మహాభారతం, తిక్కన, సినిమాలు, వ్యాసుడు, పద్యకవిత్వం
అర్జునుఁడు పేడి రూపమున విరటుఁగొల్వ వచ్చుట.
పాండవుల అరణ్యవాసం ముగిసింది. అజ్ఞాతవాసం మొదలవ్వాలి. పాండవులు ఎలా ముందుకు వెళ్ళాలో, ఒకరితో నొకరు చర్చించుకొని, విరటుడి కొలువులో చేరాలని నిర్ణయించుకున్నారు. తమ ఆయుధాలను ఒక స్మశానంలో, ఒక శమీ వృక్షం పైన దాచి, ఒక్కొక్కరుగా విరాటనగరంలోకి ప్రవేశించి, విరటుడి కొలువుకూటానికి చేరుకుంటున్నారు.
ధర్మజుడు కంకుభట్టుగా కొలువు సంపాదించాడు. భీముడు , వలలుడిగా వంటవాడి పని సంపాదించాడు. ఇప్పుడు అర్జునుడు, బృహన్నల వేషంలో విరటుడి కొలువులోకి ప్రవేశించాడు. అతడి ముగ్ధమనోహర రూపాన్ని చూసి విరటుడు, సభాసదులు ముగ్ధులయ్యారు. విరటుడు అంటున్నాడు.
తిక్కన విరచిత ఆంధ్రమహాభారతం, విరాట పర్వం, ప్రథమాశ్వాసం, 231వ పద్యం.
మత్తేభం (పద్యం యొక్క ఛందస్సు).
వనితావేషము గలిగియు న్న యది చెల్వం బాఁడు చందంబు గా
దు నిరూపింప మహానుభావతయు నిర్దోష త్వమున్ రాజసం
బును శోభిల్లెడు నెవ్వడే నొకజగత్ పూజ్యుండు క్రీడార్ధమి
ట్లొనరం దాల్చిన రూపుగావలయు మీ రూహింపుఁడా యట్లగున్.
ఆఁడు చందంబు = స్త్రీ పధ్ధతి కాదు. ఇక్కడ అరసున్నా వినియోగాన్ని గమనించండి. మనం అరసున్నాల వాడకాన్ని మానేసి ఒక వందేళ్లు అయి ఉంటుంది. అరసున్న తీసి వేస్తే, ఆకాలంలో, ఆడు= ఆటలాడు అనే అర్ధం తీసేవారేమో.
మహానుభావతయు, నిర్దోష త్వము, రాజసము , జగదేక పూజ్యుడు -అర్జునుడిని ఎంత చక్కగా వర్ణించాడో గమనించండి.
విరాటరాజు అభిప్రాయంతో సభాసదులు కూడ ఏకీభవించారు.
బృహన్నల విరటుడితో నిన్ను కొలువటానికి వచ్చానన్నాడు.
విరటుడు:
ఉత్పలమాల పద్యం.
ఆయతబాహులున్ వెడఁదయైన సమున్నత వక్షమున సరో
జాయతలోచనంబులుఁ బ్ర్ససన్న ముఖంబు ను ఉదాత్త రేఖయుం
గాయజుఁ గ్రేణి సేయు ననఁ గౌశికు మీఱు ననంగ విభ్రమ
శ్రీ యును బెంపునుం గలుగఁ జేసి విధాతృఁడు పేడిఁ జేసెనే.
శార్దూలపద్యం.
మత్ కోదండచయంబులోన నొక సమ్మానా ర్హ చాపంబు భా
స్వత్ కాండంబులు హేమచంద్రక కన ద్ వర్మంబు నీకెంతయు న
సత్కారంబున నిచ్చి వాహన పరిష్కారాంక సంభావ్య సం
పత్ కల్యాణునిఁ జేసి వైభవము దర్పంబునన్ విజృంభింపఁగన.
కంద పద్యం.
ఏము నిను మత్స్యరాజ,
శ్రీ మహిమకు నెల్ల యుక్తు జేయఁ దలంపం
గా మామనోరథమునకు,
నీమాట విరుధ్ధమయ్యె నిది యెట్లొక్కొ.
చివరి కందం చూడండి. విరటుడు , బృహన్నలను, మత్స్యరాజ్య లక్ష్మికి పట్టాభిషిక్తుడిని చేస్తానంటున్నాడు. మా మనోరధానికి విరుధ్ధంగా మాట్లాడుతున్నావు. ఇది ఎట్లాగా! అని ఆశ్చర్యపోతున్నాడు.
వైబీరావు గాడిద వ్యాఖ్య: అంతా ఉట్టిదే. రాజుల మాటలు అలాగే ఉంటాయి, మన నేతల మాటల్లాగా. ఇదిగో ఐఐటీ, అదిగో అంతర్జాతీయ విమానాశ్రయం, విమానం ఎక్కటానికి రెడీ కాండి లాగా.
సరే , ఏదో బృహన్నల వివరణ ఇచ్చుకున్నాడు, డాన్స్ మాస్టర్ నౌకరీ ఇవ్వమన్నాడు. కానీ బృహన్నలతో, విరటుడు ఎంతో సగౌరవంగా వ్యవహరించాడు. ఉత్తరను రప్పించాడు. బృహన్నలను గురువుగా పరిచయం చేసి, గురువుతో ఎలా మెలగాలో హితవు చెప్పాడు.
నాగరికత్వంబునకుఁ చిత్తంబు రంజిల్ల మధుర సల్లాపంబు సేసి, కర్పూర సహితంబగు తాంబూలంబు వెట్టి చిత్రంబులగు చీనాంబరంబులిచ్చి మణి మయంబులగు నాభరణంబు లొసంగి, సంభావించి, యవ్విభుండు,
.... .... ....(కొన్ని పద్యాలు)
అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని గురువుకి చక్కగా చెప్పి , ఉత్తరకు గురువుయొక్క విలువను బోధించాడు.
ఆటవెలది పద్యం.
ఎల్ల చుట్టములు తల్లియుఁ దోడును,
జెలియుఁ బరిజ నంబుఁ జెలువ నీకు
గురువ యింక నొక్క కొఱఁతయు లేదిందుఁ,
జేరి బ్రతుకు బుధ్ధి గౌరవమున.
చుట్టాలు, తల్లి , తోడు, స్నేహితురాలు, సహచరులు, అన్నీ నీకు గురువే, 'బుద్ధిగా గౌరవంతో బ్రతుకు' అని చక్కగా ఆదేశించాడు. బృహన్నలను ఎంతో గౌరవించాడు.
తిక్కన ఇంత విశదంగా ఈ ఘట్టాన్ని 27 పద్యాల్లో చిత్రించి మనకు సాక్షాత్కరింప చేశాడా. వ్యాసుడు దీన్ని 1౦ శ్లోకాల్లో తేలగొట్టాడు. పైగా విరటుడిచేత బృహన్నలను అవమానింపచేశాడు అనలేం కానీ , రాజులు డాన్స్ మాస్టర్లతో ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తింపచేశాడు.
వ్యాస మహాభారతం. విరాటపర్వం. 1౦వ ఆధ్యాయం. మొత్తం 1౩ శ్లోకాలు. 5,6,7 శ్లోకాలు, విరటుడు బృహన్నలను పొగిడిన పొగడ్తలు.
విరటుడు బృహన్నలతో అంటున్నాడు.
సర్వోపపన్నః పురుషో మనోరమః; శ్యామో యువా వారణయూధపోపమాః
విముచ్య కంబూ పరిహాటకే; శుభే విముచ్య వేణీమ్ అపిన్ అహ్య కుండలే
శిఖీ సుకేశః పరిధాయ చాన్యధా; భవస్వ ధన్వీ కవచీ శరీ తదా
ఆరుహ్య యానం పరిధావతాం భవాన్; సుతైః సమో మే భవ వా మయా సమః
వృథ్ధో హ్య అహం వై పరిహార కామః; సర్వాన్ మత్స్యాంస త్రసా పాలయస్వ
నైవంవిధాః క్లీబ రూపా భవన్తి; కదం చనేతి ప్రతిభాతి మే మనః .
సారాంశం: నా కొడుకుతో సమానంగా ఉండు. నేనేమో వృధ్దుడినైపోయాను. నాభారం తగ్గించు కోవాలనుకుంటున్నాను. ఈ మత్స్య రాజ్యం మొత్తాన్ని నీవే రక్షించు. పాలించు. నా దృష్టిలో నీ వంటి వ్యక్తి నపుంసకుడు అయ్యే అవకాశమే లేదు.
విరటుడి పొగడ్తలకు అర్జునుడు సోల కాలేదు. నాట్యాచార్యుడి ఉద్యోగం చాలన్నాడు.
పదో శ్లోకంలో, విరాటుడు బృహన్నలతో:
దదామి తే హన్త వరం బృహన్నలే; సుతాం చ మే నర్తయ యాశ్చ తాదృశీః
ఇదం తు తే కర్మ సమం న మే మతం; సముద్రనేమిం పృథ్వీం తవమ్ అర్హసి.
నీ ఇష్ట ప్రకారమే కానీలే అని ఊరు కోకుండా, 'సముద్రనేమిం పృథ్వీం తవమ్ అర్హసి'. సముద్రం వరకు ఈభూమి మొత్తాన్ని పాలించటానికి నీవు అర్హుడివి, అన్నాడు. అని ఊరుకున్నాడా? 11వ శ్లోకం చాలా కీలకం.
బృహన్నలాం తామ్ అభివీక్ష్య మత్స్యరాట్;
కళాసు నృత్తే చ తదైవ వాదితే
అపుంస్త్వమ్ అపి అస్య నిశమ్య చ స్థిరం;
తతః కుమారీ పురమ్ ఉత్సర్జ తమ్.
నృత్య,వాద్యాది కళలలో బృహన్నలను పరీక్షించి చూశాడు. నిజంగా నపుంసకుడో కాదో అని పరీక్షింపచేసి, నపుంసకుడే అని స్థిర పర్చుకున్నాడు. అప్పడు అంతఃపురం లోకి పంపాడు.
వైబీరావు గాడిద వ్యాఖ్య: విరటుడు బృహన్నల పురుషత్వాన్ని పరీక్షింపచేయటం (ఎలా? గదిలోకి పంపి, బట్టలు విప్పదీయించ, స్త్రీలచేత పరీక్షింపచేసి ఉండచ్చు). ఇది తప్పు అనికూడ అనలేము. అంతఃపురంలోకి, కొత్తవాళ్లను ఏపరీక్షలూ లేకుండా పంపటం ప్రమాదకరంకదా.
స్వర్గీయ కిషోర్ మోహన్ గంగూలీ, వ్యాసుడి సంస్కృత భారతాన్ని ఆంగ్లం లోకి అనువదించాడు. ఆ అనువాదం:
The king of the Matsyas then tested Brihannala in dancing, music, and other fine arts, and consulting with his various ministers forthwith caused him to be examined by women. And learning that this impotency was of a permanent nature, he sent him to the maiden‴s apartments. And there the mighty Arjuna began giving lessons in singing and instrumental music to the daughter of Virata, her friends, and her waiting-maids, and soon won their good graces. And in this manner the self-possessed Arjuna lived there in disguise, partaking of pleasures in their company, and unknown to the people within or without the palace.
తిక్కన వ్రాసిన, ఉత్తరకు హితబోధలు మొ|| వ్యాసుడు వ్రాయలేదు. వ్యాసుడు వ్రాసిన నపుంసకత్వ పరీక్షను తిక్కన వదిలేశాడు. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది ప్రధానంకాదు. తిక్కన కోణం లోంచి చూసినపుడు, నీవు ఈ భూమండలం మొత్తాన్నీ పాలించటానికి అర్హుడివి అన్నాక, మాస్త్రీల ముందు , నీగుడ్డలు విప్పి నీ నపుంసకత్వాన్ని ఋజువు చేసుకో అనటం అర్ధవంతంగా ఉండకపోవచ్చు కాబట్టి తొలగించి ఉండవచ్చు. గురువుకి తాంబూలం ఇవ్వటం, వస్త్రాలు,నగలు ఇవ్వటం, వంటివి తిక్కన చొప్పించినవి ఎంతో సొంపుగా ఉన్నాయి.
రాజుల అంతఃపురాలలో, నపుంసకులను కాపలా పెట్టటం, వివిధసేవలకు వినియోగించుకోటం ఆనాటి ఆచారం. నపుంసకత్వ పరీక్షలు కూడ ఆచారమే. ఈనాడు ప్రభుత్వోద్యోగాలకు కు, కొన్న కంపెనీల్లో ఉద్యోగాలకు ,వైద్య పరీక్షల్లాగా. అక్బర్ జనానాలో, 5000 మంది దాకా స్త్రీలు ఉండే వారట. నిజాం నవాబు జనానాలో కూడ అంతే. విజయనగర రాజులు కూడా ఏమీ తక్కువ తిన లేదు. అంతఃపురంలోకి చొరబడితే శిక్ష ఏమిటో పరిశీలంచాలంటే,మల్లీశ్వరి సినిమా చూడండి.
ముగింపు
నర్తనశాల చిత్రంలో బృహన్నల అవతారంలో స్వర్గీయ ఎన్ టీ ఆర్ ను గుర్తుకు తెచ్చుకోండి.
.
RELATED LINKS
Was Arjuna (Brihannala) used to sell old sarees in Dance Room (nartana SAla)? क्या अर्जुन (बृहन्नल) नर्तन शाला में पुराने शारी बेचते थे ? అర్జునుడు (బృహన్నల) నర్తనశాలలో ఉన్నప్పుడు అక్కిడి పాత చీరెలను అమ్ముకునే వాడా ? Click to go to Post No. 072.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.