bifurcation, విభజన, రాష్ట్రచరిత్ర, ప్రకాశం, కులాలు
రాష్ట్ర విభజన, ప్రత్యేక తెలంగాణా వాగ్దానం, 2004 లో అధికారం లోకి రావటానికి, గులాబీ కండువా కప్పుకున్న శ్రీమతి సోనియా గాంధీ, వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన కుట్ర అని అర్ధం అవుతుంది. ఆవాగ్దానాన్ని, అమ్మగారి గులాబి కండువాని పట్టించుకోకుండా, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, ధృతరాష్ట్రుల్లాగా కళ్ళు మూసుకోటం వల్ల ఇరు ప్రాంతాల ప్రజలు నానా బాధలు పడుతున్నారు.
తన్నుకున్నది దుర్యోధనుడు, కర్ణుడు, ధర్మరాజు, భీమార్జునులే అయినా, 18 అక్షౌహిణీల సైన్యం , వేల సంఖ్యలో గుర్రాలు, ఏనుగులు, ప్రాణాలు కోల్పోయాయి. లక్షలాది మంది స్త్రీలు విధవ లయ్యారు. గీతలో అర్జునుడు భయపడ్డట్లుగా వర్ణ సంకరం జరగలేదు కానీ, అతి భయంకర విధ్వంసం జరిగి ఉండాలి.
ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న విభజన రాజకీయాలు కూడ, జన నష్టానికి, బస్సుల వంటి ప్రజల ఆస్థుల విధ్వంసానికి దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి.
అసలు 1956లో ఏమి జరిగి ఈ కృత్రిమ జరాసంధుడి కాయంలాంటి అతుకులబొంతను తయారు చేశారు, అనే విషయాలు, కూడా పరీశీలనాంశాలే. విశాలాంధ్రలో తమకు సంక్షేమం ఉండదనే భయంతో, తెలంగాణా ప్రజలు గానీ, రాయలసీమ ప్రజలు కానీ ఉన్నప్పుడు, అసలు విశాలాంధ్రనే ఏర్పాటు చేయకూడదు.
కన్న తండ్రి లాగా పాలించే నిజాం ప్రభువు, జాగీర్ దారులు, దొరలు, పటేల్ పట్వారీలు, వారికి ఉండగా, ఆవునుండి దూడలను వేరు చేసినట్లుగా, సర్దార్ పటేల్ వారిని ఎందుకు విడతీశాడో ఏమిటో?
తెలంగాణా ప్రజలకు, నేతలకు, నిజాం బానిసత్వం కొనసాగుతున్నప్పుడు, బూర్గుల రామకృష్ణారావు వంటి త్యాగశీలురైన నేతలు, ఎందుకు తొందర పడ్డారో అర్ధం కావటంలేదు.
1953 నాటి కర్నూలు లో సౌకర్యాలు లేని మాట నిజమే అయినా కొద్ది కాలం ఓర్చుకుంటే, కొత్తరాజధానిని పట్టాలపైకి ఎక్కించటం సాధ్యమయ్యేదే.
ఆ ప్రయత్నం చేయకుండా, హైదరాబాదుకు ఉరకటంలో ప్రజాహితం కాకుండా, కులరాజకీయమేదో జరిగిందనే అభిప్రాయం కలుగుతుంది.
షరతులతో కూడిన విలీన ఒప్పందాలు , కార్ల్ మార్క్స్ చెప్పినట్లుగా మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలన్న సిధ్ధాంతానికి అనుగుణమైనవి.
మిగిలిన పెద్ద మనుషులు గూడు పుఠాణీ చేసుకొని, ఆచరణలో సాధ్యంకాని ఒప్పందాలు చేసుకొని , ఆపెద్దమనుషులు తమ ఆశలను తీర్చుకొని, తమ భయాలను వదిలించుకుంటే, నేటి ప్రజలు, నానా బాధలు పడటం ఎంతవరకు సమంజసం?
తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యతను కలిగి ఉంటారా, పెద్దమనుషుల ఒప్పందాలను అమలు చేసే బాధ్యతను కలిగి ఉంటారా? ముఖ్యమంత్రులు అటు పెద్దమనుషుల ఒప్పందాలను అమలు చేయకుండా, చట్టాలనీ అమలు చేయకుండా, నియంతలై పోయి, వేలకోట్ల ఆస్తులను సంపాదించుకొని తమ వారసులను బాగు చేసుకున్నారు. మరి ప్రజల సంగతి ఏమిటి?
1956 నాటి పెద్ద మనుషుల ఒప్పందంలో ప్రకాశంగారి పాత్ర ఎందుకు లేదో అర్ధం కాదు. ఆయనను మూలకూర్చోపెట్టి ముసలమ్మను చేశారా?
పెద్ద మనుషుల ఒప్పందంలో సంతకాలు పెట్టిన వారి పేర్లు:
తెలంగాణ తరఫున: బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జెబి నరసింగరావు.
ఆంధ్ర తరఫున: బెజవాడ గోపాల రెడ్డి, నీలం సంజీవ రెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు.
పై పేర్లను గమనించినప్పుడు, ఈకాలం వలెనే, ఆకాలంలో కూడా, తెలంగాణ లో కులం నంబరు 1కి 50% వచ్చింది. ఆంధ్రాలో కూడ కులం నంబరు 1కి 50% వచ్చింది.
నీలం సంజీవ రెడ్డి జాతీయ స్థాయిలోకూడ, గ్రూపు రాజకీయాలకు పేరొందిన వాడు. ఆంధ్ర ప్రదేశ్ లో అతిస్వార్ధ రాజకీయాలకు నాంది పలికిన వాడిలో ఒకడిని గా గుర్తించ వచ్చు. తాడి తన్ను వాడిని తల దన్ను వాడు ఉండునట్లు, గుడిని మింగేవాడుంటే= గుళ్ళో లింగాన్ని కూడ మింగేవాడున్నట్లు, నీలం సంజీవరెడ్డిని, కాసు బ్రహ్మానంద రెడ్డిని గిరికీలు కొట్టించ కలిగింది, ఇందిర ఒక్కతే.
మర్రి చెన్నారెడ్డి స్వార్ధరాజకీయం గురించి తెలియని వారు లేరు. ఇందిరా గాంధీ ఉత్తరప్రదేశ్ గవర్నర్ గిరీ ఇవ్వజూపగానే తెలంగాణా ఉద్యమాన్నీ నీరు గార్చ గలిగిన వాడు.
నీలం సంజీవరెడ్డి, చెన్నా రెడ్డి కలసి తమ స్వార్ధం కొరకు చేసిన కుట్రలో, తెలుగు వారందరు ఏకంకావాలి అనే నినాదాన్ని తెచ్చి ఆటలాడుకున్నారా. నీలం సంజీవరెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ప్రధమ ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు.
కోస్తాలో భూకులం నంబర్ 2 వారి పాత్ర ఏమిటో తెలియదు. ఈభూకులం నంబర్ 2 వారిని అదుపులో పెట్టటానికి, తెలంగాణ భూకులం నంబర్ 1, ఆంధ్ర భూకులం నంబర్ 1 ఏకమై ప్రజలను గొర్రెలుగా మార్చారా?
వీటిని పరిశోథించాలంటే, ప్రఖ్యాత అపరాధ పరిశోథకుడు షెర్లాక్ హోం (సర్ ఆర్ధర్ కానన్ డాయిల్ విరచితం) గారికి కూడ కుదురుతుందో లేదో అనుమానమే.
ప్రకాశంగారి అసంపూర్ణ ఆత్మ కథను, తెన్నేటి విశ్వనాథంగారు ప్రజల ముందుకు తెచ్చారు. దానిని పరిశీలిస్తే గానీ అసలేం జరిగిందో కొద్దిగా తెలియవచ్చు. దానిని కూలంకషంగా పరిశీలించిన పాఠకులు ఎవరైనా ఉంటే, తమ వ్యాఖ్యను ఇక్కడ వ్రాస్తే బాగుంటుంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.