249 కార్పోరేట్ హాస్పిటల్స్ ను సిఫార్సు చేయటం ఎంత వరకు సమంజసం?
చర్చనీయాంశాలు: సినీనటులు, హీరో కృష్ణ, విజయనిర్మల, హోమియోపతి, కార్పోరేట్ వైద్యశాలలు
నా పోస్టు నంబరు 078 కి ఇది కొనసాగింపు. అందులో మీకు హోమియో వైద్యానికి శాస్త్రీయత లేదనటానికి తార్కిక ఆధారాలను సమకూర్చాను.
21వ శతాబ్దం ప్రారంభం వరకు, హోమియో వైద్యం లోకి కార్పోరేటు వైద్యశాలలు పెద్దగా ప్రవేశించలేదు. హోమియోలో ఆధునిక డయాగ్నోస్టిక్ పధ్ధతులు (కాట్, ఎమ్ ఆర్ ఐ మొ||) వాడకూడదని నిషేధం లేనప్పటికి, సర్జరీలకు ప్రాధాన్యత అంతగా లేనప్పటికీ, హానిమాన్ సిధ్ధాంతాలను చిత్తశుధ్ధితో నమ్మేవారు, పెద్దగా వీటికి ప్రాధాన్యాన్ని ఇవ్వక పోటం గమనార్హం. అందువల్ల గతంలో హోమియో వైద్యం వాణిజ్య స్వార్ధాలకు గురికాకుండా చవకగా దొరికేది. కావలసిన వారు హోమియో మందు సీసాలను ఇంట్లో పెట్టుకుని చాల చవకగా, ఇంచుమించు ఉచితంగా వాడుకునేవారు. హోమియో లో ఔషధ పదార్ధం లేకపోవటం వల్ల కేవలం ఫెయిత్ క్యూర్ లేక ప్లాసిబో (విశ్వాసం లేక నమ్మకం శరీరం లోని స్రావాలపై ప్రభావాన్ని చూపినపుడు, కనీసం కొన్నిరకాల సాధారణ వ్యాధులను నయం చేసే అవకాశం ఉండేది) సహాయంతో కొండంత ఆశలతో జీవితాలను నెట్టుకొచ్చేవాళ్ళు.
ఇపుడు హోమియో లోకి కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రవేశించాయి. కార్పోరేట్ వైద్యంలో ఉండే అన్ని రకాల హడావుడులు హోమియో కార్పోరేట్ వైద్యం లోకి కూడ వచ్చాయి. ఇంత వరకు చౌకగా ఉండే హోమియో వైద్యం - గృహ వైద్యం స్థాయి నుండి శాస్త్రీయ వైద్యం స్థాయికి ఎదగలేదు గానీ, ఖరీదైన వైద్యంగా మారింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఎల్లోపతి కార్పోరేట్ వైద్యం ఖర్చులను, హోమియోపతి కార్పోరేట్ వైద్యం ఖర్చులను పోల్చి, చూడండి హోమియో ఎంత చవకయో అనటం కాదు. ఔషధం అతిగా పల్చబర్చబడిన హోమియో బిళ్ళలు | గుళ్ళలో కేవలం పంచదార, ఆల్కాహాల్ లేక పాల పంచదార తప్ప వేరేవి లేనప్పడు, ఆవైద్యంలో మనం చెల్లించే బిల్లులకు వి ఎఫ్ ఎం (వ్యాల్యు ఫర్ మనీ చేసే ఖర్చుకు మాచింగ్ విలువ) ఏది?
నిపుణుల శ్రమ, నైపుణ్యం ఉంది కదా
ఔషధ పదార్ధమే లేనప్పుడు నైపుణ్యం దేనికి , నెత్తిన కొట్టుకోటానికా. నిజంగా నిపుణుడైన వాడు, ఆవైద్య శాస్త్రాన్ని ఐదైళ్లో ఏడేళ్ళో చదివేటపుడు ఒక రోజైనా, ఇది శాస్త్రీయమా అని ఆలోచించడా? వేలో లక్షలో ఫీజు కట్టి కోర్సులో చేరాం, ఏళ్ళతరబడి హాస్టళ్ళలో ఉన్నాం కాబట్టి, ఈ చీకటి సొరంగంలో ముందుకు వెళ్ళటమే కాని వెనక్కిరావటం లేదు అని అనుకునే పరిస్థితి వచ్చిందా?
నిపుణులు మనకొరకు సమయాన్ని వెచ్చించి మన శరీర తత్వానికి తగ్గ మందును మనకి ఇస్తున్నారు కదా అనే వాదన ఉంది. మందే లేని, కేవలం ఆల్కాహాల్ చల్లిన పంచదార గుళ్ళు | పాల పంచదార బిళ్ళలు | ద్రవాలు వాడేటపుడు వాటిని నిపుణుడు ఇస్తేనేం, నిపుణుడు కానివాడు ఇస్తేనేం. బెల్లడోనా అనే హోమియో మందును మనం వాడుతున్నామంటే, అందులో నిజంగా బెల్లడోనా ఉండాలి. అపుడు ఆమందుని ఇచ్చిన వాడు నిపుణుడా, కా డా అనే ప్రశ్న వస్తుంది.
హోమియో వైద్యం నిరపాయకరం అంటారు, నిజమేనా?
కొన్ని రకాల వ్యాధులకు మందు ఉండదు. మందు వాడినా ప్రయోజనం ఉండదు. కొన్నిరకాల ఎలోపతి మందులను వాడినపుడు సీరియస్ ప్రాణాంతక సైడ్ ఇఫెక్ట్స్, కొత్త సమస్యలు వస్తాయి అనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేసినపుడు పేషెంట్లకు, వైద్యులకు కూడ కేవలం వెయిటింగ్ మాత్రమే మిగులుతుంది. ఇలాటపుడు ఏ మందూ వాడనపుడు, శరీరంలో అప్పటికే నెలకొని ఉన్న వ్యాధి తీవ్రతను బట్టి, ఉత్తేజితమయిన,అవుతున్న తెల్ల రక్తకణాలు మొ|| వ్యాధి నిరోధక శరీర ప్రక్రియలను బట్టి, శరీర పరిస్థితి మెరుగు పడటమో, దిగజారిపోటమో జరుగుతుంది.
మరల మరల వ్రాయాల్సిన విషయం: హోమియో మందులను వాడటం, ఏమందులను వాడక పోటంతో సమానం
హోమియో మందులను వాడటం, ఏమందులను వాడక పోటంతో సమానం కాబట్టి, శరీరంలో అప్పటికే నెలకొని ఉన్న వ్యాధి తీవ్రతను బట్టి, ఉత్తేజితమయిన,అవుతున్న తెల్ల రక్తకణాలు మొ|| వ్యాధి నిరోధక శరీర ప్రక్రియలను బట్టి, శరీర పరిస్థితి మెరుగు పడటమో, దిగజారిపోటమో జరుగుతుంది.
ఇంకా, బీ కామెర్ల వంటి కొన్ని రకాల వ్యాధులు మందు వాడినా వాడక పోయినా నిశ్చిత సమయం తరువాత తగ్గి పోతాయి. ఇలాంటి వ్యాధులకు, హోమియో లో ఔషధ పదార్ధం ఉండదు కాబట్టి, మనం హోమియో వాడుతున్నప్పుడు నిర్ణీత రోజుల తరువాత వ్యాధి నివారణ అవుతుంది. హోమియో నిరపాయకరమైనది అనే భ్రమకు గురియవుతాము.
నిజంగా మందులను వాడాల్సిన తీవ్ర పరిస్థితులలో, మనం ఔషధ పదార్ధం ఉన్న ఏదో ఒక వైద్యవిధానానికి సంబంధించిన మందులను వాడకుండా, హోమియో మందులను వాడుతూ కూర్చుంటే ఏమి జరుగుతుంది.
ఈ వార్త ప్రచురించ బడిన ది హిందూ పత్రిక కు వెళ్లటానికి క్లిక్. http://www.thehindu.com/2009/09/29/stories/2009092956201800.htm
నా హోమియోపతి ఇంగ్లీష్ బ్లాగ్ కి వెళ్ళటానికి క్లిక్: http://homoeopathyyb.blogspot.in/search/label/006
హోమియో మందులను వాడటం, ఏమందూ వాడకపోటంతో సమానం కాబట్టి, రోగి మరణించే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాలో జరిగిందిది. భార్యా భర్త ఇద్దరూ భారతీయులే.
పిల్లవాడు ఎగ్జీమాతో (ఒక రకం చర్మ వ్యాధి, దురద) బాధపడుతున్నాడు.
తండ్రి (థామస్ శామ్) పిల్లవాడికి హోమియో వైద్యం చేశాడు. తల్లి మంజు భర్తకు సహకరించింది.
వ్యాధి ముదిరినా తల్లిదండ్రులు తమ వైద్యవిధానాన్ని మార్చుకుని ఆధునిక వైద్యుని సంప్రదించలేదు. మొండిగా హోమియో మందులనే కొనసాగించారు.
తరువాత తండ్రి ప్రకృతి వైద్యులను సంప్రదించాడు. ఈలోగా బాలుడు నల్లని జుట్టు తెల్లనిదిగా మారింది.
అశ్రధ్ధ వల్ల పిల్లవాడి ఇన్ ఫెక్షన్ రక్తంలోకి ప్రవేశించింది. అపుడు ఆధునిక వైద్యశాలకు తీసుకు వెళ్ళారు. ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్ ఇచ్చినా ఫలితం దక్కలేదు.
ఫలితంగా పిల్లవాడు మరణించాడు.
ఆస్ట్రేలియా న్యాయస్థానం తండ్రికి ఆరేళ్ళు, తల్లికి నాలుగేళ్ళు జైలుశిక్షవిధించింది.
ఈ సందర్భంగా న్యాయమూర్తి ఇలా వ్యాఖ్యానించారు:
"THOMAS SAM WAS ARROGANT IN HIS APPROACH OF TREATMENT AND PREFERRED HOMOEOPATHY AND HIS WIFE MANJU DEFERRED TO HER HUSBAND WHICH UNFORTUNATELY LED TO (THE) CHILD'S DEATH.
తెలుగు సారం: థామస్ శామ్ తన చికిత్సాపధ్ధతిపై అహంకార ధోరణితో ఉన్నాడు. హోమియోపతిని ఎన్నుకున్నాడు. భార్య మంజు అతడికి సహకరించింది. అది దురదృష్టవశాత్తు బాలుడి మృతికి దారితీసింది.
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
భారత్ లో, మరియు ఆస్ట్రేలియాలో సామాజిక, న్యాయ, ఆర్ధిక, స్థితిగతులు వేరు. కనుక ఆస్ట్రేలియన్ కేసును భారత్ కు వర్తించలేము. అదే సమయంలో ఈకేసునుండి మనం నేర్చుకోవలసిన నీతి ఉంది.
తెలివిగల వాళ్ళు ఈ నీతిని ఇప్పటికే నేర్చేసుకున్నారు. అమాయకులే హోమియోను పట్టుకొని, వేలాడుతున్నారు. మాగుంటూరులోనే కొన్నేళ్ళ క్రితం ఒక అర్హత కలిగిన ఎలోపతి వైద్యుడు హోమియో లోకి మారి పత్రికలలో వ్యాసాలు వగైరాలు వ్రాసి హోమియో వైద్యుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఒక మాదిరిగా డబ్బు కూడ సంపాదించాడు. తరువాత హార్టు ఎటాక్ వచ్చినట్లుంది. ఎలోపతి కార్పోరేట్ హాస్పిటల్ లో చేరి ఆధునిక చికిత్స తీసుకున్నాడు. బ్రతక లేదనుకోండి. ఈ బ్రతకటం, బ్రతకపోటం అనేది ఎన్నో ఫ్యాక్టర్స్ (ప్రభావితం చేసే కారణాలు, వాటి వెయిటేజి) పై ఆధారపడి ఉంటుంది. మనం హార్డ్ అండ్ ఫాస్టు వ్యాల్యూ జడ్జిమెంట్స్ చేయలేం.
ప్రపంచంలో మాదిరిగానే, భారత్ లో, భారతదేశంలో లాగానే తెలుగు గడ్డ పైనా కూడ, సినీ స్టార్లు, క్రికెటర్లు, స్వాములవార్లు , వాస్తు నిపుణులు, జ్యోతిష్కులు మొ\\ వారి మెడకాయలు,తలకాయలు వెనకాల హాలోలు ఉంటాయి. హాలోలు అంటే చంద్రబింబం లాంటి గుండ్రటి లైటింగు. పూర్వం దేవుళ్ళ చిత్రాల వెనకాల మాత్రమే ఇటువంటి హాలోలు ఉండేవి. రైతులు, కూలీలు, సేల్స్ మెన్ లు, గుమాస్తాలు, దారుశిల్పులు (కార్పెంటర్లు), లోహశిల్పులు (కమ్మరులు, వెల్డర్లు) మొ\\ సకల సాధారణ మానవుల కన్నా, హేలో ఉన్న వృత్తుల వారు శ్రేష్ఠుల క్రింద లెక్క. వారు ఏ వస్తువును సిఫారస్ చేస్తే మనం ఆవస్తువులను ఎంత రేటు పెట్టైనా, ఇంటర్నెట్లో కొనేస్తాం.
ఇపుడు మనం అల్లూరి సీతారామరాజు గారి అవతారంగా భావించే, శ్రీ సూపర్ స్టార్ క్రిష్ణగారు. ప్రపంచం లోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళామణిగా ప్రఖ్యాతి గాంచిన శ్రీమతి విజయనిర్మల దంపతులు ఒక హోమియో కార్పోరేట్ వైద్యశాలను ఎండార్స్ చేయటం గమనార్హం. అలా ఎండార్సు చేసినందుకు వారు ఆ సదరు కార్పోరేట్ వైద్యశాలనుండి ఎన్నికోట్లు తీసుకున్నారో, మనకు తెలియదు, తెలియబోదు.
ప్రాడక్టులను ఎండార్స్ చేసే సెలబ్రిటీలు కేవలంతాము వాడే వాటినే ఎండార్స్ చేయాలని మనం ఆశించటం ఆచరణలో కుదరదు. ఎండార్స్ చేసే ముందు, ఆ ప్రాడక్ట్స్ మరియు సేవల విశ్వసనీయతలపై సత్యాన్వేషణ చేసే ఓపిక, తీరిక, కోరిక, మన శ్రేష్ఠులనుండి ఆశించటం, దురాశ అవుతుంది.
మన జాగ్రత్తలో మనం ఉండాలి, అని మాత్రమే వ్రాసుకోవచ్చు.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.