చర్చాంశాలు: వ్యవసాయం, విద్యుత్ , న్యాయం
ఈరోజు వార్తల్లో అతిముఖ్యమైనది కృష్ణా జలాల పంపకంపై బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు. రాష్ట్రంపెట్టుకున్న ఆశలన్నీ అడియాసలైనాయి అన్నమాట నిజమే. రాష్ట్రప్రభుత్వం ఎలాగో సుప్రీం కోర్టుకు వెళ్తుంది. మరల కొన్ని నెలలు లేక కొన్నేళ్ళు మనం ఊపిరి బిగపట్టుకొని ఎదురు చూడాలి. అది గంటకు లక్షల్లో ఫీజులు తీసుకునే సుప్రీంకోర్టు న్యాయవాదులు , సూటూబూటూ వేసుకునే న్యాయమూర్తులూ తేల్చాల్సిన విషయం. ఇప్పుడు మనం ఇక్కడ ఆపంపకంలో వాటాలను చర్చించి ప్రయోజనం లేదు.
ముఖ్యకారణం
ట్రిబ్యునళ్ళు, కోర్టులు, ఎన్ని పంపకాలు చేసినా, ఎన్ని తీర్పులు ఇచ్చినా, ఎగువరాష్ట్రాలు, అతిస్వార్ధంతో అన్ని తీర్పులను బండకేసి కొట్తే ఆపగలవాళ్ళవరూ లేరు. తీర్పులను అమలు చేయాలి, దిగువరాష్ట్రాలకు న్యాయం చేయాలి అనే కోరిక, అమలుచేసే శక్తి కేంద్రానికి లేనంతకాలం, మొత్తం ఊకదంపుడు గానే మిగులుతుంది. భారీ వరదలు వచ్చినప్పడే జూరాలకు నీళ్ళు వస్తాయి. తెలంగాణ ప్రజలు ఆవురు ఆవురు అంటూ ఉంటారు కాబట్టి జూరాల సమీప లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు , కొంతమేరకు శ్రీశైలం ఎడమకుడి కాలువలు వాటిని వాడేసుకుంటాయి.
విజయవాడపై ఆంగ్లేయులు బ్యారేజీ నిర్మించిన కాలంలో , తరువాత మనం నాగార్జునసాగర్ నిర్మించుకున్నకాలంలో ఎగువలో నీటి వినియోగం లేదు. కర్నాటకలోని పీఠభూమి ప్రాంతాలు, తెలంగాణలోని పీఠభూమి ప్రాంతాలు బాగా ఎత్తులో ఉండి, నది పల్లంలో ప్రవహించటం వల్ల అక్కడ నీటి పారుదల ప్రాజెక్టులను నిర్మించటం సాధ్యం కాలేదు. ఇప్పుడు సాంకేతికతి బాగా అభివృధ్ధి చెందింది. ఎన్ని కోట్ల లీటర్ల నీటినైనా తోడిపోసే మోటార్లు వచ్చాయి. ఎన్నికిలోమీటర్ల సొరంగాలనైనా త్రవ్వి తీసే డ్రిల్లింగ్ యంత్రాలు వచ్చాయి. నీళ్ళు దిగువకు పొర్లిపోతూ ఉంటే, తమపొలాలు ఎండి పోతూ ఉంటే ఏరైతు చూస్తూ ఊరుకుంటాడు? అంతదూరం ఎందుకు, మనసాగర్ కెనాల్ సమీప రైతులు, కృష్ణా డెల్టాకాలువల రైతులు, రాత్రిపూట కాలువలకు మోటార్లు పెట్టి నీళ్ళు తోడుకొని ఎంతదూరమైనా నీటిని తీసుకువెళ్ళి అవసరానికి మించి తమ మాగాణీలను ముంచెత్తరా? లస్కర్లకూ, ఇంజనీర్లకు లంచాలు ఇస్తే వారే దారులు చెప్పరా? కాలువల టెయిల్ ఎండ్ లో ఉన్న గ్రామాల రైతుల గోడు ఎవరైనా ఆలకిస్తున్నారా?
వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని సీమాంధ్ర ప్రజలు కృష్ణాజలాలపై ఆశలు వదలుకోటమే మేలు. అలాగని ఏడుస్తూ కూర్చోనవసరం లేదు. సాంకేతికత మనకు దారి చూపిస్తుంది. కొద్ది రోజుల క్రితం గల్ఫ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ డుబాయ్ లో జరిగింది. రోజుకు 20 మిలియన్ లీటర్ల సముద్ర జలాలను శుధ్ధం చేయటం, 20 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయటం, సాకారం చేసుకున్నారు. ఇది ఏమాత్రం కాలష్యం, పూడికలు, పర్యావరణం సమస్యలు లేకుండా. ఈసముద్రజల శుధ్ధి కర్మాగారం సూర్యశక్తితో నడుస్తుంది. మనకు సూర్యశక్తికూడా కరువు లేదు. ముఖ్యంగా ఎండా కాలంలో అహో! అద్భుతం.
అదృష్ట వశాత్తు, సీమాంధ్రకు అద్భుతమైన తీరరేఖ ఉన్నది. ఎంత తోడుకున్నా తరగని బంగాళాఖాతం జలాలున్నాయి. శుధ్ధి చేసుకొని, సాగునీటిని , త్రాగునీటిని సమకూర్చుకోవచ్చు. విద్యుత్ ను కొన్న వేల మెగావాట్లు ఉత్పత్తి చేసుకోవచ్చు. సీమాంధ్ర ప్రజలు, యువకులు, వృధ్ధులూ కూడ ఎంతో శ్రమ పడే తత్వం కలవారు. అందుచేత అతిగా చింతించన్ పనిలేదు.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.