చర్చాంశాలు:
వ్యాస భారతం, మహాభారతం, తిక్కన, నర్తనశాల, mahabharata, పద్యకవిత్వం
1963లో విడుదలైన, నర్తనశాల సినిమా చూచిన వారికి గుర్తు ఉంటుంది. ధర్మరాజు మిక్కిలినేని, కంకుభట్టు వేషంలో విరటుడి ఆస్థానంలో రాజుతో జూదం ఆడుతూ ఉండేవాడు.
దండమూడి రాజగోపాలరావు భీముడిగా నటించాడు. విరాట పర్వ అజ్ఞాతవాసంలో పేరు వలలుడు. విరటుడి దగ్గర వంటవాడు.
అర్జునుడిగా ఎన్ టీ ఆర్. విరాట పర్వ అజ్ఞాతవాసంలో పేరు బృహన్నల. విరటుడి దగ్గర నాట్యాచార్యుడు.
విరాట పర్వం లో నకులుడి అజ్ఞాతవాసం పేరు దామగ్రంధి. విరటుడి గుర్రాలశాలకు అధిపతి. నటుడు కొమ్మినేని రాజగోపాలరావు.
విరాట పర్వం లో సహదేవుడి అజ్ఞాతవాసం పేరు తంత్రీపాలుడు. విరటుడి గోశాలకు అధిపతి.
విరాట పర్వం లో ద్రౌపది అజ్ఞాతవాసం పేరు సైరంధ్రి. నటి సావిత్రి.
కీచకుడిగా స్వర్గీయ ఎస్.వీ.రంగారావు. ఇండోనీషియన్లకు బాగా నచ్చాడు. 1964లో ఇండొనీషియా రాజధాని, జకార్తాలో జరిగిన మూడవ ఆఫ్రో ఆసియన్ చిత్రోత్సవంలో ఉత్తమ నటుడు గా గుర్తింపు పొందాడు. బృహన్నలగా ఎన్ టీ ఆర్ కు ఎందుకో గుర్తింపు దొరకలేదు.
ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం.
పాండవులు అజ్ఞాతవాసం చేసినపుడు జీతం సరిపోయేదా? విరటుడు, ధర్మరాజుని, బృహన్నలని తన సభలో మొదటిసారి చూసినపుడు, 'నా రాజ్యం మీకిచ్చేస్తాను. మీరు ఈభూమండలం మొత్తం పాలించటానికి అర్హులు. మీరు నారాజ్యాన్ని పాలిస్తూ, నారాజ్యాన్ని రక్షించండి'. అన్నాడు. మరి ఏమయ్యిందో ఏమో,జీతం ఎంత తక్కువ ఇచ్చాడో ఏమో, అసలు ఇచ్చాడో లేదో ఏమో, పాండవులు సాధారణ నౌకర్లలాగ ప్రవర్తించారు. తిక్కన కొంతవరకు పాండవులను, వ్యాసుడి కన్నా కొంత ఉదాత్తంగానే, ఉదారంగానే చిత్రించాడనాలి.
భీముడి విషయంలో కొద్దిగా వంకర కనిపిస్తుంది. వాయునందనుండు వంటకు మిగిలిన మాంసంబు లమ్మునెపంబున నిచ్చలు సహోదరులకు నిచ్చుచుండు . అంటే ఏమిటి? విరటుడి వంటశాలలో మిగిలిన మాంసాన్ని అమ్మే బాధ్యతను విరటుడు భీముడికి అప్పగించినట్లున్నాడు. అసలు మిగిలిన మాంసాన్ని విరటుడు అమ్మమని చెప్పటమే అర్ధంలేదు. మన భీముడుగారు, అమ్మరా నాయనా అంటే, అమ్మే నెపంతో, కొంత భాగాన్ని సోదరులకు ఇచ్చేవాడుట. ధర్మరాజు దానిని ఎలా తిన్నాడో ఏమిటో. మామూలుగా మనకి ఇలాంటివి రెస్టారెట్లలో జరుగుతూ ఉంటాయి.
విరాట పర్వం, ద్వితీయాశ్వాసం, 2వ పద్యం.
వచనం. దేవా! వైశంపాయనుండు జనమేజయునకిట్లనియె నట్టియెడ ధర్మసూనుండు సభాజనంబుల యుల్లంబులు రంజిల్ల రాజునకు వినోదంబులు వివిధోదాత్త ప్రకారంబులఁ జులుపుచు, నొక్కొక్కమాటు మధుర ప్రసంగంబుగా నాడిన నెత్తంబున గెలిచిన విత్తంబులు తమ్ముల కొసంగుచుండు
వాయునందనుండు వంటకు మిగిలిన మాంసంబు లమ్మునెపంబున నిచ్చలు సహోదరులకు నిచ్చుచుండు .
వివ్వచ్చుండు సంగీత ప్రసంగంబున మెచ్చువడసిన కనకాంబరాదులు సోదరులకుం జేర్చుచుండు .
నకులుండు దురగంబుల గ్రాసంబులం గనిన ధనంబులు తోడంబుట్టువులకుఁ బెట్టుచుండు .
సహదేవుండు గోవులం జూచి భూవల్లభుండు సంతసిల్లిన సమయంబున సముపార్జితంబులగు పదార్థంబులన్నియు నన్నలవశంబు చేయుచు వారలకు గోరసంబులం దుష్టి సలుపుచుండు .
ద్రౌపది తన్నరసికొని తిరుగుచున్న వీరలం గన్నులారం జూచుచును చితంపు నడవడి మెలుగుచుండు.
వ్యాసుడు. వ్యాసభారతం. విరాటపర్వం. 12వ ఆధ్యాయం శ్లోకాలు 5 నుండి 9 వరకు.
5 అజ్ఞాతం చ విరాటస్య విజిత్య వసు ధర్మరాజ
భ్రాతృభ్యః పురుషవ్యాఘ్రో యదార్హం సమ ర్పయచ్ఛతి
6 భీమసేనో ఽపి మాంసాని భక్ష్యాణి వివిధాని చ
అతి సృష్టాని మత్స్యేన విక్రీణాతి యుధిష్ఠిరే
7 వాసాంసి పరిజీర్ణాని లబ్ధాన్ అంతఃపురే ఽర్జునః
విక్రీణాన్ శ్చ సర్వేభ్యః పాండవేభ్యః ప్రయచ్ఛతి
వైబీరావు గాడిద వ్యాఖ్య.
విక్రీణాన్ అనే పదాన్ని చూడండి. లభించిన పాతచీరెలను (వాసాంసి పరిజీర్ణాని లబ్ధాన్ ) అమ్మటం, ఆడబ్బుని తన సోదరులకు ఇవ్వటాన్ని గమనించండి. మన అర్జునుడు గారికి ఉన్న పది నామాల్లో 'ధనంజయుడు'ఒకటి. రాజ్యాలపై దండెత్తి కొట్టుకొచ్చిన డబ్బు మధ్యలో నిల్చుంటాను కనుక తనకు ఆపేరు వచ్చిందని శ్రీవారే స్వయంగా చెప్పుకున్నారు. అలాంటి ఘనాఘన్ ధనంజయుడికి ఈ పాతచీరెలమ్ముకునే గతి ఏమిటి.
అందుకే తెనాలి రామకృష్ణ మహాకవి, శ్రీకృష్ణదేవరాయల సమ్ముఖంలో చెప్పిన చాటువు గుర్తుకు వస్తుంది.
రంజన చెడి పాండవులరి
భంజనులై విరటు కొల్వు పాల్పడి రకటా
సంజయా విధినేమందును
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్.
8 సహదేవోఽపి గోపానాం వేషమ్ ఆస్తాయ పాండవః
దధి క్షీరం ఘృతం చైవ పాణ్డవేభ్యః ప్రయచ్ఛతి
9 నకులొ ఽపి ధనం లబ్ధ్వా కృతే కర్మణి వాజినామ్
తుష్టే తస్మిన్ నరపతౌ పాండవేభ్యః ప్రయచ్ఛతి
10 కృష్ణాపి సర్వాన్ భ్రాతౄంస తాన్ నిరీక్షంతీ తపస్వినీ
యదా పునర్ అవిజ్ఞాతా తదా చరతి భామినీ
పాపం అమాయకురాలు ద్రౌపది మటుకు తన ఐదుగురు భర్తలను జాగ్రత్తగా ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండేది. ఐదుగురు భర్తలకు సేవలు చేయటం అంటే మాటలా? ఇది యజమానురాలు సుధేష్ణకు చేసే సేవకు అదనం.
సారాంశం ఏమిటి? పాఠకులే ధైర్యంగా చెప్పాలి.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.