Sunday, November 3, 2013

#039 పరిశుభ్రతా కార్యకర్తలకు నా అభినందనలు

#039 పరిశుభ్రతా కార్యకర్తలకు నా అభినందనలు

పురపాలక, నగరపాలక, పరిశుభ్రతా కార్యకర్తలకు నా అభినందనలు. దీపావళి సందర్భంగా మదించిన ఉన్నత మధ్యతరగతి వర్గాల, ధనికవర్గాల యువకులు, తగలేసి రోడ్లపై విసిరేసిన దీపావళి పటాఖాల చెత్తను ఊరి బయటకు తరలించటం ఎంతో క ష్టమైన పని. ఈ వర్కర్లలో పలువురు BPO పధ్ధతిలో గుత్తేదారుల వద్ద పని చేసే వారు. బ్రతుకుతెరువు అనచ్చు, జీతాలు తీసుకుంటున్నారుగా అనచ్చు, ఇంకేదైనా అనచ్చు, కానీ వాస్తవం ఏమిటంటే గుండెకాయ ఆగిపోతే మనుషులు ఎలా బ్రతకలేరో, పారిశుభ్రికులు లేకపోతే సమాజం బ్రతకలేదు.

ఈ ఏడాది ఎక్కువైన దరిద్రం ఏమిటంటే, చైనానుండి దిగుమతి అయిన టపాకాయలు.

నా బాల్యంలో గ్రామీణ పేదలం మేము పాడుకునే వాళ్ళం. "దిబ్బూ దిబ్బూ దీపావళి పండుగ, గొప్పోళ్ల డబ్బంతా దండుగ." అంటూ దివిటీలను తిప్పుకుంటూ గిరగరా తిరుగుతూ పాడేవాళ్ళం. బెజవాడ నుండి తెచ్చిన మతాబాలు, జిగేల్ విష్ణు చక్రాలను, ధనికుల పిల్లలు కాలుస్తూ ఉంటే పేద ప్రజల పిల్లలు దేబె ముఖం వేసుకు కూర్చోకుండా, ఈదివిటీలు ఉపయోగపడేవి. వీటిని తయారు చేయటానికి చైనాతో పని లేదు. నగరాలనుండి తేవలసినవి ఏమీ లేవు.

దివిటీల్లో రకాలు ఉన్నాయి. తయారీల్లో కూడ , రకరకాల పద్ధతులు ఉన్నాయి. ప్రాంతీయ భేదాలు ఉన్నాయి.

ఈ దివిటీ చక్రాలను తయారు చేసే ఒక పధ్ధతి.

పొలాల్లోకి, బీళ్ళల్లోకీ వెళ్ళి తుమ్మచెట్టు కాండాల బెరడును తెచ్చుకోవాలి. బాగా ఎండపెట్టి సగం సగం కాల్చి మసిబొగ్గులను సేకరించాలి. నూరి మెత్తని పొడి చేయాలి. సరియైన పాళ్ళలో సురేకారాన్ని కలిపి ఆ మిశ్రమాన్ని ఒక బట్టలో పొట్లం కట్టటం. ఒక తాటిమట్టను సగంవరకూ బద్దలుగా చీల్చి ఆ పొట్లం పెట్టి తాటిమట్ట చివర తాడుతో కట్టాలి. ఇలా తయారు చేసుకున్న దివిటీ చీకటి రాత్రులలో అందంగా వెలుగుతుంది.

దీపావళి రాత్రి, ఆ పొట్లానికి నిప్పంటించటం, ఆతాడుని చేత్తో పట్టుకొని గిరగిరా తిరుగుతూ పాడుతూ ఎగరటం, ఒక ఖర్చులేని పని.

గొప్పోళ్ల డబ్బంతా దండుగ అనే చరణంలో కొంత ఈర్ష్య ధ్వనిస్తుంది. గొప్పవాడు , తన డబ్బును తగలేస్తున్నాననే సృహ కలిగి ఉండడు. ఆసృహ ఉంటే కాల్చలేడు. పైగా కాల్చే వాడూ, సంపాదించే వాడూ ఒకడు కాడు. పుత్రరత్నాలు. తామే సంపాదించి తామే కాల్చాలంటే , పుత్రరత్నాలు కూడా ఒకింత వెనకాడతారు. కాల్చిన వాడే శుభ్రం చేయాలన్నా, కాల్చక ముందు ఒకటికి రెండు సార్లు వెనకాడతారు. అంతేకాదు, శుభ్రంచేయటానికి బధ్ధకించే ఇరుగుపొరుగు వాళ్లు , తమ తమ చెత్తలను పొరుగు వాళ్ళ ఇళ్ళ ముందుకు నెట్టేసే ప్రమాదం ఉంది. ఇప్పుడు పుర పాలక పారిశుభ్రికులు, తిట్టుకుంటూనైనా చాకిరీ చేస్తున్నారు కాబట్టి రోజులు గడుస్తున్నాయి. అందుకే పుర పాలక పారిశుభ్రికులకు మనం సర్వదా, శతథా, సహస్రథా, కృతజ్ఞులమై ఉండాలి.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.