శ్రీ వీ.వీ. లక్ష్మీనారాయణ, విశ్రాంత ఐపీఎస్ అధికారి గారు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీవారి నాలుగవ లిస్టు ప్రకారం, శ్రీవారు విశాఖపట్నం నుండి లోక్ సభకు పోటీచేస్తున్నారు. గతంలో నెట్ లో, పత్రికలలో వచ్చిన వార్తలను బట్టి శ్రీవారు స్వామీవివేకానందకు వీరాభిమాని. కొన్ని శ్రీరామకృష్ణ మఠ్ వారి కార్యక్రమాలలో కూడ శ్రీవారు ప్రసంగించటం కూడ జరిగింది. ప్రధాన మంత్రి శ్రీనరేంద్ర మోడీ గారు కూడ స్వామీ వివేకానందకు వీరాభిమాని కాబట్టి శ్రీలక్ష్మీనారాయణసార్ బిజెపిలో చేరతారని భావించటం జరిగింది. బిజెపీ వారు సార్ ని తమ పార్టీలోకి ఆహ్వానించినట్లుగా వార్తలు కూడ వచ్చాయి. కానీ సార్ బిజెపీ లో చేరలేదు. తదుపరి, సారే స్వంతంగా పార్టీ పెడతారని వార్తలు వచ్చాయి. అదీ జరగలేదు. తరువాత సార్ టీడీపీలో చేరతారని వార్తలు వచ్చాయి. కానీ సార్ టీడీపీలో చేరలేదు. ఈసందర్భంగా నా గాడిద బుద్ధి ఊరుకోదు కాబట్టి కొన్ని ఊహలను , ఆలోచనలను , విశ్లేషణలను వ్రాయటం తప్పుకాదనుకుంటాను. నాకు సార్ పై గానీ, శ్రీ పవన్ పై గానీ ప్రేమ గానీ, శతృత్వంగానీ లేదని స్పష్టం చేస్తున్నాను. అంతే కాక నా అభిప్రాయాలను పాఠకులపై ఉద్దేశ్యం నాకులేదని చెప్పక తప్పదు. ఒక వేళ నేను రుద్దాలనుకున్నా పాఠకులు రుద్దించుకోరు. కనుక, నేను ఇక్కడ వ్రాస్తున్నది ఒక్కింత విశాల హృదయంతో, లేక హాస్య దృష్టితో చదవండి.
సార్ బిజెపీలో ఎందుకు చేరలేదు?
జవాబు: బిజెపికి ఆంధ్ర ప్రదేశ్ లో ఠికాణా లేదు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు విజయ కాంక్ష ఎక్కువ. సార్, ట్రైచేస్తే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో బిజెపీ టికెట్ దొరికేదేమో, వారే ఆయనను యూపీలో గెలిపించి ఉండేవారేమో. ఒకవేళ యూపీలో ఓడిపోయినా, లేక టికెట్ దొరక్కపోయినా, శ్రీ వెంకయ్యనాయుడు గారిని, జీవీఎల్ గారినీ పంపినట్లు, బహుశా లక్ష్మీనారాయణ సార్ ను కూడ రాజ్యసభకు పంపే వాళ్ళేమో. బహుశా, కేంద్రంలో బిజెపీ మరల అధికారంలోకి రాకపోవచ్చని సార్ కు ఏమైనా ఇంటెలిజెన్స్ సమాచారం అందిందేమో తెలియదు. బిజెపీ కేంద్రంలో అధికారంలోకి రాకపోతే, తాను కలలు కన్నట్లుగా వ్యవసాయమంత్రి అయ్యే అవకాశం ఉండదు. అదేకాదు. సార్ కేంద్ర వ్యవసాయమంత్రి అవ్వాలనుకున్నారో లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మంత్రి అవాలనుకున్నారో తెలియదు.
ఆంధ్రప్రదేశ్ లో జనసేనకన్నా, టీడీపీకి విజయావకాశాలు బాగా ఉన్నాయి, ఈనాటికి నిజం. కానీ సార్ టీడీపీలో ఎందుకు చేరలేదు?
జవాబు- విశాఖనుండి టీడీపీ నుండి పోటీ చేస్తున్న గీతం విశ్వవిద్యాలయాధిపతి శ్రీ భరత్ ఆర్ధికంగా మహా బలశాలి. సార్ కోరిక విశాఖనుండి పోటీ చేయటమే అయితే శ్రీ చంద్రబాబునాయుడు గారు శ్రీభరత్ ను ప్రక్కన పెట్టాల్సి వస్తుంది. శ్రీ భరత్ గారు శ్రీచంద్రబాబు వియ్యంకుండైన శ్రీ బాలకృష్ణగారికి చిన్నల్లుడట. అట్లగుచో తన సామాజిక వర్గానికే చెందిన, తనబంధువర్గానికి చెందిన, డబ్బు కుమ్మరించంగల శ్రీ భరత్ ను శ్రీ చంద్రబాబు ఎందుకు వదులుకుంటారు? జరగని పని.
ఒకవేళ టీడీపీ టికెట్ లభించి, సార్ లోక్ సభకు ఎన్నికయ్యాక కేంద్రంలో శ్రీ మోడీ ప్రధానమంత్రి అయ్యి, రాష్ట్రంలో శ్రీచంద్రబాబు ముఖ్యమంత్రి అయితే, టీడీపీ ఎమ్ పీ లందరూ ఢిల్లీ లో గాంధీగారి బొమ్మముందో లేక జంతర్ మంతర్ దగ్గరో, రోజూ ధర్నా చేయాల్సి రావచ్చు. పైగా, తెలుగు దేశం నేతలపై ఐటీ దాడులు పెరగచ్చు.
ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, అమరావతిలో టీడీపీ ఓడిపోతే, జగన్ రాజ్యమే వస్తే , శ్రీలక్ష్మీనారాయణకు ప్రతికూల పరిస్థితులు వస్తాయి. కాబట్టి టీడీపీలో చేరటం ప్రమాదం. అంతేకాక, శ్రీలక్ష్మీనారాయణ టీడీపీలో చేరి ఉంటే ఆయన చంద్రబాబు తొత్తు , బాబుతో కుమ్మక్కయ్యాడు అనే ఆరోపణకి గురయ్యేవాడు. కనుకు టీడీపీలో చేరి ఉండక పోవచ్చు.
సార్ విశాఖనుండి గెలుస్తారా?
జవాబు- ఈప్రశ్నకు జవాబు, శ్రీ లక్ష్మీనారాయణ ఎన్ని కోట్లు ఖర్చుచేస్తారు అనేదానిపై ఆధారపడి ఉంటుంది. శ్రీ పవన్ కల్యాణ్ సినీహీరో జీవితానికి అలవాటు పడ్డవాడు. సినీహీరో లెపుడూ, తాము పదికోట్లు తీసుకున్నా, తమ ఖర్చులను నిర్మాతలపై తోయటానికి ఇష్టపడతారు. సినిమాలు ఫెయిలయినపుడు ఒకరిద్దరు హీరోలు, దర్శకులు తమ పారితోషికంలో కొంతభాగాన్ని నిర్మాతలకు, పంపిణీదారులకు వెనక్కి ఇచ్చి వారిని ఆదుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, శ్రీపవన్ కల్యాణ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ లో పల్టీ కొట్టినపుడు, ఆయన ఇలాంటి ఔదార్యాన్ని స్వల్పంగా అయినా చూపినట్లు కనపడదు. కనుక విశాఖపట్నం లోక్ సభ ఎన్నికలలో జనసేన పార్టీ శ్రీ లక్ష్మీనారాయణ ఖర్చులను భరిస్తుంది అని ఆశించటం పేరాశే అవుతుంది.
డబ్బులు ఖర్చు చేయని, లేక చేయలేని అభ్యర్ధులను ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు గెలిపించటం ఇరవై ఒకటో శతాబ్దంలో జరగటం మనం కనం వినం. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశంగారు తన చివరిరోజులలో మైలాపూర్ నుండి ఓడిపోటం బహుశా డబ్బు ఖర్చుచేయక పోటం వల్లే జరిగుండచ్చు. స్వర్గీయ వావిలాల గోపాలకృ,ష్ణయ్యగారు కూడ డబ్బులు అతి తక్కువ ఖర్చుచేసి నాలుగుసార్లు శాసనసభకు ఎన్నికైనా, పోలింగ్ బూతులలో కూర్చునే ఏజంట్లకు రోజు ఖర్చుకి రూ. 60 చొప్పున ఇవ్వలేక పోటీచేయటం మానేసారని నేను విన్నాను. కాబట్టి శ్రీలక్ష్మీనారాయణ గారు ఎంత ఖర్చు చేయబోతున్నారు?
పవన్ ముఖ్యమంత్రి అవుతే శ్రీ లక్ష్మీనారాయణ వ్యవసాయమంత్రి అవుతారా?
శ్రీ పవన్ ముఖ్యమంత్రి కావాలంటే, కర్నాటకలో శ్రీ కుమార స్వామికి లభించిన అవకాశం వంటిది రావాలి. అంటే, శ్రీ పవన్ గారు శ్రీచంద్రబాబు మద్ధతు పొందే పరిస్థితులు రావాలి. అంటే హంగ్ అసెంబ్లీ రావాలి. కర్నాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యాకే, శ్రీ పవన్ కు ముఖ్యమంత్రి అవ్వచ్చేమో అనే ఆశలు చిగురించాయి. ఒకవేళ పవన్ ముఖ్యమంత్రి కాకపోయినా, సంకీర్ణం ఏర్పడి, బాబు మంత్రివర్గంలోకి పవన్ చేరే అవకాశం వస్తే, ఆయన శ్రీ లక్ష్మీనారాయణను తనతో పాటు శ్రీ బాబు మంత్రి వర్గంలోకి వ్యవసాయమంత్రిగా చేరటానికి ప్రయత్నించ వచ్చు. అలాంటి ఉద్దేశ్యం ఉన్నావాడు అసెంబ్లీకి పోటీ చేస్తాడు కానీ లోక్ సభకు పోటీ చేయడు. జనసేనకు తగినన్ని లోక్ సభ సీట్లు వచ్చి, కేంద్రంలో హంగ్ ఏర్పడితే, శ్రీపవన్ బిజేపీ కిగానీ కాంగ్రెస్ కు గానీ మద్ధతిచ్చి సంకీర్ణ కేంద్ర మంత్రి వర్గంలో జనసేనకు చోటిస్తే, శ్రీ లక్షమీనారాయణ లోక్ సభకు గెలిచి ఉంటే, అపుడు కేంద్రంలో వ్యవసాయమంత్రి కావచ్చు.
స్వామీ వివేకానందా గారిలాగా యువతకు శిక్షణ ఇవ్వాలని, వందలాది మంది స్వామీ వివేకానందాలుగా తయారుచేయాలని కదా శ్రీవారి కోరిక. లోక్ సభకు ఎన్నికైతే అది నెరవేరుతుందా?
జవాబు- పదవిలేని వాడు చెప్పినా, పదవిలో ఉన్నవాడు చెప్పినా, నేటి యువకులు వినే పరిస్థితులు లేవు. మంచి సంగతులు చెప్తే అసలు వినరు. పదికోట్ల మంది తెలుగు జనాభాలో ఒక వందమంది అపర అభినవ వివేకానందాలు, రామకృష్ణ పరమహంసలు దొరకరా అనేది ఉంది. శ్రీరామకృష్ణ మఠాలలో, కాలేజీల్లో లక్ష్మీ నారాయణ సారు ఉపన్యాసాలు చేసి ఉన్నారు.
అసంపూర్తి. (ఇంకా ఉంది. ) త్వరలో పూర్తి చేస్తా. ఈలోగా పాఠకులు ఏవైనా ప్రశ్నలు అడగతలుచుకుంటే, కామెంట్లు వ్రాయచ్చు. y b h a s k at జీమెయిల్ డాట్ కామ్ కి ఈమెయిల్ చేయచ్చు. కానీ జవాబులు మాత్రం ఈబ్లాగ్ ద్వారానే ఉంటాయి. పాఠకుల మర్యాదకు భంగం కలగని విధంగానే జవాబులు ఉంటాయి.
ఒక వేళ జగన్ అతిపెద్ద పార్టీగా అవతరించి, పవన్ తోడ్పాటుతో మంత్రి వర్గం ఏర్పాటు చేయాల్సి వస్తే?
Ans: జగన్, చంద్రబాబులకు ఇరువురికీ తిమ్మిని బమ్మి చేసైనా ముఖ్యమంత్రి అవటమే లక్ష్యం కాబట్టి, జగన్ పవన్ ను అఱ్ధించి మద్దతు పొందటానికి వెనకాడడు. చంద్రబాబు మంత్రివర్గంలో సంకీర్ణుడు కావటానికి పవన్ ఇష్టపడచ్చు. ఇది టీడీపీ మెజారిటీ సాధించకుండా అతి పెద్ద పార్టీగా ఉవతరించినపుడే సాధ్యమవుతుంది. అపుడు పవన్ చంద్రబాబు (లేక లోకేష్) మంత్రివర్గం లో సంకీర్ణుడు కావచ్చు. జగనే అతిపెద్ద పార్టీగా అవతరిస్తే, అపుడుకూడ పవన్ జగన్ తో సంకీర్ణుడు కాకతప్పదు. ఎందుకంటే, కోట్లు ఖర్చు పెట్టిన ఎమ్ ఎల్ ఎలను అధికారంలేకుండా నీలుక్కొని కూర్చోమంటే ఎవరూ ఊరుకోరు. వారు ఎటో ఓక దిక్కుకు దూకక తప్పదు.
మరి జెడీ లక్ష్మీనారాయణ గారి పరిస్థితి ఏమవుతుంది?
జవాబు- కేంద్రంలో హంగు వచ్చి, పవన్ కు చక్రం తిప్పేటన్ని సీట్లు రావాలి, పైగా, శ్రీ లక్ష్మీనారాయణ సార్ విశాఖలో ఎమ్ పీ గా గెలవాలి. సుమతీ శతకం చదువుకుందాము.
పెట్టిన దినముల లోపల
నట్టడవులకైన వచ్చు నానార్ధములున్
పెట్టని దినముల లోపల
కనకపు గట్టెక్కిన నైన నేమి లేదు గదరా సుమతీ.
English Gist: When we are lucky enough, every thing will come to us, even if we are amidst deep forests. When we not lucky enough, there will be nothing even if we ascend a gold peak.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.