైనా నుండి దిగుమతి అయిన ఫర్నీచరా, లేక చినిగిన చాప -బొంతనా?
వసనం అంటే బట్టలు. సూట్లా లేక కుచేలాలా?
గంధం అంటే పౌడర్లు, స్నోలు, సౌందర్యసాధనాలా, సెంట్లాది సువాసనా ద్రవ్యాలా?
మాల్యం అంటే పూలదండలా?
తౌర్యత్రిక = నృత్య గాన వాద్య విశేషాలు. ఆధునిక కాలంలో అయితే పబ్బులు, బార్లు, హోటళ్లలో జరిగే డాన్సులు.
ఆరామం అంటే విశ్రాంతి గృహాలు (రెస్ట్ హౌసులు)
మానినీ జనం = భోగస్త్రీలు, దాసి స్త్రీలు (21వ శతాబ్ద భాషలో కాల్ గరల్స్, మొ||).
ఆది సుఖసాధనములకు నందు నిందు = అక్కడికి, ఇక్కడికి సుఖ సాధనాల్లో తేడా ఉంటుంది అని హైలైట్ చేయటం.
అని వెండియు = మరియు ,ఇంకా.
కందం.
ఇవి పుణ్యలోక విషయ
వ్యవసిత వచనంబు లధమమగు లోకముధ
ర్మ విదూర జనులు వొందుదు,
అనిరత బహు దుఃఖ నిలయమది విప్రవరా.
భూలోకంలో అంతా విరుధ్ధం. ఇక్కడ ధర్మవిదూర జనులు కావటం, సుందర భవనాలకు, సౌధాలకు, సూటు-బూట్లకు , గంధమాల్య తౌర్య త్రికాలకు ఒక అర్హత.
అందరు కలసి పరుగెత్తటం మోడీ గారడీయే తప్ప నిజం ఎన్నటికీ అవదు.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.