290 వొడల్ తిరమే ? చెప్పకు మిట్టి తుచ్ఛ సుఖముల్ మీసాలపైఁ దేనియల్
చర్చనీయాంశాలు: 290, పద్యకవిత్వం, పెద్దన, మనుచరిత్ర, రాహుల్ గాంధీ, ప్రియాంక
శ్రీమతి ప్రియాంక వధేరా గాంధీగారు, శ్రీ రాహుల్ గాంధీగారు అమేథీ ఎన్నికల ప్రచారంలో ఇటికరాళ్ళ గుట్టలపై దూకు కుంటూ వెళ్ళి వోటర్లతో మరీమరీ షేక్ హేండ్లిచ్చి, కౌగలించుకున్నంత పనిచేసి వాళ్ళచేత వోట్లు కొట్టించుకున్నారు.
ఇప్పుడు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు , శ్రీ రాహుల్ గాంధీ గారు ఏమి చేస్తున్నారు?
జవాబు: మొదట వచ్చిన వార్తల ప్రకారం వారు యూరప్ లో పర్యటిస్తున్నారు. యూరప్ అంటే సహజం గా తాతగారి, అమ్మమ్మ గారి ఊరైన ఇటలీ అయి ఉండచ్చు. లేదా తాము రహస్య నంబర్ల ఖాతాలో ఏమైనా డబ్బులు దాచుకొని ఉంటే, స్విట్జర్ ల్యాండ్, ఐలాండ్ ఆఫ్ మ్యాన్, లండన్ (కూడటాక్స్ హావెనే), లగ్జెంబర్గ్, కేమాన్ ఐలాండ్స్, బెర్మూడా, బ్రిటీష్ వర్జిన్ ఐలెండ్స్ ఇలా ఏవైనా కావచ్చు. సహజంగా అక్కడ కొంత కులాసాగా తిరగటానికి, తాగి పండుకోటానికి, వసతులు కూడా ఉంటాయి.
రియో డి జెనిరోలో వరల్డ్ కప్ ఫుట్ బాల్ ప్రారంభం అయినాక, వస్తున్న వార్తలను బట్టి, శ్రీరాహుల్ గాంధీ, శ్రీ రాబర్ట వధేరా కలిసి రియో డి జెనిరోలో జరుగుతున్న వరల్డ్ కప్ ఫుట్ బాల్ పోటీలను తిలకిస్తున్నారు. ఇంతవరకు ఫొటోలయితే బయటకు రాలేదు.
ఈరోజునుండి లోక్ సభ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అమేథీ నుండి ఎన్నికైన, శ్రీరాహుల్ గాంధీ లోక్ సభ బడ్జెట్ సమావేశం మొదటి రోజు సభకి హాజరు కా దలుచుకుంటే, ఇప్పటికల్లా భారత్ కు వెనక్కి వచ్చి ఉండాలి. కావాలంటే మరల వెళ్ళ వచ్చు.
బ్రెజిల్ లో కూడ నల్ల, ఎర్ర, తెల్ల, ఆకుపచ్చ డబ్బులు ఉన్నవాళ్ళకి, వాటిని విసిరేయటానికి సిధ్ధంగా ఉన్నవాళ్ళకి అందుతున్న సౌఖ్యాలకు కొదువ లేదు. అక్కడ వ్యభిచారిణులకు ఆంగ్లంలో ఎలా మాట్లాడి ధన దేశాలనుండి వచ్చే రసిక శేఖరులనెలా ఆకట్టుకోవాలో, ప్రత్యేకంగా శిక్షణా సంస్థలు ఏర్పడి హావభావ మందహాసాలలో , హోయలు మీరటంలో బాగా ట్రెయినింగు ఇచ్చాయిట. భారతీయ రసికశేఖరులకు ఏమైనా ప్రత్యేక ట్రీట్ మెంటు ఉంటుందా, లేక అక్కడ కూడ ముల్కీ రూల్సు ఏమైనా ప్రవేశ పెట్టారేమో తెలియదు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లనుండి ఎంతమంది ఫుట్ బాల్ చూడటానికి బ్రెజిల్ వెళ్ళారో మనకు తెలియదు. వారిలో ఎంతమంది రసికాగ్రేసరులో అసలే తెలియదు. తెలుసుకోవలసిన అవసరం ఉందా? అనేవాళ్ళు ఆలోచించాల్సిన అంశాలు రెండు ఉన్నాయి. భారతీయ రసికాగ్రేసరులలో ఎందరు కండోములను నమ్ముకుంటారో, ఎంతమంది దేవుడిని నమ్ముకుంటారో మనకి తెలియదు. ప్రవరుల్లాగా ఉండే వాళ్ళని మనం రసికాగ్రేసరులు అనలేం కాబట్టి, వెళ్ళిన వాళ్ళు ప్రవరులైనా కావాలి, రసికాగ్రేసరులైనా కావాలి, లేక బండరాళ్ళైనా కావాలి.
ఈనాటి పద్యం
ఆంధ్రకవితా పితామహ, అల్లసాని పెద్దనా మాత్యుడు. కావ్యం మను చరిత్ర.
సందర్భం: హిమాలయా పర్వతాలమీద, కాళ్ళకు రాసుకున్న పాదలేపనం కరిగిపోటంతో, ప్రవరుడు చిక్కుకొని దారీతెన్నూ లేక తిరుగుతున్న సందర్భంలో అతడికి వరూధిని అనే అప్సర తారసిల్లింది. వరూధిని ప్రవరుడిపై మోజుపడి అతడిని వశం చేసుకోవాలని చూసింది. పరిపరి విధాల నచ్చచెప్పటానికి ప్రయత్నించింది.
... అనుచుఁ దన్నొడఁ బఱచు నయ్యమరకాంత
తత్తఱముఁ జూచి, యాత్మ నతండు దనకు
సిగ్గు, వెగటును బొడమ, నిస్పృహతఁ దెలుపు
నొక్క చిఱునవ్వు నవ్వి యయ్యువిద కనియె.
(ప్రవరుడికి సిగ్గు, వెగటు కలిగాయి. నిసృహతో ఒక చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. అయ్యమరకాంత == ఆ అప్సర. త్రికసంధి. అయ్యువిద== ఆ కాంత. త్రిక సంధి. అల్లసాని వారికి (తిక్కనకు కూడ) త్రిక సంధులంటే మహా మక్కువ. )
"ఈ పాండిత్యము నీకుఁ దక్క మఱి యెందేఁ గంటిమే కామశా
స్త్రోపాధ్యాయినినా వచించెదవు మేలోహో ! త్రయీధర్మముల్
పాపంబుల్, రతిపుణ్యమంచు నిఁక నేలా తర్కముల్ ? మోక్షల
క్ష్మీ పథ్యాగమసూత్ర పంక్తి కివె పో మీ సంప్రదాయార్థముల్.
(ఈ పాండిత్యం నీకు తప్ప మరి ఎవరికైనా ఉన్నదా? కామ శాస్త్ర ఉపాధ్యాయిని లాగా మాట్లాడుతున్నావే. బహుశా ఈ త్రయీధర్మాలు ధర్మ, అర్ధ , కామాలు కావచ్చు. (వేరేవైనా కావచ్చు.) ఇవేమో పాపాలు, రతి మాత్రమే పుణ్యం అంటూ ఎందుకీ తర్కాలు? మోక్షలక్ష్మి కి దారి (పథం) చూపే మార్గాలే సంప్రదాయమైన ధర్మార్ధకామాలు.)
నాలుగిటినీ కలిపే చూడాలని కాబోలు భావం. ఈవిషయంలో మహాత్ములైన వ్యాఖ్యాతల గ్రంధాలను పరిశీలిస్తేగానీ వ్రాయలేము.
తరుణీ ! రేపును మాపు హవ్యముల చేతం దృప్తుఁడౌ వహ్ని స
త్కరుణా దృష్టి నొసంగు సౌఖ్యము లెఱుంగన్ శక్యమే నీకు ? నా
కరణుల్ దర్భలు నగ్నులుం బ్రియములైన ట్లన్యముల్గా, వొడల్
తిరమే ? చెప్పకు మిట్టి తుచ్ఛ సుఖముల్ మీసాలపైఁ దేనియల్"
(హవ్యాలంటే యజ్ఞగుండంలో వేసే సమిథలు, నేయి మొ||. హవ్యాలచేత తృప్తి పరచబడిన అగ్నిదేవుడు దయతో ఇచ్చే సుఖాలు తెలుసుకోటం నీకు సాధ్యమా? నాలాంటి వాళ్ళకి దర్భలు, అగ్నులు ప్రియమైనట్లుగా మిగిలినవి ఉండవు. శరీరం స్థిరమా? చెప్పకు!! ఇలాంటి తుఛ్ఛ సుఖాలు మీసాలమీద తేనెల లాటివి. మీసాలమీద పడ్డ తేనె బొట్లను ఎంతనాకినా పూర్తిసుఖము దొరకదు అని భావము కాబోలు.)
మాకు తెలిసింది మీకు తెలీదు, మీకు తెలిసింది మాకు తెలీదు, అనే అర్ధం కూడ ఉందేమో.
ప్రవరుడు తన తపః శక్తిని వినియోగించి తన స్వస్థలానికి వెళ్ళిపోయాడు.
వైబీరావు గాడిద అభిప్రాయం
రియో డి జెనిరోలో మీసాలమీద తేనెలు వెతుక్కునేవాళ్ళు వెనక్కి ఎప్పుడు వస్తారు అనేది పార్లమెంటు సమావేశాల హాజరు బట్టి తెలుస్తుంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.