మూఢ విశ్వాసాలు భారతీయులకు మాత్రమే ఉంటాయనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే. సైన్స్ పరంగా ఎంతో అభివృధ్ధి చెందాయని, మనం అనుకునే పాశ్చాత్య దేశాల శాస్త్రజ్ఞులు కూడా రకరకాల మూఢ విశ్వాసాలతో బాధ పడటాన్ని మనం గమనించ వచ్చు. మూఢ విశ్వాసాలను అమలులో పెట్టే తీరులో భేదం ఉండవచ్చు.
పాశ్చాత్య దేశాలకు, మనకు, ఒక పోలిక కూడా ఉంది. (వాళ్ళు, మనం, అందరం ఆర్యుల రక్తం కలిసిన వాళ్ళం కదా). పోలిక ఏమిటంటే, అమలు చేసుకునే టప్పుడు , ఎంత ఖర్చైనా సరే, వాళ్ళూ వెనకాడరు, మనమూ వెనకాడం. ముఖ్యంగా మన క ష్టార్జితం కాకుండా లంచార్జితమో, జనం డబ్బో, అయితే ఇంక చెప్పాలా భోగం!
పటేల్ విగ్రహానికి 2500 కోట్లా?
నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని కావాలని ఉవ్విళ్ళూరుతున్న వాడు. అయ్యగారు దేశ ప్రధాని అయితే, కొన్ని ట్రిలియన్ల భారత ప్రజా ద్రవ్యం వ్యయం చేసే అధికారం చేతిలోకి వస్తుంది. ఒక మధ్య శ్రేణి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగానే , కేవలం సర్దార్ పటేల్ విగ్రహారాధనకు రూ. 2500 కోట్లు ఖర్చు చేయటానికి సిధ్ధం అవుతున్నాడంటే, గుజరాత్ ప్రజలు ఎంత పేదలో ఆయనకు తెలియదనుకోవాలా? లేక విగ్రహారాధన వ్యామోహాన్ని ప్రజల్లోకి కైపెక్కించి తన సామ్రాజ్యాన్ని స్థిరీకరించు కోవాలనుకుంటున్నాడా?
సర్దార్ పటేల్ ను స్మరించుకోటంలో తప్పు లేదు. ఆయన స్మృతి ప్రజల్లో కలకాలం ఉండాలంటే, ఆయన ఆలోచనలను, ఆదర్శాలను, ఆచరణలోకి తెచ్చుకోటం సదా వాంఛనీయమే. విగ్రహాలతో ఆపని జరుగదు కదా. విగ్రహాలు దండలు వేయటానికి పనికి వస్తాయి. క్షీరాభిషేకాలు చేసుకోటానికి పనికి వస్తాయి. పక్షులు గూళ్ళు పెట్టుకోటానికి పనికి వస్తాయి. ద్వేషించే వాళ్ళు, చెప్పుల దండలు వేయటానికి పనికి వస్తాయి.
మాయావతి కూడా ఇలా విగ్రహాల వ్యామోహంలో పడిపోయి ఉత్తర ప్రదేశ్ లో కొన్ని వందలకోట్లు ఖర్చు చేసింది.
పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టగానే ఆయనపై భారత ప్రజలకు, తెలుగు ప్రజలకు , గౌరవం ఎంత శాతం పెరిగింది?
రష్యాలో బోల్షవిక్ విప్లవం కొత్త మోజు ఉన్న కాలంలో, మార్క్స్, లెనిన్, స్టాలిన్, విగ్రహాలను భారీ ఖర్చుతో ఏర్పాటు చేశారు. సోవియట్ విఛ్ఛిన్నానంతరం, వాటిని కూలగొట్టి , ఆ కంచును తుక్కు కింద వేలం వేయగా , ఆ తుక్కు భారత్ కు దిగుమతి అయ్యి , కరిగించబడి, పంజాబ్ లో water taps తయారీకి ఉపయోగ పడ్డాయి.
ఇరాక్ లో సద్దాం హుస్సేన్ విగ్రహానికి అమెరికా వారు ఏమి గతి పట్టించారో , మరువ లేని దృశ్యం.
ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారి విగ్రహాన్ని ఆయన బ్రతికి ఉండగానే విజయవాడ కెనాల్ రోడ్ లో నెలకొల్పారు. ఆయన బ్రతికి ఉండగానే వేరే బ్యాచ్ వారు ఆ విగ్రహాన్ని కాలువలోకి తోశేశారు.
హైదరాబాదు టాంకుబండుపై ఎన్టీఆర్ పెట్టించిన విగ్రహాలకు తెరాస వారు ఏమి గతి పట్టించారో అందరికీ తెలుసు.
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో రాజశేఖరరెడ్డి గారి విగ్రహారాధన నడుస్తున్నది.
కలకాలం ఒక్కరీతి గడువదు, నవ్విన కళ్ళే చెమ్మగిల్లవా ఆని రంగుల రాట్నం సినిమాలో ఒక పాట ఉన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని వేల గాంధీ , కొన్ని వందల నేతాజీ విగ్రహాలు దీనావస్థలో ఉన్నాయి. ఎన్టీఆర్ విగ్రహాలకు మటుకు తత్ పార్టీ వాళ్ళు రంగులు వేయటం వంటి పనులు చేస్తున్నారు.
దేవుళ్ళకు కూడా ఇటువంటి పరిస్థితులు వచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదు. ప్రస్తుతం షిర్దీ శాయిబాబా , అయ్యప్పల శకం నడుస్తున్నది.
విగ్రహారాధనలతో ప్రధాన సమస్య ఏమిటంటే, అవి వనరుల వృథాకు దారి తీస్తాయి. ఏటా షిర్దీ యాత్రలపై మనం ఎన్ని లక్షల లీటర్ల డీజెల్ వ్యయం చేస్తున్నామో, తలుచుకుంటే, భారత్ ఇంధన దిగుమతులు ఎందుకు అదుపు తప్పాయో అర్ధం అవ్వచ్చు.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.