bifurcaton, విభజన, బిజెపి, కాంగ్రెస్, సోనియా
ఎవరినీ గాయపరచకుండా, బాధ పెట్టకుండా తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటానికి ప్రయత్నిస్తున్నామని కేంద్ హోం మంత్రి శ్రీ సుశీల్ కుమార్ షిండే గారు అన్నారు. శ్రీవారి కోరిక మంచిదే. కానీ అది 201౩ లోక్ సభ శీతాకాలం సమావేశాల్లోగా కుదరదు.
సోనియా గాంధీ గారు గానీ, రాహుల్ గాంధీ గారు గానీ, మన్మోహన్ సింగ్ గారు గానీ, సుశీల్ కుమార్ Shinde గారు గానీ ఇంతవరకు సీమాంధ్ర ప్రజల ముఖం చూడలేదు. ఏదైనా సభ పెట్టి వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేయలేదు. వోట్లుకావలసి వచ్చినపుడు, చేతులు బాగానే ఊపుతారుగా. ఇప్పుడు సీమాంధ్ర ప్రజలముందుకు వచ్చి తామేం చేయబోతున్నారో చెప్పటానికి భయం ఎందుకు. భయంకాకపోతే, ఎంతకాలం తీరిక లేదనే నెపంతో కాలక్షేపం చేస్తారు? బిల్లు పెట్టక ముందు ప్రజలకు వివరిస్తారా, లేక వాతలు పెట్టి బర్నాల్ రాస్తారా?
ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ పాటించిన వ్యూహం ఏమిటంటే, శ్రీ కావూరి సాంబశివరావుకి, శ్రీ జే.డీ.శీలంకి, మంత్రి పదవులనిచ్చి వారిని లోబరుచుకోవాలని ప్రయత్నించటం. అది కొంతవరకు ఫలించినట్లే కనిపిస్తుంది.
ఈసారి సోనియా గాంధీ గారు గానీ, రాహుల్ గాంధీ గారు గానీ, మన్మోహన్ సింగ్ గారు గానీ, సుశీల్ కుమార్ మోడీగారు సీమాంధ్ర ప్రజల ముందుకు వచ్చి చేతులు ఊపగలుగుతారని అనుకోటం దుర్లభం. హెలికాప్టర్ నుండే చేతులు ఊపి వెళ్ళిపోతారని నమ్మవచ్చు. అఖిలభారత బిజేపి నేతలకు, ఆభాగ్యం కూడ దక్కక పోవచ్చు.
లోక్ సభలో బిజెపి తెలంగాణ బిల్లుకు అడ్డం పడుతుంది అనుకుంటే, అది ఒక భ్రమ. అడ్డు పడితే, వారు కిషన్ రెడ్డికి, దత్తాత్రేయకు, విద్యాసాగర్ రావుకు తమ ముఖం చూపలేరు. దానికన్నా, కేంద్రంలో అధికారం లోకి వస్తే, శ్రీ వెంకయ్యనాయుడికి ఒక మంత్రి పదవి, సీమాంధ్ర బిజెపి నేతకు, ఒకచిన్న పదవి పారేస్తే, పని నడుపుకోవచ్చు అని బిజేపి అధిష్ఠానం భావిస్తూ ఉండ వచ్చు.
2004 నుండి 2013 వరకు నిద్ర పోయినందుకు కాంగ్రెస్ కి, 1999 నుండి 2004 వరకు నిద్ర పోయినందుకు బిజేపి వారికీ ఈ దుస్థితి తప్పదు.
శ్రీ సుశీల్ కుమార్ షిండే గారికి నిజంగా ఎవరినీ గాయపరచకుండా, తెలంగాణ ఏర్పరచాలనేకోరిక ఉంటే, తక్షణమే సీమాంధ్ర రాజధానులు ఏక్కడ ఉండాలనే ప్రశ్నను నాయకులముందు, ప్రజలముందు ఉంచాలి. తెలంగాణవారికి కూడ, హైదరాబాదుని తప్ప వేరే పట్టణాలను రాజధానులుగా కోరుకోమని చెప్పాలి.
ఆయన ఈ ముఖ్యవిషయాన్ని పట్టించుకోకుండా, తెలంగాణాను ముందుకు నెట్తే , ఇంటెలిజన్స్ ఛీఫ్ గారు ఇప్పటికే ఊహించి, రాబోయే తుఫానులను చెప్పినట్లుగా జరుగుతుంది. స్కాట్ లాండు ప్రజలు ఇంగ్లండు నుండి స్వాతంత్ర్యం కోరటానికి ౩౦౦ ఏళ్ళు పట్టింది. స్వాతంత్ర్యం వచ్చిన 40 ఏళ్ళకే సిక్కులు ఖలిస్థాన్ ఉద్యమాన్న లేవదీశారు. సీమాంధ్ర ప్రజల్లో అవివేకులు , ఉద్రేకులు, ఎవరైనా ఉంటే, స్వతంత్ర సీమాంధ్ఱ లేక స్వతంత్ర కోస్తాంధ్ర లేవదీస్తే, పంజాబ్ విశ్రాంత డీజీపీ శ్రీ గిల్ ను సీమాంధ్రకు పంపాల్సి రావచ్చు. రక్షణ మంత్రి ఆంథోనీ కొంతవరకు వాస్తవిక ధోరణిలో ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తుంది. హోం మంత్రి, రక్షణ మంత్రి కలిసి , శ్రీమతి సోనియా గాంధీ గారిని కలిసి రాష్ట్ర విభజనను ఎన్నికల తరువాత చేపట్టటం మేలు.
సందట్లో సడేమియాలాగ, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయల తాగునీటి పథకాన్ని తన స్వంతజిల్లాకు కేటాయించుకున్నారు. ఇదే అదనుగా తెరాస నేత హరీష్ రావు హైకోర్టులో కేసు వేశారు. ఇది గాక టెండర్లలో గోల్ మాల్ జరిగాయని వార్తలు వచ్చాయి.
రాయలసీమ నేతలకు, ముఖ్యంగా కర్నూల్, అనంతపురం జిల్లాల వారికి ప్రత్యేక రాష్ట్ర అభిలాష కన్నా, రాయల తెలంగాణాలో కలసి, హైదరాబాదుపై పెత్తనం చెలాయించా లన్న కోరిక బలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. పత్రికల కథనం ప్రకారం, రాయలసీమకు చెందిన ఒక కేంద్రమంత్రిగారు ఎంపీడీవోల ద్వారా వేలాది గ్రామాల సర్పంచులపై ఒత్తిడి చేయించి, రాయలతెలంగాణాకు అనుకూలంగా తీర్మానాలపై సంతకాలు పెట్టించి అధిష్ఠానానికి అందించటానికి సిధ్ధ పడుతున్నారట. రాయలసీమనుండి చీలిపోయి తెలంగాణాలో కలవాలనుకోటం, రాయలసీమకు ద్రోహం చేయటమే.
రాయలసీమలో నాలుగు జిల్లాలే ఉన్నా దానికి ఉన్న వనరులు, చరిత్ర, జనాభా, ప్రత్యేకరాష్ట్రం కోరటానికి అనుకూలంగానే ఉన్నాయి. అచ్చమ్మ పెళ్ళిలో బుచ్చమ్మ శోభనం లాగా , Centre తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చే సమయంలోనే ప్రత్యేక రాయలసీమను కూడా సాకారం చేసుకుంటే సరిపోతుంది. మరల ఈ సువర్ణావకాశం పాతికేళ్ళదాకా రాకపోవచ్చు.
ముఖ్యమంత్రి శ్రీకిరణ్ కుమార్ రెడ్డి గారి సోదరులు వసూళ్ళకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు చేసిన ఆరోపణలపై దర్యాప్తు అవసరం. వారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లయితే, వారిపై కేసులు పెట్టి , నిరూపించి, వారిని జైలుకు పంపచ్చు. ఇటువంటి ఆరోపణననే విశ్రాంత డీజీపీ శ్రీ రమేశ్ రెడ్డి చేశారు. ఇంతవరకు ఆయన ఆరోపణలపై దర్యాప్తు జరగలేదు. కేంద్రం ఈవిషయంలో ఎందుకు నిద్ర పోతున్నట్లు? దీనికి సమైక్యాంధ్ర , తెలంగాణ ఉద్యమాలకు సంబంధం లేదు.
తెరాస నేత శ్రీ కె.టీ.ఆర్. పై ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించిన కథనాలపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు.
ఈరాష్ట్రం ఏమై పోతుందో ఏమిటో?
Added on 29.04.2014 నాడు జోడించబడింది
పోలింగుకి ఇంకా వారమే సమయమే ఉంది. ఇంతవరకు, సోనియా గానీ, రాహుల్ గాంధీ గానీ, నరేంద్రమోడీ గానీ, సుష్మా స్వరాజ్ గానీ శేషాంధ్రలో పర్యటించి ప్రజలముఖం చూసి చేతులు ఊపలేదు. వస్తే ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తారో ఊహించనలవి కాకుండా ఉంది. వారెవరూ వస్తారని నేననుకోటం లేదు.
కేంద్రహోం శాఖ వారు , శేషాంధ్ర రాజధాని ఎక్కడ ఉండాలి అనే విషయం పై ప్రజల సూచనలను ఆహ్వానించారు, సంతోషమే. కానీ ఇది ఒక మొక్కుబడి తంతు అనే విషయం శేషాంధ్ర ప్రజలకు తెలియదా? శేషాంధ్రను ఒక మధ్య సైజు రాష్ట్రంగా ఉండనిచ్చే కన్నా, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమలు గా విడదీయటమే మేలు. ఈ రాష్ట్రాలు సైజులో జనాభాలో గానీ, పంజాబ్, హరియాన, కేరళ, హిమాచల్ ప్రదేశ్ మొ|| రాష్ట్రాలతో సమానంగానే ఉంటాయి. అందువలన ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు. ప్రజలు హింసాయుత ఉద్యమాలు చేపట్టే దాకా ఆగేకన్నా, ముందుగానే వారికేమి కావాలో ఊహించి ఇవ్వటమే మేలు.
పదవులు పంచిపెట్తేనో, సీఆర్ పిఎఫ్ ను పంపి చావగొట్టి చెవులు మూస్తేనో ప్రజలు ఉద్యమాలు చేపట్టరనుకోటం అనుకోటం ఒక భ్రమ. అది తాత్కాలిక శాంతిని కొనుక్కునే ఒక చిట్కాయే తప్ప శాశ్వత పరిష్కారం కాదు.
నల్లమల కొండలు, ఘాట్ లు, రాయలసీమకు , కోస్తాకు మధ్యలో - రోడ్డు , రైలు రవాణాకి తీవ్ర ప్రతిబంధకం. టైగర్ రిజర్వు ఫారెస్టు గుండా ప్రయాణించాల్సి వస్తుంది. కర్నూలు రాజధానిగా ఉండగా ఇటువారటు, అటువారటు ప్రయాణించలేకే, కర్నూలుకి హైదరాబాదు సౌకర్యమని, విజయవాడకి హైదరాబాదు సౌకర్యమని సమైక్య ఆంధ్రప్రదేశ్ అనే బురద ఊబిలోకి దూకారు. ఇపుడు దాన్ని కడుక్కోటానికి బయటకి వచ్చారు. ఈసందర్భంగా సీమాంధ్రులకు కొన్ని మానసిక గాయాలు తగిలాయి.
1957లో విశాలాంధ్రప్రదేశ్ కి వెళ్ళటానికి కులాల కుమ్ములాట కూడ ఒకకారణం. కోస్తాలో డామినేటింగ్ కులం వేరు. కర్నూలు, కడప, అనంతపురాల్లో డామినేటింగ్ కులం వేరు. చిత్తూరు లో రెండుకులాల డామినేషన్ ఉంది. జనం అంతా కాకపోయినా, గ్రామపెద్దలంతా, కులాలనే పాములచేత కరువబడ్డవాళ్ళు.
ఇపుడు కొత్త రాజధాని నిర్మాణానికి వేలకోట్లేవో వస్తాయని నేతలు, గుత్తేదారులు కాచుక్కూర్చున్నారు. రాజధాని వస్తుందని అనుమానం ఉన్న ప్రతిచోటా, అంగుళం చోటు లేకుండా రియల్టర్లు, స్పెక్యులేటర్లు కొనిపారేశారు. నాలుగు నగరాల్లో ఏఒక్కనగరానికి రాజధాని వచ్చినా , మిగిలిన మూడు నగరాల రియాల్టర్లు ఉద్యమాలకు ఇంధనానికి సమకూరుస్తారు.
అంతం కాదిది ఆరంభం.
18.6.2014 నాడు అదనంగా వ్రాయబడింది
శ్రీచంద్రబాబు నాయుడు గారు, శ్రీ కె.యి. కృష్ణమూర్తిగారు రాజధాని విగుంతే లోనే ఉంటుందని ఊదర కొట్తూ అక్కడి రియాల్టర్ల లావాదేవీలకు ఊతమిస్తుంటే, చిత్తూరు వాణిజ్యవేత్త అయిన శ్రీగుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గారు పెట్టుబడులు ఇక్కడ పెట్తామని ప్రజలకు ఆశలకిక్కు లెక్కిస్తుంటే, రాయలసీమ వారు ఉత్తరాంధ్రవారు మౌనంగా ఉండటం గమనార్హం. ఎలాగైనా 20,000 ఎకరాల సాగు భూమిని రైతులనుండి గుంజుకొని రాజధానిని నిర్మించి, ఆచుట్టు ప్రక్కల తాము బినామీ పేర్లతో కొని పారేసిన భూముల విలువ పెంచుకోక పోతే, మన నేతలకు నిద్రి పట్టే లాగా లేదు.కోటి డాలర్ల ప్రశ్న ఏమిటంటే మన రాష్ట్రాన్ని జ్యోతిష్కులు వాస్తు సిధ్ధాంతులు పాలించబోతున్నారా, రియాల్టర్లు, గుత్తే దార్లూ పాలించ బోతున్నారా, అనేదే. శ్రీనారా లోకే ష్ గారు సాహెబ్ జాదా పట్టాభిషేకానికి రెడీ కావటమే మిగిలింది.
24.6.2014 నాడు జోడించినది
రాజధానుల విషయం నిర్ణయం తీసుకోకపోయినా, ప్రతి జిల్లా కేంద్రానికీ, ఏదో ఒక శాఖకు చెందిన రాష్ట్రస్థాయి డైరక్టరేట్ ను ఏర్పాటు చేస్తే, వికేంద్రీకరణ ఇఫెక్టివ్ గా జరుగుతుంది. అందరూ పోలోమని విజయవాడ, గుంటూరు, మంగళగిరి, గన్నవరం, ఏలూరులకి ఊరేగ వలసిన అవసరం ఉండదు. ఆశాఖకు చెందిన, మంత్రి కార్యాలయాన్నీ, రాష్ట్రస్థాయి సచివాలయ విభాగాన్ని కూడ, డైరక్టరేట్ నెలకొల్పే జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేస్తే, ప్రతిదానికీ ఇంటర్ నెట్, మొబైల్ ఫోన్లు, వీడియో కాన్ఫరెన్సులు, వీడియో అప్ లోడింగులు ఉంటాయి కాబట్టి రికార్డుల నిర్వహణలో కష్టం ఉండదు. కేవలం అసెంబ్లీ, ముఖ్యమంత్రి కార్యాలయం, రాజ్ భవన్, లను మాత్రమే కొత్త రాజధానిలో ఉంచుకుంటే, 20,000 హెక్టారుల భూసేకరణ, ఫ్లైవోవర్ల నిర్మాణం, మెట్రోల అవసరం ఉండదు. కేంద్రం నిధులు ఇవ్వటం, వాటిని మనం వాడుకోటం మంచిదే, కానీ మబ్బుల్లో నీళ్ళు చూచి ముంత ఒలకబోసుకోలేం కదా. వికేంద్రీకరణ వల్ల జిల్లా కేంద్రాలలో కొంత భూస్పెక్యులేషన్ జరిగినా, ప్రాంతీయ వాదాలకు చోటుండదు. తరువాత ప్రతి జిల్లావారికీ తాము రాష్ట్ర అభివృధ్ధి లో భాగస్వాములమే నన్న భావం కలుదుతుంది.ప్రస్తుతం మనకు ఒక అవకాశవాది, వెన్నుపోటుదారు, బినామీ ఆస్తులు భారీగా ఉన్నాయని చెప్పబడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండగా, లక్షకోట్ల అవినీతి ఆరోపణలు, సీబీఐ కేసులు ఎదుర్కుంటున్న వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తులను అధికార పీఠం ఎక్కించిన ఆంధ్రప్రదేశ్ వోటర్లు, ఎం.ఎల్.ఎ లు ధన్యులు.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.