Wednesday, June 11, 2014

253 Madness cured, but please wind this pestle around my head!253 పిచ్చి కుదిరింది, రోకలి తలకు చుట్టండి. చర్చనీయాంశాలు: 253, Ganga River, Indian Rivers, Uma Bharti, Water Pollution, గంగానది


కొత్త బిచ్చగాడు ప్రొద్దెరగడు అని ఒక సామెత ఉంది. భవతీ భిక్షాందేహి అని అన్నం కొరకు భిక్షాటన కొరకు వెళ్ళే వాడు సమయ పాలన చేయాలి. వేళకాని వేళలో వెళ్తే అన్నం దొరకదు, సరికదా కొన్ని సార్లు తిట్లు తినాల్సి వస్తుంది.గంగానదిని శుధ్ధిచేయటానికి కంకణం కట్టుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు, ఆయన సహచర గంగా శుభ్రీకరణ మంత్రిణి ఉమాభారతి గారు, లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా ఉరుకుతున్నారు.

గంగానదిలో ఉమ్మి వేస్తే జైలు, జరిమాన శిక్షలు ఈ అతి ప్రమాదకరం కోవలోకి వస్తాయి. నదీ జలాల పవిత్రత యందు ప్రజలను విద్యావంతులను చేయవలసిన అవశ్యకత ఉంది. అలా చైతన్యవంతులైన ప్రజలు ఎవరూ బలవంతం చేయకుండానే ఉమ్మి వేయటం మానేస్తారు. మిగిలిన మొండి ఘటాలు, కావాలని చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, వారిని దిద్దటానికి జరీమానాలు, అరెస్టులు చేపట్టవచ్చు. ముందూ వెనుకా చూడకుండా, రూల్స్ ను జనం మీదికి రుద్దినపుడు ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు ఏ అమాయకుడో ఆ శిక్షకు బలి అవుతాడు.

గంగానదిని కలుషితం చేస్తున్న వాటిలో ఏమాత్రం లాభం చేకూర్చని, అత్యంత ప్రమాదకరమైన కాలుష్యకారకం, మునిసిపల్ కాలువలను నదిలోకి వదలటం. ఇది దాదాపుగా గంగానదియొక్క రెండువేల కిలోమీటర్ల ప్రవాహ మార్గమంతా జరుగుతుంది. మునిసిపాలిటీలకు, కార్పోరేషన్లకు, పంచాయితీలకు కూడ నదులు, ఉపనదులు తప్ప వేరొక దిక్కులేదు. ఈసమస్యకు ఏకైక పరిష్కారం ఏమిటంటే, నదులకు సమాంతరంగా, రకరకాల మురుగులను తమలో కలుపుకుని సముద్రం వరకు తీసుకుపోటానికి, లేక దారిలో ఉన్న ట్రీట్ మెంటు ప్లాంట్లలోకి వదలటానికి ప్రత్యేక కాలువలను త్రవ్వుకోవాలి. ఇది కొన్ని వందల కోట్లు ఖర్చైనా, ప్రజారోగ్యానికి, వాతావరణానికి, టూరిజానికి, ఇతర అవసరాలకు కలిగే లాభంతో పోలిస్తే ఖర్చు చాల తక్కువ క్రిందే లెక్క. ప్రస్తుతం పారిశ్రామిక వ్యర్ధాల విషయంలో, గంగానదిలోకి కాలుష్యం విడుదల చేసే పరిశ్రమలకి ఉన్న నిబంధన ఏమిటంటే వారు స్వంత ట్రీట్ మెంట్ ప్లాంటు లను నెలకొల్పుకొని, అలా ట్రీట్ అయిన జలాలనే నదులలోకి వదలాలి. దీనిని కాగితం మీదనైనా పాటించే పరిశ్రమలు ఎన్ని ఉన్నాయో ఎవరికీ తెలియదు.

ఇంకా ఉంది. ఇంకోసారి వ్రాస్తాను.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.