234 తెలంగాణ మరియు శేషాంధ్రలో మ్యునిసిపల్ మరియు పంచాయత్ రాజ్ ఎన్నికల ఫలితాలు
చర్చనీయాంశాలు: మునిసిపాలిటీలు, పంచాయతీలు, జిల్లాపరిషత్ లు, బూర్జువా పార్టీలు, మన్మోహన్ సింగ్
2014 తెలంగాణ, సీమాంధ్ర, పురపాలక, పంచాయత్ రాజ్ (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికల ఫలితాల గురించి మనం పెద్దగా ఆలోచించ వలసిన పనిలేదు. టీడీపీ అయినా, వైఎస్ ఆర్ పీ అయినా , కాంగ్రెస్ అయినా , తెరాస అయినా ఇంకోళ్ళయినా ఇంకోళ్ళయినా, అన్నీ బూర్జువా పార్టీలే కనుక ఆనందించాల్సిందీ, చింతించాల్సిందీ ఏమీ లేదు.
గ్రామాల్లో పేదలతో దగ్గరగా పని చేసిన నా ఆచరణాత్మక అనుభవంలో నేర్చుకున్న ఒక పాఠం ఏమిటంటే, కార్ల్ మార్క్స్ ఏమి చెప్పినప్పటికీ, భారత్ కి సంబంధించినంత వరకు, కనీసం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి నంత వరకు, ఎవరు బూర్జువాలు, ఎవరు పెటీ బూర్జువాలూ, వంటి వాటికి సరి యైన నిర్వచనాలు లేవు.
గ్రామీణ పేదల కోణం లోంచి చూస్తే, ప్రతి గ్రామ పెత్తందారూ బూర్జువా నే , లేదా కనీసం పెటీ బూర్జువానే.
అదే గ్రామ పెత్తందారు, నగరంలోనికి వచ్చినప్పుడు అతడికి ఉన్న జాయిదాద్ (ఆస్తి), అతడికి ఉన్న ఆమ్ దానీ, ఇవి అన్నీ నగర బూర్జువాల ముందు, నగర పెట్టుబడి దారుల ముందు బలాదూర్. ఆ గ్రామీణ పెత్తందారు తాను ఒక పిగ్మీ అని తెలుసుకోటానికి నగరంలో బడా పెట్టుబడిదారు ఇంటి ముందు నిలబడి పైకీ కిందకీ ఒకసారి చూస్తే చాలు, పది నిమిషాలలో అర్ధం అవుతుంది.
మనం గ్రామీణ పేదరికాన్ని అర్ధం చేసుకోవాలంటే, గ్రామీణ ప్రాంతాలనుండి సంపద పట్టణ ప్రాంతాలకు ఎందుకు తరలి పోతుందో అర్ధం చేసుకోవాలి. పట్టణ తయారీల, సేవల ఉత్పత్తి ఖర్చు ఎక్కువ, కనుక అమ్మకం ధరలు కూడ ఎక్కువ. గ్రామీణ తయారీల, సేవల, ఉత్పత్తి ఖర్చు ఎక్కువే అయినా, అమ్మకం ధరలను వారు పట్టణ వాసులపై, నగర వాసులపై వేగంగా పెంచలేక పోతున్నారు. కనుక గ్రామీణ తయారీలు, సేవలు గిట్టుబాటు ధరలు పొందక, గ్రామీణ దారిద్ర్యానికి దారి తీస్తున్నాయి.
దీనికి ఏకైక పరిష్కారం, గ్రామీణులు పట్టణ, నగర తయారీలను, సేవలను కొనటం మానేయాలి. ఇది సాధ్యమా? జవాబు: కొంత మేరకు సాధ్యమే. అయితే ఇది గ్రామీణ పెత్తందార్ల ఆధిపత్యంతో సాధ్యం కాదు. గ్రామీణ కూలీలు , మార్జినల్ రైతులు (అటు రైతూ కాదు, ఇటు కూలీ కాదు, మార్జిన్ లో వ్రేలాడుతూ ఉంటాడు), బక్కరైతులు (ఇతడు రైతని పేరే కానీ, వ్యవసాయాన్ని తన టరమ్స్ లో నిర్వహించలేడు, ఏట్లో పడి కొట్టుకు పోయే చిన్న పిన్నీసు బుట్ట పడవ లాంటి వాడు) అందరూ కలసి ఎంతో వివేచనతో ఆలోచించుకొని నిర్వహించుకోవాలి.
ఇంకో సారి వ్రాస్తాను.
మన్మోహన్ సింగు వీడ్కోలు
పదేళ్ల సేవ తరువాత ప్రధాని శ్రీ మన్మోహన్ సింగు గారు తమ పీఎంవో కు వీడ్కోలు చెప్పుకున్నారు. యుపిఏ గెలిచినా, ఆయనకు ప్రధాని అవకాశాలు మృగ్యం కావటంతో, కాలువ దగ్గరికి వచ్చినపుడు దానిని ఎలా దాటాలో నిర్ణయించుకోవాలని ఆయన ప్రకటించుకున్న ఆశయం నెరవేరలేదు. అసలు కాలువ దగ్గరికి చేరాక దానిని ఎలా దాటాలో నిర్ణయించుకోవాలనే ఆయన ఉద్దేశ్యం హ్రస్వ దృష్టితో కూడినది. అది బహుశా వరదల సమయంలో వర్తించ వచ్చు. దీనిని లాజిస్టిక్సు అనే కోణంలోంచి పరిశీలించాలి. లారీడ్రైవర్లను, లారీ సర్వీసుల నిర్వాహకులను అడిగితే చక్కగా వివరిస్తారు.
ఉదాహరణకి పాండిచ్చేరి నుండి కోల్ కత్తాకు టాంకర్లో ఏ ఫార్మల్ డీ హైడో రవాణా చేయాల్సి వచ్చినపుడు కనీసం క్లీనర్ గా ఒక్కసారైనా ఆరూటులో వెళ్ళి ఉండని డ్రైవర్ కి ఆరూటును అప్పగించరు. జాతీయరహదారి కాబట్టి భారీగా ధాబాలుంటాయి, అధిక సంఖ్యలలో లారీలు నిలిచిపోతుంటాయి కాబట్టి వరదలతో కూడిన కాలువలు ఎదురైనప్పుడు ఒక తరహా సమష్ఠి నిర్ణయాలు జరుగుతాయి.
అదే వినుకొండనుండి కర్నూలుకి కందిపప్పు లేక పత్తి తీసుకెళ్ళాల్సి వస్తే కొన్ని కల్వర్టులు, కాజ్ వేల దగ్గర ట్రాఫిక్కూ ఉండదు, ధాబాలూ ఉండవు. వాగు మధ్యలోకి వెళ్ళాక , ప్రవాహ ఉధృతికి లారీ ముందుకు పోదూ, వెనక్కీపోదు. స్టీరింగు కొంచెం పట్టుతప్పినా, లారీ ప్రవాహంలో కొట్టుకు పోతుంది. అంటే NH 5 పై లారీ నడపటానికీ, గుంటూరు కర్నూలు రహదారి లో లారీ నడపటానికీ చాలా తేడా ఉంది. జాతీయరహదారిపై నడిపేవాడికి తానే నిర్ణయం తీసుకుని వాగులో కొట్టుకుపోయే ఛాన్సులు రావు. వినుకొండ నుండి నంద్యాల పోయేవాడికి వస్తుంది.
నాకు మన్మోహన్ సింగు గారి ఆర్ధిక విధానాలను చూస్తుంటే చాల వ్యధ కలుగుతుంది. విదేశీ పెట్టుబడులు అనే గుండ్లకమ్మలాంటి వాగులో ఆయన భారతీయ ఆర్ధిక వ్యవస్థను దించారు.
మధ్యలో ఆయన స్టీరింగు వదిలేసినా, ఇతరులు ఆయన దగ్గరనుండి స్టీరింగును గుంజుకున్నా పరిస్థితులలో మార్పేమీ ఉండదు. రాబోయే పరిస్థితులను సరిగా అంచనా వేసుకోటం, లారీడ్రైవరుకి అంచనా వేసుకోటం ఎంత అవసరమో , అంతకన్నా ఎక్కువ అవసరం దేశాన్ని డ్రైవింగు చేసే ప్రధాన మంత్రికి ఉంటుంది.
ఈనైపుణ్యం నరేంద్రమోడీకీ లేదనుకోండి. అందుకే ఆయన విదేశీ పెట్టుబడులు అని ఊగుతున్నాడు. విదేశీ రిటైలుకు అభ్యంతరం కూడ ఏమిటంటే, ఆయనకు దానిలోని రిస్కులు అర్ధమయ్యికాదు, ఆయన పార్టీ సమర్ధకులైన మధ్య శ్రేణి వర్తకులకు అభ్యంతర కరమైనందుకు.
భారతీయ ఆర్ధిక వ్యవస్థకు వీరందరు కలిసి చేస్తున్న అపకారం ఆనాడు అంభి, జయచంద్రుడు, మహమ్మద్ జాఫర్, మహమ్మద్ ఖాసిం మొ|| వారు చేసిన కీడు కన్నా తక్కువ కాదని భారతీయ ప్రజలు అర్ధం చేసుకోలేక పోతే ఎవరి తప్పు?
ఈనాటి కంద పద్యం
మంత్రిగలవాని రాజ్యము
తంత్రము సెడకుండ నిలుచు తరచుగ ధరలో
మంత్రి విహీనుని రాజ్యము
జంత్రపు కీలూడినట్లు జరుగదు సుమతీ!
లారీలు, కార్లు, బైకులు నడిపే వాళ్ళకి బాగా అనుభవం. ఒక స్క్రూ కీలక ప్రదేశంలో ఊడినా కోట్లు చేసే ఆడీ కారైనా, బెంజికారైనా సరే మొరాయిస్తుంది. ఎయిర్ బస్ 380 అయితే నేలకూలుతుంది. జంత్రపు కీలూడటం అంటే అది.
ఈ మంత్రి అనేవాడు కేవలం నిమిత్త మాత్రుడు, దీర్ఘసూత్రుడూ కారాదు. ప్రాప్త కాలజ్ఞత్వం అవసరమే అయినా దీర్ఘదర్శిత్వానికి సాటిరాదు.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.