కార్ల్ మార్క్స్ గెలిచాడు- అంటున్నారు ఆయన ఏమి చెప్పాడేమిటి?
ఆయనేం చెప్తాడు లేండి పాపం, ఉన్న మాటే అన్నాడు. మానవ సంబంధాలన్ని ఆర్ధిక సంబంధాలే నన్నాడు.
తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ సోదరుల మధ్య సంబంధాలన్ని ఆర్ధిక సంబంధాలని మీ అభిప్రాయమా?
సోదరులు అనే మాట, నూతన సంవత్సర శుభాకాంక్షలు Wish you happy new year లాగా అతిగా వాడబడి అరిగి పోయింది. కొందరు యువకులు ఏ సినిమాలో అంటించుకున్నారో గానీ, కనిపించిన ప్రతి వాళ్ళనీ పరిచయం ఉన్న వాళ్ళైనా, లేనివాళ్ళైనా, అంకుల్ అనో, ఆంటీ అనో పిలుస్తూ ఉంటారు. ఈపిలుపుల్లో నిజాయితీ, సీరియస్ నెస్ ఉండదు.
ప్రపంచ రాజ్యాలైయినా, భారతదేశమైనా, తెలుగు గడ్డ అయినా, మానవ ప్రవర్తనను నిర్దేశించేది పెట్టుబడి దారీ విధానం. తన నీడను ఏవ్యక్తైనా, ఎలా తప్పించుకోలేడో, అలాగే పెట్టుబడి దారీ విధానాన్ని ఎవరూ అతిక్రమించలేరు.
తెలుగు జాతి మనది, నిండుగ వెలుగజాతి మనది, వంటి పాటలు కేవలం భావావేశ సంజనితాలే తప్ప సమాజపు నగ్న సత్యాలకు ప్రతి బింబాలు కావు.
మనం పట్టించుకోం గానీ, మనలో కనీసం నాలుగు రకాల వ్యక్తులు ఉన్నారు.
మెదడు వీరులు. మెదడు పరిసరాలను, వాతావరణాన్ని, పరిశీలించి మనకు దిశా నిర్దేశం చేస్తూ ఉంటుంది. మెదడు తన తెలివి తేటలను ఉపయోగించి ఇది చేయి, అది చేయద్దు అని చెప్తూ ఉంటుంది. మెదడువీరులు కేవలం మెదడు మాటలే వింటారు. హృదయం చెప్పేదాన్ని పట్టించుకోరు.
సాంకేతికంగా ఆలోచిస్తే హృదయం అని మనం భావించే గుండెకాయ (heart) రక్తాన్ని శరీరం నుండి పంపు చేసుకొని ఊపిరితిత్తులకు పంపించి, ఆక్సిజన్ తో శుధ్ధి చేయించి, వెనక్కు తెచ్చుకుని తిరిగి ఆపాదమస్తకం శరీర భాగాలకు పంపించే ఒక గొప్ప పంపు మాత్రమే. కానీ తాత్వికులు, ఈ హృదయానికి దయ, ప్రేమ, కృతజ్ఞత, సానుభూతి (sympathy, empathy) వంటి ఉదాత్తమైన గుణాలను అంటగట్టారు.
హృదయవీరులు మెదడు చెప్పే దాన్ని పట్టించుకోరు. తమకు ఉండే దయ, ప్రేమ, కృతజ్ఞత, సానుభూతి (sympathy, empathy) వంటి ఉదాత్తమైన గుణాలు అందరికీ ఉండాలని ఆశిస్తారు. పెట్టుబడి దారీ విధానం మనపై విధించే పరిమితులను గుర్తుంచుకోరు. తమ భావావేశంలో తాము కొట్టుకు పోటమే తప్ప, లోకరీతులను గమనించరు. కవులు మనకి హృదయవీరులలో అగ్రగణ్యులు. వారు వ్రాసే కవితలు , పద్యాలు, కొంతకాలం ప్రజలను పెట్టుబడిదారీ వాస్తవాలను, తమ రాగ ద్వేషాలను మరచి పోయేలాగ చేస్తుంది. ఆసమయంలో, ప్రజలు మెదడు ఇచ్చే సలహాలను వినిపించుకోకుండా, హృదయం చెప్పినట్లుగా నడచు కుంటూ, పోరాటాలు చేస్తారు. త్యాగాలు చేస్తారు. కొన్నిసార్లు ప్రాణాలనే అర్పించుతారు.
నేతలు మెదడు వీరులు, సామాన్యప్రజలు హృదయవీరులు అయితే పలు సమస్యలు తలెత్తుతా యి. ప్రస్తుతం, సీమాంధ్ర, తెలంగాణలో జరుగుతున్నది ఇదే.
అయితే లోకంలో 100% మెదడు వీరులు గానీ, 100% హృదయవీరులు గానీ ఉండటం చాలా అరుదు.
మూడవ రకం వారు, 70% మెదడు వీరులు, 30% హృదయవీరులు. వీరులు ఎక్కువగా వ్యాపార తత్వం కలిగి, అప్పుడప్పుడు భావావేశాలు కలిగి, చందాలు అవీ ఇస్తు ఉంటారేమో కానీ,ప్రాధమికంగా ఎత్తులు, జిత్తులు, వీరి సహజ స్వభావం.
నాలుగవ రకంవారు, 40% మెదడు, 60% హృదయం, ఉండి భావావేశాల పాలు ఎక్కువ. కనుక వీరిని మంచి ఐడియాలతో ఉత్సాహపరచ కలిగినప్పుడు సత్ఫలితాలను రాబట్ట కలుగుతాము. గాంధీ గారు లక్షల మంది భారతీయులను లాఠీ దెబ్బలను తినగలిగేలాగా, జైళ్ళలో నూనె గానుగలను తిప్పే లాగా, మండుటెండలే రాళ్ళు పగలగొట్టేలాగా చేయగలిగింది, ఈనైపుణ్యంతోనే.
ద్వేషంతో కూడిన భావాలతో వారి మస్తిష్కాలను కిర్రెక్కించినప్పుడు, దుష్ ఫలితాలను రాబట్ట కలుగుతాము . కెసిఆర్&కో, కోదండరాం &కో తెలంగాణ యువకులను ఉద్రేకపరచి ట్యాంకుబండుపై విగ్రహాలను పడకొట్టించిందీ, వందలమంది యువకులచేత ఆత్మ హత్యలు చేసుకునేలాగా ప్రేరేపించింది, ఈనైపుణ్యంతోనే.
తెలుగు వాళ్ళలో అత్యధికులు నాలుగో రకం అని వేరుగా చెప్ప నవసరంలేదు.
ఇప్పుడు కవుల భావావేశాన్ని అధ్యయనం చేద్దాం.
ప్రబోధము. మహాకవి: రాయప్రోలు సుబ్బారావు.
సీసం. అమరావతీపట్టణమున బౌద్ధులు విశ్వ
విద్యాలయములు స్థాపించునాడు, ఓరుగల్లున రాజవీరలాంఛనముగా
పలు శస్త్రశాలలు నిలుపునాడు,
విద్యానగర రాజవీధులన్ కవితకు
పెండ్లి పందిళ్ళు కప్పించునాడు,
పొట్నూరికి సమీపమున ఆంధ్రసామ్రాజ్య
దిగ్జయస్తంభ మెత్తించునాడు,
తేటగీతి. ఆంధ్రసంతతీ కేమహితాభిమాన
దివ్యదీక్షాముఖ స్ఫూర్తి తీవరించె,
ఆ మహావేశ మర్థించి యాంధ్రులార!
చల్లు డాంధ్ర లోకమున నక్షతలు నేడు.
ఇక్కడ, ఆచార్య రాయప్రోలు సుబ్బారావు గారు, నాలుగు ప్రాంతాలకీ గొప్ప గొప్ప ఉదాహరణలు ఇచ్చారు. అమరావతి, దక్షిణ కోస్తా. ఓరుగల్లు, తెలంగాణ. విద్యా నగరం, రాయలసీమ. పొట్నూరు ఉత్తరాంధ్ర.
అమరావతిలో బౌధ్ధుల విశ్వవిద్యాలయాలు, ప్రజలకు ఉపయోగపడినట్లుగా దాఖలాలేమీ లేవు. నాగార్జునుడి కాలం లో కొంత మేరకు చవక లోహాలను బంగారంగా మార్చే ఆల్ కెమీ (రసవాదం) అభివృధ్ధి చెంది ఉండవచ్చు. ఆవిశ్వ విద్యాలయాలను నిర్వహించటానికి, భిక్షువులను పోషించటానికి, రాజులు ప్రజలపై పన్నులు బాది ఉంటారు.
ఓరుగల్లు శస్త్రశాలలు తుగ్లక్ బానిస జునాఖాన్ ముందు ఎందుకూ పనికి రాలేదు. అంతేకాదు రెడ్డి దండనాధులు ,వెలమ దండనాధులు తన్నుకొని, రెండవ ప్రతాపరుద్రుడికి సహాయం చేయకపోటం వల్ల , జునాఖాన్ రెండవ ప్రతాపరుద్రుడిని బందీగా ఢిల్లీ తీసుకెళ్ళ గలిగాడు. రెండవ ప్రతాపరుద్రుడు దారిలో నర్మదానదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది.
ఇంక విద్యానగరం విషయానికి వస్తే, విజయనగర రాజుల కాలంలో, హంపీలో పన్నెండు వేలమంది దాకా వేశ్యలు ఉండేవారుట. వారినుండి రాబట్టిన సుంకాలతో సైనికుల జీతాల చెల్లింపుజరిగేదిట. కవితకు పెళ్లి పందిళ్లకు వరహాలను ఎక్కడినుండి తెచ్చే వాళ్ళో మనం ఊహించోకోవాలి.
పొట్నూరు జయస్తంభం కూడ, రాయల జైత్రయాత్రకు చిహ్నంగా వర్ణించు కోవచ్చు కానీ, ఆజైత్రయాత్రల వల్ల బహమనీలను కానీ, ఢిల్లీ సుల్తానులను గానీ ఎదుర్కున్నా రా అంటే , అదేమీ లేదు. రాజుల సైన్యాలు జైత్రయాత్రలకు వెళ్తూ ఉంటే దారి వెంట ఉండే పంట పొలాలు నాశనమౌతాయి తప్ప, ప్రజలకు ఒరిగింది ఏమీలేదు.
సీసం. తనగీతి అరవజాతిని గాయకులనుగా
దిద్ది వర్ధిల్లిన తెనుగువాణి,
తనపోటులు విరోధితండంబులకు సహిం
పనివిగా మెఱసిన తెనుగు కత్తి,
తన యందములు ప్రాంతజనుల కభిరుచివా
సన నేర్ప నలరిన తెనుగురేఖ,
తనవేణికలు వసుంధరను సస్యశ్యామ
లను జేయ జెలగిన తెనుగు భూమి,
తేటగీతి. అస్మదార్ద్రమనోవీధి నావహింప
జ్ఞప్తి కెలయించుచున్నాడ! చావలేదు
చావలే దాంధ్రజనమహోజ్జ్వల చరిత్ర
హృదయములు చీల్చి చదువుడో సదయులార!
మొదటి పాదం త్యాగరాజు, శ్యామశాస్త్రి, పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ వంటి వాగ్గేయకారులను ఉద్ధేశించింది. ఇది బాగానే ఉంది. రెండు,మూడు,నాలుగు పాదాలు, ఊకదంపుడు అనలేము కానీ, 'ఆంధ్రజనమహోజ్జ్వల చరిత్ర' లో అత్యున్నత ఘట్టాలని కూడా కీర్తించ లేము.
సీసం. కృష్ణాతరంగ పంక్తిన్ త్రొక్కి త్రుళ్ళింత
నాంధ్రనౌకలు నాట్యమాడునాడు,
ఇంటింట దేశిసాహిత్యదీపములతో
నాంధ్రతేజస్సు తీపారునాడు,
సుకుమార శిల్పవస్తు ప్రపంచమునందు
నాంధ్రనైపుణి పంతమాడునాడు,
సమర సేనావ్యూహ జయపతాకలక్రింద
నాంధ్ర పౌరుషము చెండాడునాడు,
తేటగీతి.
చూచి, సంతోషమున తలలూచి, గర్వ
మాచి ఆంధ్ర పుత్రీ పుత్రు లందగలరు
శాంతి, అందాక లేదు విశ్రాంతి మనకు;
కంకణ విసర్జనల కిది కాల మగునె?
ఈ ఆంధ్రనౌకలు నాట్యమాడటం, కొన్న పడవలను ఉద్దేశించిందే తప్ప వాటి సైజును అతిగా ఊహించటం కష్టం. పెద్దపెద్ద నౌకలు వచ్చే స్థాయిలో నీళ్ళు ఉండే జీవనది కృష్ణానది కాదు. దేశి సాహిత్యదీపాలు,ఊహించుకోటానికి సుందరంగా ఉన్నాయే తప్ప మనకెక్కడా దొరకవేమి? శిల్పనైపుణి విషయంలో మనం అగ్రగణ్యులమే అనే విషయంలో సందేహం లేదు. ఈ జయపతాకలు, ఆంధ్రపౌరుషము, తురుష్కులముందు, యూరోపియన్ల ముందు ఎందుకు పనికి రాకుండా పోయాయి?
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.