రైతుల పరోక్షహత్యలు, ఆత్మహత్యలు అనేవి మనకు ఈనాటివి కావు. కొన్ని వందల సంవత్సరాలనుండి వారసత్వంగా వస్తున్నాయి.
15వ శతాబ్దంలో శ్రీనాథమహాకవి ఎంతో వైభవంగా బ్రతికాడు. కాని చివరిరోజుల్లో బ్రతుకుతెరువుకు కటకటపడి , వ్యవసాయం చేయవలసి వచ్చింది. ఈపద్యాలు చూడండి.
సీసపద్యం.
కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా
పురవీథి నెదురెండ పొగడదండ
యాంధ్రనైషథకర్త యంఘ్రి యుగ్మంబున
దగిలియుండెను గదా నిగళయుగము
వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత
వియ్యమందెను గదా వెదురుగొడియ
సార్వభౌముని భుజాస్తంభ మెక్కెను గదా
నగరి వాకిట నుండు నల్లగుండు
తేటగీతి.
కృష్ణ వేణమ్మ గొనిపోయె నింత ఫలము
బిలబి లాక్షులు తినిపోయె తిలలు పెసలు
బొడ్డు పల్లెను గొడ్డేటి మోస పోతి
నెట్లు చెల్లింతు టంకము లేడు నూర్లు
నువ్వులు, పెసలను, పిట్టలు (బిలబిలాక్షులు) తిన్నాయి. శ్రీనాథుడు, తన సేద్యాన్ని కృష్ణానది ఒడ్డున చేసినట్లున్నాడు. ఏరొచ్చి పంట కొట్టుకు పోయింది. సేద్యాన్ని బొడ్డుపల్లె అనే ఊళ్ళో చేశాడు. బొడ్డుపల్లె అనే గొడ్డేటిని నమ్మి మోసపోయానని దుఃఖిస్తున్నాడు. కౌలు గజపతుల వద్ద తీసుకున్నట్లున్నాడు. గజపతులు అంటే ఓఢ్రులు, అప్పటికే రెడ్డి రాజులను ఓడించి అధికారం నిరంకుశంగా క్రూరంగా చెలాయిస్తున్నారు. 700 టంకాల పన్ను కట్ట వలసి వచ్చింది. ఎలా చెల్లించ గలను, అని వాపోతున్నాడు.
ఓఢ్రులు శ్రీనాథుడికి సంకెళ్లు వేసి , చేతులకు వెదురు గొడియలు బిగించి, వీపుపై ఒక పెద్ద నల్లగుండుని పెట్టి, ఎదురెండలో, రోడ్లమీద తిప్పినట్లున్నారు. ఆబాథకు తట్టుకోలేక, శ్రీనాథుడికి ప్రాణం పోయినట్లుంది. కానీ ఆసమయంలో కూడ, అమ్మహాకవి, తన కవితా శక్తిని కోల్పోలేదు. తనను పోషించిన రాజులని తలచు కున్నాడు.
సీసపద్యం.
_______
కాశికా విశ్వేశు గలిసె వీరారెడ్డి
రత్నాంబరంబు లే రాయడిచ్చు
రంభ గూడె దెనుంగు రాయ రాహుత్తుండు
కస్తూరి కే రాజు ప్రస్తుతింతు
స్వర్గ స్థు డయ్యె వి స్సన మంత్రి మరి హేమ
పాత్రాన్న మెవ్వని పంక్తి గలదు
కైలాసగిరి బండె మైలార విభుడేగె
దినవెచ్చ మే రాజు దీర్పగలడు
తేటగీతి.
భాస్క రుడు మున్నె దేవుని పాలి కరిగె
కలియు గంబున నికనుండ కష్ట మనుచు
దివిజ కవివరు గుండియల్ దిగ్గు రనగ
అరుగు చున్నాడు శ్రీనాథు డమర పురికి
శ్రీనాథుడు వస్తున్నాడంటే , స్వర్గంలో ఉన్న కవుల గుండెలు గుబగుబ లాడాయిట. లబలబ లాడి ఉంటారు.
ఆకాలంలో ఎక్కువగా రైతులు తమ కుటుంబ అవసరాల కొరకే వ్యవసాయం చేసేవాళ్ళు. విత్తనాలు పాతపంటలవే. ఇప్పటిలాగా ప్యాకెట్ 1200 పెట్టి కొననక్కర లేదు. మార్కెట్ కొరకు, నగదు కొరకు పండించటం అనేది తక్కువ. ఎందుకంటే నాలుగోవంతో, మూడోవంతో, సగమో రాజుకు శిస్తుగా చెల్లించాలి. లేకపొతే వెదురు గొడియ, నల్లగుండు, ఎదురెండ, సంకెళ్ళు, సిధ్ధంగా ఉండేవి. ఆపండేది కుటుంబావసరాలకు, శిస్తుకు సరిపోయేది. ఆహారేతర అవసరాలు తక్కువగా ఉండేవి కనుక నగదు లేక పోయినా రోజులు గడిచేవి. కాబట్టి, ఆకాలంలో వ్యవసాయం ఒక వ్యాపారంగా మారలేదు.
నేటి పరిస్థితి పూర్తిగా భిన్నం. వ్యవసాయం నూటికి నూరపాళ్ళూ వ్యపారం అయ్యింది. అనధికారిక మౌఖిక కౌలుకు భూమిని తీసుకోటంతోనే నగదు చెల్లింపులు మొదలవుతాయి. హైబ్రిడ్ | లేక బీటీ విత్తనాలు నగదు పెట్టి కొనాలి. ట్రాక్టర్లకు ఎకరానికి ఇంత అని కట్టి దున్నించాలి. విత్తనాలు చల్లించాలి. కుటుంబ సభ్యుల స్థానంలో ప్రతి దానికీ కూలీలు. వారికి నగదు బట్వాడా చేయాలి. కలుపు తీయటానికి కూలీలు. పురుగు మందులు నల్లబజారులో కొనాలి. యంత్రాలతో వాటిని చల్లించాలి. ఎలుకలను పట్టుకోటానికి కూలీలు. ఇంత పెట్టుబడి పెట్టి శ్రమ పడ్డాక, అకాల వర్షాలకు, వరదలకు, మొత్తం కొట్టుకుపోతే అప్పులిచ్చిన వారికి ఏమి చెప్పుకోవాలి?
చిన్నయజమాన రైతులైనా, కౌలురైతులైనా, వ్యవసాయేతర కుటుంబ ఖర్చులు పెరిగి పోయాయి. పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివించాల్సి వస్తున్నది. రోగాలు వస్తే ప్రైవేటు వైద్య శాలలకు వెళ్ళ వలసి వస్తున్నది. ఆరోగ్యశ్రీ అనేది ఉన్నదని పేరే కానీ , రీయింబర్సుమెంట్లు రావని, రకరకాల పేర్లతో వారు ఎన్నో రకాలుగా డబ్బులు గుంజుతున్నారు. ఇంక ఆడపిల్ల పెళ్ళి చేసిన రైతు భూలోక నరకంలో ఉంటాడని చెప్పనవసరం లేదు. శ్రీనాథుడికాలంలో ఈబాధలు అంతగా లేవు.
వడ్డీ వ్యాపారులు నానా మాటలు అంటారు. వెదురు గొడియ, నల్లగుండు, ఎదురెండ, సంకెళ్ళు, ఉండవనే కానీ మాటలు సూదుల్లాగా నాటుకుంటాయి.
తిక్కనగారి కందం.
తనువున విరిగిన అలుగును
అనువున బుచ్చెంగవచ్చు అతి నిష్ఠురతన్
మనమున నాటిన మాటలు
వినుమెన్ని ఉపాయముల వెడలునె అధిపా!
శరీరంలో బాణాల ములుకులు గుచ్చుకుంటే వాటిని ఎలాగో అలాగా పీకేయవచ్చు. కత్తుల్లాంటి మాటలు మనస్సులో గుచ్చుకుంటే ఎన్ని ఉపాయాలను వాడినా వాటిని మరువలేము.
నీవు చావనైనా చావరాదా? నీ పెళ్ళాం పిల్లలకు సర్కారు వాళ్ళచ్చే పరిహారంతో నీ అప్పు తీరుతుంది. నీవు బ్రతికుంటే అప్పు ఎలాగో కట్టలేవు, చచ్చన్నా కట్టు అని వడ్డీ వ్యాపారులు, రైతులను ఆత్మ హత్యలకు ప్రేరేపించే అవకాశం ఉంది. వీటిని మనం పరోక్ష హత్యలనాలి.
వరదలు వచ్చినపుడు ప్రభుత్వం కొంత పరిహారం చెల్లించే మాట నిజమే అయినా, దానిని పెద్దరైతులు చేజిక్కించుకున్నంత తేలికగా బక్కరైతులు పొంద లేరు. పైరవీకారులు గుంట దగ్గర నక్కల్లాగా కాచుకొని ఉండి వాటిని ఇస్త్రీ బట్టల వాళ్ళకి అందేలా చూస్తారు. కౌలు రైతులకి చెందాల్సిన పరిహారాన్ని యజమాని కాజేస్తాడు, భూమి రికార్డుల్లో కాస్తుదారుగా యజమాని పేరు ఉంటుంది కానీ అనధికారిక కౌలురైతు పేరుండదు.
పంటల బీమా ఉంటుందని పేరే కానీ , బీమా ప్రీమియాలు తింటానికి బీమా కంపెనీలు ఇచ్చే ప్రాధాన్యత,వేగం, క్లెయిముల చెల్లింపుల్లో చూపటం లేదు.
ఇస్త్రీగుడ్డలవాళ్ళు అంటే మీ ఉద్దేశ్యం ఏమిటి?
ReplyDeleteగ్రామాల్లో రైతులు రెండు రకాలు. బడారైతులు పొలాలను స్వయంగా దున్నరు. జీతగాళ్ళతో దున్నిస్తారు. వారు బైకులపై, కార్లలో తిరుగుతూ ఉంటారు. వీరు ఎప్పుడూ కొత్తబట్టలన్నా కట్టుకుంటారు, మడత నలగని గంజి పెట్టిన ఇస్త్రీబట్టలైనా కట్టుకుంటారు. బక్కరైతుల బట్టలు మురికి ఓడుతూ ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లోకి ప్రవేశించి తమకు కావాల్సిందాన్ని లంచాలు పారేసి ప్రభుత్వంనుండి రాబట్టుకోలేరు. కంప్యూటర్ రంగంలో డిజిటాల్ డివైడ్ లాగ, గ్రామాల్లో డ్రెస్ డివైడ్ ఉంది. ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలను, పంపులను, డ్రిప్ యంత్రాలను, వరద పరిహారాలను, వేటిని ఇచ్చినా అవి ముందుగా చేరేవి తెల్లగుడ్డల వాళ్ళకే. మురికి లుంగీలవాళ్ళకికాదు.
ReplyDelete