అవార్డులు, పటేల్, నేతాజీ
సర్దార్ పటేల్ , నేతాజీ, అంబేద్కర్ , ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, లాల్ బహదూర్ శాస్త్రి వంటి వారు మన జాతికి మార్గదర్శకులు. తమ కర్తవ్య నిర్వహణలో, జాతిసేవకు, తమజీవితాలను అంకితం చేసిన మహనీయులు. ఇట్టి మహనీయులు భారతరత్న గుర్తింపు పొందని వారనేకులు ఉన్నారు. భారతరత్న గుర్తింపును వారు పొందినా, పొందకపోయినా, జాతి వారిని మర్చిపోయినా, వారి ఔన్నత్యానికి భంగం కలుగదు.
క్రికెటర్లు కేవలం ఆటగాళ్ళు. వారికి ఖేల్ రత్న వంటి క్రీడలకు సంబంధించిన అవార్డులు ఉన్నాయి. అది కాక వారు తమ సేవలకు కోట్లు సంపాదించుకుంటున్నారు. ప్రజలలోకూడ తాము చేసిన సేవలకన్నా అధికంగానే ఆదరణనను పొందుతున్నారు.
సచీన్ టెండూల్కర్ భారతీయ క్రికెటర్ లు అందరిలోకీ గొప్పవాడా అంటే ప్రశ్నార్ధకమే. ఎన్ని సార్లు విఫలమౌతూ పోయినా, క్రికెట్ కంట్రోల్ బోర్డ్ , సచీన్ కి అవకాశాలు ఇచ్చుకుంటూ వెళ్ళింది. అందు వల్ల టెండూల్కర్ 200 టెస్టులను పూర్తి చేయటంలో ఘనత ఏమీ లేదు. సునీల్ గవాస్కర్ , సర్దేశాయ్, పోలీ ఉమ్రీఘర్, వాడేకర్, వంటి వారితో పోలిస్తే సచీన్ ఎదుర్కున్న బౌలర్లు అరివీర భయంకరులు కాదు. గవాస్కర్ కొట్టిన సెంచరీల్లో కొన్ని హెల్మెట్ ధరించకుండా, గాయాలకు భయపడకుండా చేసినవి ఉన్నాయి. విదేశాల్లో చేసినవి ఉన్నాయి. ఆకాలంలో రోజూ క్రికెట్ మాచ్ లు ఉండేవి కావు. అందువల్ల ఆటగాళ్ళకు ఎక్కువ మాచ్ లు ఆడే అవకాశాలు, ఎక్కువ సెంచరీలు చేసే అవకాశాలు దొరికేవి కావు.
గ్రౌండ్లు చిన్నవిగా ఉండి బౌండరీ లైన్లు కుంచించుకు పోవటం, పిచ్ లను బ్యాటింగ్ కు అనుకూలంగా తయారుచేయటం, మాచ్ ఫిక్సింగులు జరగటం వంటి పలుకారణాల వల్ల నేటి బ్యాట్స్ మెన్లు అధికసెంచరీలు చేయటం, భారీస్కోర్లను నమోదు చేయటం జరుగుతున్నది. టీం కొరకు కాకుండా వ్యక్తిగత రికార్డుల కొరకు ఆడే సంస్కృతి ప్రబలటం వల్ల హీరోలు సెంచరీలు చేస్తున్నారు, టీంలు జీరో లవుతున్నాయి.
సచీన్, గవాస్కర్, ద్రావిడ్, కపిల్, బేడీ, వంటి వారి మధ్య మెరిట్ లో స్వల్ప భేదమే ఉందని మనం గుర్తించక పోతే, ఘోరమైన అన్యాయాన్ని సహించిన వాళ్ళమౌతాం.
అంతే కాదు, ఫలానా వ్యక్తికి పద్మ అవార్డు వచ్చింది, కాబట్టి వాడు గొప్పవాడు అనుకునే స్థితి ఏర్పడినపుడు వ్యక్తి బిరుదుకు అలంకారం కావటంపోయి, బిరుదే అతనికి అలంకారం అవుతుంది. వీడికి ఈబిరుదు ఎందుకు ఎలా వచ్చిందా, అని వితర్కించుకునే పరిస్థితి రాకూడదు.
ఫలానా వ్యక్తికి పద్మ అవార్డు ఎందుకు రాలేదు, అని ప్రజలు బాధ పడాలే తప్ప వీళ్లకు ఈ బిరుదులు వచ్చాయంటే, వీళ్ళేదో ఇన్ ఫ్లూయన్స్ ఉన్న మహా పెద్ద మనుషులు అయి ఉంటారు లేక పైరవీ చేసుకొని ఉంటారు, అని సందేహించే స్థితి రాకూడదు.
వ్యవసాయం, లోహశిల్పి, దారుశిల్పి, వంటి నిర్మాణాత్మక వృత్తులను విస్మరించి, ఉత్పత్తి శూన్యం, వనరులను వృధా చేసే క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇవ్వటం అర్ధం లేదు. ఇచ్చిరిపో,
ఎన్నో క్రీడలను విస్మరించి క్రికెట్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వటం అర్ధం లేదు. ఇచ్చిరిపో,
ఎందరో గవాస్కర్ వంటి విశ్రాంత భీష్ములను విస్మరించి సచిన్ ను నెత్తిన పెట్టుకోటం వేలం వెర్రి అవుతుంది తప్ప వివేకం అవదు.

సచీన్ కి భారతరత్న ఇవ్వాలంటే, గవాస్కర్ కూ, సచీన్ పది రెట్లు ఎక్కువ మెరిట్ కలిగిన వాడవ్వాలి. వారిద్దరి మధ్య అంత తేడా లేదు కదా. సచిన్ గవాస్కర్ కన్నా గొప్ప క్రికెటర్ అనుకున్నా వారి గొప్పతనంలో అంతరం ఏది. గవాస్కర్ 10 అనుకుంటే, సచిన్ 11-12 దాటలేడు.
సర్దార్ పటేల్ , నేతాజీ, అంబేద్కర్ , ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, లాల్ బహదూర్ శాస్త్రి వంటి వారినీ, --- సచీన్ ను, లతామంగేష్కర్ ను ఒకే గాట కట్టేయటం అంటే సర్దార్ పటేల్ , నేతాజీ, అంబేద్కర్ , ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, లాల్ బహదూర్ శాస్త్రి లను అవమానించటమే.
కాబట్టి, తక్షణం, సర్దార్ పటేల్ , నేతాజీ, అంబేద్కర్ , ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, లాల్ బహదూర్ శాస్త్రి లకు ఇచ్చిన భారతరత్నలను రద్దుచేయాలి.
నిజమైన భారతరత్నాలకు ఏ అవార్డులు అవసరం లేదు.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.